ఉగ్రవాదిగా పాక్ మాజీ ఆర్మీ అధికారి.. సర్కార్ పై స్ట్రాంగ్ వ్యాఖ్యలు!

అవును... పాక్ ను వీడి వెళ్లినా, వారు ప్రపంచంలో ఎక్కడున్నా వారిపై తమ కక్ష్య సాధింపు చర్యలు ఆగవని చెప్పే ప్రయత్నం మునీర్ & కో చేస్తున్నారనే చర్చ ఇటీవల మరింత ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు.;

Update: 2025-12-29 04:12 GMT

పాకిస్థాన్ ని వదిలి వెళ్లిన వారిని కూడా మునీర్ అండర్ కంట్రోల్ లోని పాక్ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదనే చర్చ ఇటీవల బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. దేశం విడిచి వెళ్లి యూకేలో నివశిస్తున్న మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ సలహాదారుడు మీర్జా షాజాద్ అక్బర్ పై అతని ఇంటివద్దే దాడి చేసి, గాయపడిన అతని ఫోటోలు తీసుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరొకరికి షాకిచ్చింది పాక్ సర్కార్!

అవును... పాక్ ను వీడి వెళ్లినా, వారు ప్రపంచంలో ఎక్కడున్నా వారిపై తమ కక్ష్య సాధింపు చర్యలు ఆగవని చెప్పే ప్రయత్నం మునీర్ & కో చేస్తున్నారనే చర్చ ఇటీవల మరింత ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే యూకేలో ఉన్న అక్బర్ పై దాడి జరగ్గా.. పాకిస్థాన్ మాజీ ఆర్మీ ఆఫీసర్, యూకేకి చెందిన జర్నలిస్ట్ మేజర్ (రిటైర్డ్) ఆదిల్ రాజాకు పాక్ సర్కార్ షాకిచ్చింది. ఇందులో భాగంగా అతన్ని షెడ్యూల్ 4 కింద ఉగ్రవాదిగా ప్రకటించింది.

దీనిపై ఆదిల్ రాజా ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా... పాకిస్తాన్ తనను యునైటెడ్ కింగ్‌ డమ్ నుండి రప్పించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాత తనకు ఈ హోదా వచ్చిందని.. అయితే, ఈ చర్య ఏ క్రిమినల్ నేరంతో ముడిపడి లేదని, కానీ తన పాత్రికేయ పనికి, వ్యవస్థపై చేసిన విమర్శలకు ప్రతీకారంగా తీసుకున్నట్లు ఉందని రాజా పేర్కొన్నారు. ఇటీవల లండన్ శివార్లలోని అతని ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి ఇంటిని దోచుకున్న తర్వాత ఈ పరిణామం జరిగింది.

ఇదే సమయంలో.. తన అప్పగింతను పొందడంలో విఫలమైన తర్వాత, పాకిస్తాన్ ప్రభుత్వం తన ఇంటిని లక్ష్యంగా చేసుకుని అధికారికంగా తనను ఉగ్రవాదిగా ప్రకటించడం ద్వారా తన చర్యలను తీవ్రతరం చేసిందని ఆరోపించారు. పాకిస్తాన్ సైనిక వ్యవస్థ తనపై ఈ వ్యవహారాన్ని కుట్రపూరితంగా అమలు చేస్తున్నట్లు ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా తనపై వేసిన ఉగ్రవాది ట్యాగ్‌ ను ఆయన తీవ్రంగా తిరస్కరించారు.

పాకిస్థాన్ లో భిన్నాభిప్రాయాలకు చోటు లేదని.. తాజాగా తనకు తగిలించిన ట్యాగ్ భిన్నాభిప్రాయాన్ని అణిచివేయడానికి ఉద్దేశించబడిన చర్య అని.. అయినప్పటికీ తాను తగ్గేదే లేదని.. తాను తన పనిని కొనసాగిస్తూనే ఉంటానని.. పాకిస్థాన్ లో నిరంకుశత్వంపై ప్రశ్నిస్తూనే ఉంటానని.. పోరాడుతానే ఉంటానని తెలిపారు. అయితే.. రాజా రియాక్షన్ పై పాక్ అధికారుల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు!

ఈ సందర్భంగా బలూచ్ కార్యకర్త మహరంగ్ బలూచ్, జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సహా చాలా మందికి, నిర్బంధితులకు కూడా ఈ ఆదిల్ రాజా సంఘీభావం తెలిపారు.. పాకిస్థాన్ సర్కర్ చేసిన తాజా ప్రకటన తనను మాట్లాడకుండా నిరోధించదని అన్నారు.

Tags:    

Similar News