2027 వన్డే ప్రపంచకప్‌లో కొత్త రూల్స్.. మూడు దశల్లో టోర్నీ.. ఇక ప్రతి మ్యాచ్ అత్యంత కీలకం

అయితే, ఈసారి ఐసీసీ జట్ల సంఖ్యను 14కి పెంచడమే కాకుండా, మునుపెన్నడూ లేని విధంగా మూడు అంచెల (త్రీ-స్టేజ్) సరికొత్త ఫార్మాట్‌ను తెరపైకి తెచ్చింది.

Update: 2026-07-15 19:30 GMT

భారత ఉపఖండంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 (ICC ODI World Cup 2027) కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. టోర్నీని మరింత రసవత్తరంగా మార్చేందుకు..ప్రతి మ్యాచ్‌కూ ప్రాధాన్యతను పెంచేందుకు వీలుగా పూర్తిగా కొత్త ఫార్మాట్‌ను ప్రకటించింది. గతంలో 2019, 2023 వన్డే ప్రపంచకప్‌లను కేవలం 10 జట్లతోనే నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఐసీసీ జట్ల సంఖ్యను 14కి పెంచడమే కాకుండా, మునుపెన్నడూ లేని విధంగా మూడు అంచెల (త్రీ-స్టేజ్) సరికొత్త ఫార్మాట్‌ను తెరపైకి తెచ్చింది. ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ బోర్డు వార్షిక సమావేశంలో ఈ మేరకు అధికారిక ఆమోదం లభించింది.



 


తొలి దశ – సూపర్ సిరీస్

టోర్నీకి అర్హత సాధించిన 14 జట్లలో ర్యాంకింగ్స్ ప్రకారం చివరి మూడు స్థానాల్లో (12, 13, 14) ఉన్న జట్లు మొదట సూపర్ సిరీస్ (రౌండ్ రాబిన్)లో తలపడతాయి. ఈ మూడు జట్లలో అగ్రస్థానంలో నిలిచిన ఒకే ఒక్క జట్టు రెండో దశకు అర్హత సాధిస్తుంది. మిగిలిన రెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.



 


రెండో దశ – రెండు గ్రూపుల్లో పోటీ

రెండో దశలో మొత్తం 12 జట్లను ఆరు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులోని జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో మిగిలిన అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-3 జట్లు నేరుగా 'సూపర్-7' దశకు అర్హత సాధిస్తాయి. అదనంగా రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్లలో మెరుగైన ప్రదర్శన చేసిన ఒక జట్టుకు కూడా సూపర్-7లో అవకాశం లభిస్తుంది.



 


సూపర్-7లో అసలైన సమరం

సూపర్-7 దశలో మొత్తం ఏడు జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ప్రతి జట్టు మిగతా ఆరు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన తొలి నాలుగు జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత పొందుతాయి.

సెమీస్ – ఫైనల్

సూపర్-7లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో.. రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీఫైనల్లో తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల విజేతలు ప్రపంచకప్ ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకుంటారు.

ఐసీసీ అభిప్రాయం ప్రకారం ఈ కొత్త ఫార్మాట్ వల్ల టోర్నీ ప్రారంభం నుంచే ప్రతి మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడుతుంది. అదే సమయంలో ఎక్కువ దేశాలకు ప్రపంచకప్‌లో పాల్గొనే అవకాశం లభించడంతో పాటు, అభిమానులకు మరింత ఉత్కంఠభరితమైన క్రికెట్ అనుభవం అందనుంది. 2027 ప్రపంచకప్‌లో ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుందో.. ఏ జట్లు ఎక్కువగా లాభపడతాయో అన్నది ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికర చర్చగా మారింది.

Tags:    

Similar News