మరోసారి చైనాను అలుముకున్న కరోనా

Update: 2022-07-07 01:30 GMT
రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని గుప్పిట పట్టి అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఇప్పటికీ మనల్ని వీడిపోవడం లేదు. చైనాలో మరోసారి విజృంభించి అక్కడ లాక్ డౌన్ కు కారణమైంది. నగరాల్లో ప్రజలను ఆకలి దప్పులకు గురిచేస్తోంది. అయితే చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. మళ్లీ ఆ దేశాన్నే వణికిస్తోంది. ఇంకా ఈ ముప్పు ముగిసిపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కరోనా వైరస్ చైనాను దశలవారీగా తిప్పలు పెడుతోంది. మరోసారి చైనా నగరాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. బుధవారం జియాన్, షాంఘై నగరాల్లో 300కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కొత్త కేసులు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి.

తాజాగా షాంఘై, బీజింగ్ నగరాల్లో మాస్ టెస్టింగులు నిర్వహిస్తున్నారు. 13 మిలియన్లు జనాభా కలిగిన జియాన్ నగరం గత ఏడాదిలో నెలరోజుల పాటు లాక్ డౌన్ లో ఉండిపోయింది. చెత్త రీసైక్లింగ్ సిబ్బందిలో కరోనా బయటపడడంతో బుధవారం రాత్రి నుంచి పబ్స్ , బార్లు, ఇంటర్నెట్ కేఫ్ లు తమ కార్యకలాపాలు  నిలిపివేయాలని స్థానిక యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.  

మంగళవారం అర్ధరాత్రి వరకూ జియాన్ ప్రజలు నిర్ధారణ పరీక్షల కోసం క్యూలైన్లో నిల్చొన్న చిత్రాలు బయటకు వచ్చాయి. ఆ నగరం లాక్ డౌన్ లో లేదని తెలిసింది. ప్రస్తుతం చైనాలో కరోనా ఉధృతికి ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఏ 5.2 కారణమని అధికారులు తెలిపారు. దానికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలతోపాటుగా రోగనిరోధక శక్తిని దాటవేసే సామర్థ్యం ఉందని చెబుతున్నారు.

కరోనా వైరస్ త్వరలోనే మళ్లీ ఉగ్రరూపం దాల్చవచ్చని.. డెల్టా లేదా మరో కొత్త వేరియంటే ఇందుకు కారణమవుతుందని ఇజ్రాయెల్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉపరకాలు వచ్చే రెండు మూడు నెలల్లో వాటంతట అవే కనుమరుగవుతాయని కూడా నిర్ధారణకు వచ్చారు.

ఈ క్రమంలో మరో వైరస్ కు చైనా కారణమవుతోంది. బర్డ్ ఫ్లూ జాతికి చెందిన ఈ వైరస్ చైనాలో కనుగొన్నారు. దీంతో ప్రపంచం మరోమారు ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఎన్నో వ్యయప్రయాసలు పడిన జనం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ చైనీయులకు ఏం పని లేదు. ఏదో ఒక వైరస్ ను ఉత్పత్తి చేయడం ప్రపంచాన్ని పరేషాన్ చేయడం తప్ప వేరే ఉద్దేశం లేదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
Tags:    

Similar News