గవర్నర్ గా వెళ్లాల్సిన ముద్రగడ...అసలేమి జరిగింది ?
ఆయన పేరు పక్కనే రాజీనామా అన్న పదం కూడా ఉంటుంది అని చెప్పుకునే వారు. అంతలా ఆత్మ గౌరవంతో జీవించిన ముద్రగడ తన రాజకీయ ప్రయాణంలో ఎక్కడా ఎవరికీ ఏ పదవీ అడిగిన సందర్భం అయితే లేదు అని కూడా గుర్తు చేసుకుంటారు.
ముద్రగడ పద్మనాభం సీనియర్ మోస్ట్ నాయకుడు అన్నది అందరికీ తెలిసిందే. దాదాపుగా యాభై ఏళ్ళ రాజకీయ జీవితం చూసిన వారు ఆయన. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అదే వరుసలో నాలుగు సార్లు గెలిచారు. రెండుసార్లు మంత్రిగా కూడా అయ్యారు. ఇక ఎంపీగా కూడా అయిదేళ్ల పాటు పనిచేశారు. ముద్రగడ. ముద్రగడ రాజకీయ జీవితంలో చూస్తే ఎక్కువగా పోరాటాలే కనిపిస్తాయి. ఆయన ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది లేదు. ఆయన పేరు పక్కనే రాజీనామా అన్న పదం కూడా ఉంటుంది అని చెప్పుకునే వారు. అంతలా ఆత్మ గౌరవంతో జీవించిన ముద్రగడ తన రాజకీయ ప్రయాణంలో ఎక్కడా ఎవరికీ ఏ పదవీ అడిగిన సందర్భం అయితే లేదు అని కూడా గుర్తు చేసుకుంటారు.
జనసేనలో ముద్రగడ అంటూ :
ఇక 2024 లో ముద్రగడ పుట్టిన రోజు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన తన అనుచరులను పిలిచి ఇక మీదట రాజకీయంగా తాము చురుకైన పాత్ర పోషిస్తామని చెప్పారని ప్రచారం జరిగింది. అదే సమయంలో ముద్రగడ జనసేనలో చేరుతారు అని కూడా గట్టిగానే ప్రచారం సాగింది. పవన్ కళ్యాణ్ ముద్రగడ భేటీ అని కూడా అప్పట్లో కధనాలు వెలువడ్డాయి. మరి ముద్రగడ చూస్తే చివరికి వైసీపీలో చేరిపోయారు. ఆయన ఎందుకు వైసీపీలో చేరారు, జనసేనలో ఎందుకు చేరలేదు అన్నది చూస్తే అది ఒక చర్చగానే ఉంటుంది.
పార్టీ ఆహ్వానించింది అంటూ :
దీని మీద ముద్రగడ మరణించాక ఆయనకు సంతాపం తెలియచేస్తూ జనసేన సీనియర్ నాయకుడు, మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ కైకలూరులో నిర్వహించిన జనసేన చర్చా వేదికలో మాట్లాడారు. ముద్రగడ జనసేనలో చేరాల్సి ఉంది అని ఆయన చెప్పడం విశేషం. 2024 ఎన్నికలకు ముందు జనసేన తరఫున కొందరు పెద్దలు జనసేనలో ముద్రగడ చేరాలని ఆహ్వానించారు అని నాదెండ్ల చెప్పారు. ఆయన పార్టీలోకి వస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుందని కూడా పెద్దలు అంతా చర్చించారు అని గుర్తు చేసుకున్నారు.
గవర్నర్ గా చేయాలని :
అంతే కాదు ముద్రగడ కనుక జనసేనలో చేరితే ఆయనకు కూటమి ప్రభుత్వంలో గవర్నర్ గా పదవి దక్కేలా చూసే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ అప్పట్లో చెప్పారని కూడా నాదెండ్ల ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేశారు. ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోవడం బాధాకరం అని ఆయన అన్నారు ఇవన్నీ పక్కన పెడితే ముద్రగడ జనసేనలో చేరితే ఆయన రాజకీయం వేరే విధంగా ఉండేదా అన్న చర్చ ఇపుడు జరుగుతోంది. నిజానికి జనసేనలో ముద్రగడ ఎందుకు చేరలేదు, వైసీపీ వైపు ఎందుకు మళ్ళారు అంటే అది ఒక శేష ప్రశ్నగానే ఉంటుంది. దీని మీద ఎవరి వాదనలు వారికి ఉన్నా కూడా ముద్రగడ అయితే పెదవి విప్పి చెప్పలేదు. అందువల్ల అది అలాగే ఉండిపోయింది. ఆ తరువాత ఏకంగా జనసేన అధినేత పవన్ ని సవాల్ చేస్తూ ముద్రగడ పిఠాపురంలో ఆయన్ని ఓడిస్తాను అని శపధం చేయడం, తన పేరు మార్చుకుంటాను అని చెప్పడం ఇలా జరిగిపోయాయి. పవన్ గెలిచాక ముద్రగడ తన పేరుని పద్మనాభరెడ్డి గా మార్చుకున్నారు. ఇలా ముద్రగడ రాజకీయ ప్రయాణం రాజీలేని బాటగానే సాగి అలా ముగిసింది అని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.