సంచలన వ్యాఖ్యలు... ఆర్.ఎస్.ఎస్ ఆల్ ఖైదా లాంటిదే!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఇటీవల ఆర్.ఎస్.ఎస్. సంస్థాగత బలాన్ని ప్రశంసిస్తూ, నరేంద్ర మోడీ పాత ఫోటోను షేర్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.;

Update: 2025-12-29 03:58 GMT

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఇటీవల ఆర్.ఎస్.ఎస్. సంస్థాగత బలాన్ని ప్రశంసిస్తూ, నరేంద్ర మోడీ పాత ఫోటోను షేర్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై దిగ్విజయ్ సింగ్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్.ఎస్.ఎస్. నుంచి నేర్చుకోవడానికి ఏమీ లేదని.. అది కూడా ఉగ్రవాద సంస్థ లక్షణాలు కలిగి ఉన సంస్థే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాణికం ఠాగూర్!

అవును... కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణికం ఠాగుర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్-ఖైదాతో పోల్చారు. ఆర్.ఎస్.ఎస్. ద్వేషాన్ని వ్యాపించజేస్తోందని ఆరోపించారు. ఆల్ ఖైదా కూడా ప్రపంచవ్యాప్తంగా ద్వేషాన్ని, ఉగ్రవాదాన్ని వ్యాపింపచేసే వ్యవస్థీకృత సముహం అని అన్నారు. ఆర్.ఎస్.ఎస్. నుంచి నేర్చుకోవడానికి ఏమీ లేదని మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో... "మీరు నేర్చుకోవాలనికుంటే మంచి వ్యక్తుల నుంచి నేర్చుకోండి.. దాదాపు 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఉంది.. ఈ పార్టీ దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చింది.. ఈ కాంగ్రెస్ పార్టీని మహాత్మ గాంధీ ప్రజా ఉద్యమంగా మార్చారు.. అలాంటి సంస్థ ఆ ద్వేషపూరిత సంస్థల నుంచి నేర్చుకోవాలా?" అని మాణికం ఠాగూర్ ప్రశ్నించారు. ఇవి దిగ్విజయ్ సింగ్ కామెంట్ల నేపథ్యంలో వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజా వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.

మాణికం ఠాగూర్ వ్యాఖ్యలను అటు ఆర్.ఎస్.ఎస్., ఇటు బీజేపీ తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి షెహబాజ్ పూనవాలా... బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దారుణాలపై కాంగ్రెస్ మౌనంగా ఉంటూ.. శతాబ్ధాల జాతీయ సేవ రికార్డు ఉన్న ఒక సంస్థను ఉగ్రవాదిగా ముద్ర వేయడం దిగ్భ్రాంతికరమని అన్నారు. హిందూ, సనాతన, సేన, భారత్ లను అవమానించిన తర్వాత ఇప్పుడు జాతీయవాద సంస్థను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు.

ఇదే క్రమంలో... కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులనూ దాటేసిందని.. ఆ పార్టీ ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాల దాహంలో మునిగిపోయిందని అన్నారు. ఇదే సమయంలో.. మాణికం ఠాగూర్ వ్యాఖ్యలపై ఆర్.ఎస్.ఎస్. కూడా స్పందించింది. ఆర్.ఎస్.ఎస్. తన శతాబ్ది సంవత్సరాన్ని జరుపుకుంటోందని.. వివిధ కార్యక్రమాల ద్వారా గొప్ప దేశం కోసం కృషి చేస్తుందని.. అంటరానితనం, మతపరమైన మతోన్మాదం లేని సమాజం కోసం కృషిచేస్తోందని ఆ సంస్థ సిద్ధాంతకర్త ఇంద్రేష్ కుమార్ అన్నారు.

కాగా... 1996 నాటి మోడీ ఫోటోను షేర్ చేసిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్.. దానిని ప్రభావవంతమైనదిగా అభివర్ణిస్తూ.. బీజేపీ, ఆర్.ఎస్.ఎస్. సంస్థాగత బలాన్ని ప్రశంసించిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదం మొదలైంది. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఉపయోగించుకుంది! ఈ సందర్భంగా స్పందించిన సింగ్... ఆర్.ఎస్.ఎస్. భావజాలాన్ని తాను వ్యతిరేకించినప్పటికీ.. దాని సంస్థాగత సామర్థ్యాన్ని తాను గుర్తించానని తర్వాత స్పష్టం చేశారు.

Tags:    

Similar News