తన పేరుతో సంస్థలు.. కేటీఆర్ ఎందుకు షాకయ్యారు?
తాజాగా రెండు సంస్థల పేర్లతో సేవా కార్యక్రమాలు చేపట్టడం కేటీఆర్ కు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.;
సాధారణంగా.. రాజకీయ నేతల పేర్లతో ఏవైనా కార్యక్రమాలు చేపట్టినా.. ప్రజలకు మేలు చేసే పనులు చేస్తున్నా.. సదరు నాయకులు సంతోషం వ్యక్తం చేస్తారు. అయితే.. దీనికి భిన్నంగా బీఆర్ ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. మాత్రం ఉలిక్కిపడ్డారు. తన పేరును వాడుకోవద్దని ఆయన పేర్కొన్నారు. తన పేరుతో ఏర్పాటైన ``కేటీఆర్ సేవా సమితి, కేటీఆర్ సేన``లకు తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా తేల్చేశారు. ఇలా చేయడాన్ని తాను ఖండిస్తున్నానని కూడా చెప్పారు.
ఎందుకు?
ప్రస్తుతం బీఆర్ ఎస్ పార్టీలో అధికార కేంద్రాల చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్‌లను కేంద్రంగా చేసుకుని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ తర్వాత.. పార్టీని వీరు పంచుకునే అవకాశం ఉందని.. బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వేరు పార్టీ పెడతారని కొంద రు అంటుంటే.. కాదు.. బీఆర్ ఎస్ రెండుగా చీలుతుందని మరికొందరు అవకాశం వచ్చినప్పుడల్లా వ్యాఖ్యానిస్తున్నారు. దీనికితోడు కవిత రూపంలో సెగ తగులుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో బీఆర్ ఎస్ వ్యవహారాలపై తరచుగా చర్చ తెరమీదికి వస్తోంది. కేసీఆర్ యాక్టివ్‌గా ప్రజల మధ్య ఉండకపోవడం.. కేటీఆర్-హరీష్‌రావుల పై విమర్శలు వస్తున్న క్రమంలో.. తాజాగా రెండు సంస్థల పేర్లతో సేవా కార్యక్రమాలు చేపట్టడం కేటీఆర్ కు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే ఆయన హుటాహుటిన స్పందించారు. సదరు సంస్థలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు.
అంతేకాదు.. తన పేరుతో ఎలాంటి ప్రైవేటు సంస్థల నిర్వహణకు తాను అనుమతి ఇవ్వలేదని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా.. కార్యకర్తలు సేవ చేయాలని అనుకుంటే.. బీఆర్‌ఎస్ పార్టీ పేరుతోనే చేయాలని.. కేసీఆర్ పేరునే వాడుకోవాలని చెప్పారు. తద్వారా.. బీఆర్ ఎస్‌లో రెండు అధికార కేంద్రాలు లేవన్న విషయాన్ని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు. పైగా.. కేటీఆర్‌ను వ్యతిరేకించే వర్గం కూడా బీఆర్ ఎస్‌లో ఉండడంతో ఆయన మరింత అలెర్ట్ అయ్యారని తెలుస్తోంది.