చివరి దశలో వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్‌ .. మొడెర్నా, ఫైజర్‌ దూకుడు !

Update: 2020-07-28 04:15 GMT
కరోనా వైరస్ మహమ్మారి .. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకి తన వ్యాప్తిని పెంచుకుంటూ ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటికే కోటిన్నరకి పైగా కేసులు నమోదు అయ్యాయి. అయితే , ఈ కరోనాను అరికట్టే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్ లు ఇప్పటికే హ్యూమన్ ట్రయల్స్ లో ఉన్నాయి. ఈ తరుణంలో   అందరూ ఆశగా ఎదురుచూస్తున్న  కరోనా వ్యాక్సిన్‌ మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలు దేశాల హ్యూమన్ ట్రయల్స్ చివరి దశకి చేరుకోవడంతో వ్యాక్సిన్ పై ఓ స్పష్టత వస్తుంది.

ఈ క్రమంలో ఫైజర్ .. తమ వ్యాక్సిన్‌ హ్యూమన్ ట్రయల్స్  విజయవంతమైతే అక్టోబర్‌ నాటికి రెగ్యులేటరీ అనుమతులు పొంది సంవత్సరాంతానికి 5 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని తెలిపింది. 2021 సంవత్సరాంతానికి 130 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల సరఫరాకు ఫైజర్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక 2021 నుంచి ఏడాదిలోగా 100 కోట్ల వరకూ వ్యాక్సిన్‌ డోసులను అందుబాటులోకి  తేవాలని మొడెర్నా కసరత్తు సాగిస్తోందని కంపెనీ సీఈఓ స్టెఫానే బాన్సెల్‌ తెలిపారు. తాము అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ల భద్రత, సామర్థ్యం పరీక్షించేందుకు మొడెర్నా, ఫైజర్‌ కంపెనీలు ఏకంగా  30 వేల మందిపై ఒకేసారి కీలక మానవ పరీక్షలను ప్రారంభించాయి. ఈ వ్యాక్సిన్‌ హ్యూమన్ ట్రయల్స్  విజయవంతమైతే రెగ్యులేటరీ అనుమతులు పొంది ఏడాది చివరికి పెద్దసంఖ్యలో వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించాయి.

ఇకపోతే ,  మొడెర్నా సంస్థ ఇప్పటివరకు  ఎలాంటి వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన అనుభవం లేదు. కానీ , ఆ సంస్థకి కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం అమెరికా ప్రభుత్వం  రూ .7500 కోట్ల నిధులు ఇచ్చింది. తమ వ్యాక్సిన్‌ విజయవంతమైతే 5 కోట్ల మందికి రూ 15,000 కోట్లకు వ్యాక్సిన్లను విక్రయించేందుకు ఫైజర్‌ అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి వివిధ దశల్లో ఉండగా, దాదాపు 20 వ్యాక్సిన్లు మానవ పరీక్షల దశకు చేరుకున్నాయి. భారత్ బయోటెక్ తయారుచేస్తున్న కొవాక్సీన్ కూడా హ్యూమన్ ట్రయల్స్ లో ఉంది.
Tags:    

Similar News