కేంద్ర హోంశాఖకు ఎంపీ రఘురామ తనయుడి సంచలన లేఖ

Update: 2021-05-16 08:30 GMT
సీఐడీ అదుపులో ఉన్న వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఎంపీ రఘురామ 14 రోజులు రిమాండ్ లో ఉన్నారు.

అయితే తనను పోలీసులు కొట్టారని జడ్జీకి రాతపూర్వకంగా ఎంపీ రఘురామ ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించారు. రబ్బరు బెల్ట్, కర్రలతో కొట్టారని ఎంపీ ఆరోపించారు. ఇక బెయిల్ ఎంపీ రఘురామ తాజాగా సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు.

ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై ఎంపీ రఘురామ తనయుడు కనుమూరి భరత్ ఏకంగా కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఫిర్యాదు చేశారు. తన తండ్రిని సీఐడీ అధికారి సునీల్ కుమార్ బృందం మే 14న అదుపులోకి తీసుకుందని.. విచారణ పూర్తితో ఆరోజు రాత్రంతా దారుణంగా హింసించారని భరత్ తన లేఖలో ఆరోపించారు.

ఒక దేశ ప్రజా ప్రతినిధి.. ఎంపీ అన్న విషయాన్ని మరిచిపోయి తన తండ్రి విషయంలో అమానుషంగా ప్రవర్తించారని.. థర్డ్ డిగ్రీ ప్రయోగించారని భరత్ ఆరోపించారు. ఆయన కాళ్లు, పాదాలు, శరీరంపై గాయాలున్నాయని.. నడవలేని పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జడ్జీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు.

ఎంపీకి గాయాలు ఉండడంపై హైకోర్టు మండిపడిందని.. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ఘాటుగా వ్యాఖ్యానించిందని భరత్ లేఖలో పేర్కొన్నారు. ఎంపీ శరీరంపై ఉన్నవి పోలీసు దెబ్బలని తేలితే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించింది.. ’ అని భరత్ తెలిపారు.

ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ అనుమతి తీసుకోవాలని.. కానీ ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ నియమాలు, న్యాయస్థానాల ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మౌలిక న్యాయసూత్రాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అజయ్ భల్లాకు రాసిన లేఖలో భరత్ కోరారు. ఈ లేఖకు తన తండ్రి ఒంటిపై ఉన్న గాయాల ఫొటోలను జయపరిచారు.


Tags:    

Similar News