సిక్కోలు విజయనగరం తమ్ముళ్లకు- ప్రేమతో లోకేష్
టీడీపీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ ఇటీవల పార్టీలో ఒక కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఒక విధంగా చెప్పాలీ అంటే దేశంలో ఏ రాజకీయ పార్టీలో కూడా ఈ తరహా కార్యక్రమం ఇంతవరకూ ఎవరూ చేపట్టలేదు అనే అంటున్నారు.;
టీడీపీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ ఇటీవల పార్టీలో ఒక కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఒక విధంగా చెప్పాలీ అంటే దేశంలో ఏ రాజకీయ పార్టీలో కూడా ఈ తరహా కార్యక్రమం ఇంతవరకూ ఎవరూ చేపట్టలేదు అనే అంటున్నారు. రాజకీయ పార్టీలు అంటే ఆ పార్టీలలో ఉండే నేతలతోనే ఎక్కువగా గడుపుతారు ఈ మధ్య కాలంలో ఆ సమయం కూడా ఇవ్వడం లేదని అలుగుతున్న వారు ఉన్నారు. ఇక క్యాడర్ ని పట్టించుకోవాల్సి ఉన్నా అలా చేయని వారూ ఎక్కువ మందే ఉన్నారు. దాని వల్లనే పార్టీకి నేతలకు క్యాడర్ కి మధ్య ఉన్న ఒక పెద్ద కనెక్షన్ దెబ్బ తింటోంది అన్న అభిప్రాయం ఉంది. ఇది చివరికి పార్టీ విజయాన్ని సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.
లోకేష్ కరెక్ట్ రూట్ :
లోకేష్ పార్టీ పరంగా క్రియాశీలకంగా అయ్యాక పూర్తిగా శ్రద్ధ పెడుతున్నారు. ఆయన ఠంచనుగా క్యాడర్ తో మీట్ అవుతున్నారు. అలాగే నాయకులతో మీట్ అవుతున్నారు. ఎవరికీ కాదనకుండా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లోకేష్ టీడీపీ పార్టీ నేతలతోనే కాదు వారి కుటుంబంతో సైతం మమేకం కావాలనుకోవడం గొప్ప నిర్ణయంగానే చూస్తున్నారు. సాధారణంగా ఒక నాయకుడి కుటుంబ సభ్యులు కూడా ఆటోమేటిక్ గా అదే పార్టీ భావజాలంతో కలసి ముందుకు ప్రయాణిస్తూంటారు. అలా ఉన్న వారిని మరింతగా పార్టీ పెద్దలు గుర్తించి దగ్గర చేసుకుంటే కుటుంబాలు సైతం పార్టీకి ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతాయని అది మంచి రిజల్ట్ ఇస్తుందని చెబుతున్నారు. కరెక్ట్ గా లోకేష్ ఇదే పని చేస్తున్నారు.
అతిరధులంతా హాజరు :
శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో ఉన్న అతిరధులు అంతా లోకేష్ ఇచ్చిన అత్మీయ విందుకు హాజరయ్యారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సతీసమేతంగా హాజరై లోకేష్ తో ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరసవిల్లి సూర్యనారాయణమూర్తి ప్రతిమను లోకేష్ కి వారు బహూకరించారు. విజయనగరం జిల్లా నుంచి మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు తమ సతీమణితో పాటు ఇద్దరు కుమారులు కోడళ్ళు, మనవళ్ళతో హాజరై చినబాబు ప్రేమను మనసారా ఆస్వాదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు భువనేశ్వరి, లోకేష్ బ్రాహ్మణి దేవాన్ష్ లతో కూడిన ఒక వర్ణ చిత్రాన్ని గీయించి మరీ బహుమతిగా కళా వారి కుటుంబం లోకేష్ కి అందించింది. ఈ సందర్భంగా కళా మనవడిని లోకేష్ ఎత్తుకుని ఆప్యాయంగా పలకరించడం ఆకట్టుకుంది.
ఆహ్లాదకరంగా :
ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కూన రవికుమార్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, హాజరైతే అలాగే విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీసమేతంగా తన పిల్లలతో కలసి హాజరయ్యారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ రావు, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, ఇలా ఎంతో మంది ప్రజా ప్రతినిధులు హాజరై ఆత్మీయ విందును ఆహ్లాదకరంగా చేశారు. వచ్చిన మహిళలు అందరికీ మంగళగిరి చీరలు బహుమతిగా లోకేష్ అందించారు. అందరితో కలసి ఆయన విందు చేయడమే కాదు ఎలాంటి భేషజాలు లేకుండా వారితో కలసిపోయిన తీరుతో టీడీపీ కుటుంబాలు అన్నీ చినబాబు ప్రేమని చూసి మురిసిపోయాయంటే అతిశయోక్తి కాదు అనే చెప్పాలి.