మైనర్ల సోషల్ మీడియా వాడకంపై మిగిలిన దేశాలకు బ్రిటన్ భిన్నం బాస్

ప్రపంచాన్ని మరింత దగ్గరగా చేయాలన్న పేరుతో తెర మీదకు వచ్చి.. తన అసలు రూపాన్ని చూపిస్తూ.. ప్రపంచ యువతను ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2026-07-15 13:30 GMT

ప్రపంచాన్ని మరింత దగ్గరగా చేయాలన్న పేరుతో తెర మీదకు వచ్చి.. తన అసలు రూపాన్ని చూపిస్తూ.. ప్రపంచ యువతను ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా అన్నంతనే పలు దేశాల ప్రభుత్వాలు ఉలిక్కిపడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అంతేకాదు.. తమ దేశ యువతను అమితంగా ప్రభావితం చేయటమే కాదు.. దేశ పురోగతికి సైతం ఇబ్బందికరంగా మారిన సోషల్ మీడియాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వాధినేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి.

అలా అని సోషల్ మీడియాను బ్యాన్ చేయలేరు. అలా అని చూస్తూ ఉండిపోలేరు. దీంతో.. దీని వాడకంపై పరిమితులు విధించటం ద్వారా పరిస్థితి మరింత దిగజారకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. తాజాగా బ్రిటన్ తీసుకున్న నిర్ణయంతో మైనర్లు సోషల్ మీడియాను వినియోగించే తీరుకు ఎలా చెక్ చెప్పొచ్చన్నది ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఇండోనేషియా.. ఆస్ట్రేలియా.. బ్రెజిల్.. మలేషియా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. టర్కీ దేశాలు ఇప్పటికే నిషేధ అస్త్రాన్ని వినియోగిస్తే.. యూరోపియన్ యూనియన్ లోని 27 దేశాల కూటమి సైతం పదహారు సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీబియాను నిషేధించేందుకు వీలుగా చట్టాన్ని తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.

అదే సమయంలో ఫ్రాన్స్.. స్పెయిన్.. గ్రీస్.. ఆస్ట్రియా.. నార్వే లాంటి యూరోప్ దేశాలు సొంతంగా చట్టాలు తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు కెనడా ప్రభుత్వం ఇటీవల మైనర్లు (పదహారేళ్ల వయసు కంటే తక్కువ) సోషల్ మీడియా వాడకానికి అర్హులు కాదనన విషయాన్ని స్పస్టం చేస్తూ ముసాయిదా చట్టాన్ని ప్రవేశ పెట్టింది. భారతదేశంలోనూ ఇదే అంశంపై చర్చ మొదలైంది. అయితే.. భారత ప్రభుత్వం నిషేధం లాంటి నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదు.

అయితే.. తాజాగా బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి.. ఇప్పటికే మైనర్ల సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధిస్తూ తీసుకున్న నిర్ణయానికి మధ్యనున్న తేడాను చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఇదంతా చూసిన తర్వాత బ్రిటన్ మార్గాన్ని భారత్ ఎంపిక చేసుకుంటే మంచిదన్న భావన కలుగక మానదు. ఇంతకూ మిగిలిన దేశాలకు.. బ్రిటన్ తాజాగా తీసుకున్న నిర్ణయానికి మధ్యనున్న వ్యత్యాసాన్ని చూస్తే.. విషయం ఇట్టే అర్థమవుతుంది.

ఇతర దేశాల్లో వయసు ఆధారంగా పదహారేళ్ల లోపు అందరిని ఒకటిగా గుర్తిస్తూ.. బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. బ్రిటన్ లో మాత్రం అందుకు భిన్నమైన మార్గాన్ని అనుసరించింది. చిన్న పిల్లలకు పూర్తిగా నిషేధాన్ని విధిస్తూ.. పెద్ద టీనేజర్లకు సమయ నియంత్రణ విధించటం ఆసక్తికరం. మైనర్లపై బ్యాన్ విధించిన ఇతర దేశాల్లో ఒకటే విధానాన్ని అమలుచేస్తున్నారు. అదే సమయంలో 16-17 ఏళ్ల టీనేజర్లకు సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి అనుమతులు ఇస్తున్నారు.అయితే.. బ్రిన్ లో మాత్రం ఈ వయసులోని వారు అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సోషల్ మీడియా యాప్స్ డీఫాల్ట్ గా బ్లాక్ అయ్యే విధానాన్ని అనుసరించింది.

మిగిలిన దేశాల్లో అకౌంట్ క్రియేషన్..వయసు ధ్రువీకరణ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే.. బ్రిటన్ లో మాత్రం నిద్ర పాడు చేసే వాటి వాడకానికి బ్రేకులు వేసేలా నిర్ణయాన్ని తీసుకోవటం కనిపిస్తుంది. బ్యాన్ విధించిన దేశాల్లో పదిహేనేళ్ల వరకు సోషల్ మీడియాను చూడని పిల్లలు.. పదహారేళ్లు రాగానే ఒకేసారి దానికి బానిస కాకుండా ఉండేందుకు వీలుగా బ్రిటన్ తీసుకున్న నిర్ణయం ఉపయోగపడుతుంది.ఆస్ట్రేలియాలో పిల్లల మానసిక ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా చట్టం తెస్తే.. బ్రిటన్ మాత్రం టీనేజర్ల శారీరక ఆరోగ్యంతో పాటు.. రాత్రి వేళ నిద్ర పోయే అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే..టీనేజర్లకు సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్ విధిస్తే.. బ్రిటన్ మాత్రం.. చిన్న పిల్లలకు దానిని దూరంగా ఉంచుతూనే.. పెద్ద టీనేజర్లు దాని బారిన పడకుండా క్రమశిక్షణ విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా చెప్పాలి. అందుకే.. బ్రిటన్ మార్గాన్ని భారత్ ఎంచుకుంటే మంచిది.

Tags:    

Similar News