పోలీసుల మీదకు దూసుకెళ్లిన అంబటి
కాకినాడ జిల్లా కిర్లంపూడి లో జరిగిన మాజీ మంత్రి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
కాకినాడ జిల్లా కిర్లంపూడి లో జరిగిన మాజీ మంత్రి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో ప్రభుత్వ లాంచనాలు తమకు వద్దు అని ముద్రగడ కుటుంబం తెగేసి చెప్పింది. అయితే ప్రభుత్వం ఆదేశించినట్లుగా పోలీసులు ముద్రగడ అంత్యక్రియలు జరిగే కిర్లంపూడి లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కద సంప్రదాయం ప్రకారం ప్రభుత్వ లాంఛనాలతో కూడిన తుపాకీ వందనం కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభిస్తుండగా ఒక్కసారిగా ముద్రగడ అభిమానులు నాయకులు వారి దగ్గరకు వచ్చి ఆపేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుల మీదకు అంబటి :
ఇక ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు జోక్యం చేసుకుని పోలీసులను బలంగా తోసేశారు. కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా ఈ వందనం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తూ, ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆయన పోలీసులను తోసివేయడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అంత్యక్రియల సమయంలో అంబటి రాంబాబుకు పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదం అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పోలీస్ వర్సెస్ అంబటి :
పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి ఒక పోలీసుని వెనక్కి నెడుతూ వెళ్ళడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. అంతకు ముందు వైసీపీ నాయకులు పోలీసుల మధ్య ఇదే విషయం మీద గొడవ జరిగింది. అయితే ఈ మధ్యలో అంబటి రాంబాబు అక్కడికి చేరుకుని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులను ఇదే విషయం మీద నిలదీశారు. ముద్రగడ అంత్యక్రియలు అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో వద్దు అని చెప్పినా ఎందుకు నిర్వహిస్తున్నారు అని అంబటి ప్రశ్నించడం జరిగింది. దీంతో అంత్య క్రియలలో గందరగోళం ఏర్పడింది.
వద్దు అంటూ రాద్ధాంతం :
ఒక వైపు ముద్రగడ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోలీసులు వచ్చారు. మీడియా ముఖంగానే వైసీపీ నేతలు ప్రభుత్వం లాంచనాలు వద్దు అని చెప్పడం జరిగింది. అయితే యధా ప్రకారం వచ్చిన పోలీసులు తన విధులను నిర్వహిస్తూండగా ఈ విధంగా వివాదం జరగడం మీద చర్చ సాగుతోంది. ఇందులో పోలీసుల తప్పేముంది అంటూ నెటిజన్ల మధ్య చర్చ కూడా నడచింది. ప్రభుత్వం ఆదేశాలను వారు అమలు చేయాల్సి ఉంటుంది కదా అంటున్నారు. మొత్తానికి ఏదైతేనేమి ముద్రగడ అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో జరిగిపోవడమే విశేషం.