అమెరికాకు ఇరాన్ 'ఆర్థిక' షాక్!.. డాలర్ వద్దు.. యెమెన్ ముద్దు అంటున్న ఇరాన్.. అగ్రరాజ్యంలో మంటలు!

ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 నుంచి 30 శాతం హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఇటువంటి కీలకమైన మార్గాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న ఇరాన్, ఇప్పుడు దాన్ని బేరసారాల సాధనంగా వాడుకుంటోంది.;

Update: 2026-03-14 11:30 GMT

ప్రపంచ వ్యాప్తంగా చమురు వ్యాపారమంతా దశాబ్దాలుగా అమెరికా డాలర్లలోనే సాగుతుండగా, ఇప్పుడు ఇరాన్ ఆ సంప్రదాయానికి చరమగీతం పాడుతూ చైనా కరెన్సీ అయిన 'యువాన్' (Yuan) ను తెరపైకి తెచ్చింది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే చమురు నౌకలు ఇకపై అమెరికా డాలర్లలో కాకుండా చైనీస్ యువాన్లలో చెల్లింపులు జరిపితేనే పర్మిషన్ ఇస్తామని ఇరాన్ ప్రకటించినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘అల్-జజీరా’ వెల్లడించింది. ఇది కేవలం ఒక కరెన్సీ మార్పు మాత్రమే కాదు, అమెరికా గ్లోబల్ సూపర్ పవర్ హోదాపై ఇరాన్ వేసిన పక్కా వ్యూహాత్మక దెబ్బగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఆది నుంచి డాలర్లలలోనే..

చాలా కాలం నుంచి అంతర్జాతీయ ఆయిల్ బిజినెస్ కేవలం అమెరికా డాలర్లలోనే జరుగుతుండటంతో, ప్రపంచవ్యాప్తంగా డాలర్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఏ దేశమైనా చమురు కొనాలన్నా లేదా అమ్మాలన్నా డాలర్ల నిల్వలు కలిగి ఉండడం తప్పనిసరిగా మారింది. ఈ 'పెట్రో-డాలర్' వ్యవస్థే అమెరికాను ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా నిలబెట్టింది. తన కరెన్సీ ద్వారా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను నియంత్రించే శక్తిని అమెరికా పొందింది. అయితే, ఇప్పుడు ఇరాన్ ఈ మూలాన్నే దెబ్బకొట్టాలని నిర్ణయించుకుంది. డాలర్‌ను కాదని యువాన్ వైపు మొగ్గు చూపడం ద్వారా అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి గండి కొట్టాలని ఇరాన్ గట్టిగా ప్రయత్నిస్తోంది.

ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 నుంచి 30 శాతం హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఇటువంటి కీలకమైన మార్గాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న ఇరాన్, ఇప్పుడు దాన్ని బేరసారాల సాధనంగా వాడుకుంటోంది. ఒకవేళ ప్రపంచ దేశాలు చమురు రవాణా కోసం యువాన్లలో చెల్లించడం మొదలుపెడితే, డాలర్ విలువ పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే రష్యా వంటి దేశాలు అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ కరెన్సీల వైపు చూస్తుండగా, ఇప్పుడు ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ ధోరణిని మరింత వేగవంతం చేస్తుంది. దీనివల్ల డాలర్ కు ఉన్న గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ హోదాకు ముప్పు పొంచి ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇరాన్ నిర్ణయం వెనుక చైనా హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యువాన్ అంతర్జాతీయ కరెన్సీగా ఎదగాలని చైనా ఎప్పటి నుంచో కోరుకుంటోంది. ఇప్పుడు ఇరాన్ నేరుగా యువాన్ లోనే చెల్లింపులు జరపాలని షరతు విధించడం చైనాకు పెద్ద వరంగా మారింది. దీనివల్ల చైనా ఆర్థిక వ్యవస్థ బలపడటమే కాకుండా, అమెరికాతో సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో బీజింగ్ పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. అమెరికా ఆంక్షలను ధిక్కరిస్తూ ఇరాన్ ఈ స్థాయిలో తెగువ చూపడం చూస్తుంటే, పశ్చిమాసియాలో అమెరికా ప్రభావం క్రమంగా తగ్గుతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

అమెరికా ఈ పరిణామాలను గమనిస్తూనే తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. తన డాలర్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి అమెరికా ఇరాన్ పై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించవచ్చు లేదా సైనిక చర్యను మరింత ఉధృతం చేయవచ్చు. అయితే, ఇరాన్ ఇప్పటికే కోల్పోవడానికి ఏమీ లేదన్నట్లుగా సిద్ధపడి ఉండడంతో, ఈ ఆర్థిక యుద్ధం చివరకు ఎటు దారితీస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇతర చమురు ఉత్పత్తి దేశాలు కూడా ఇరాన్ బాటలోనే నడిస్తే మాత్రం ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. డాలర్ లేని ప్రపంచం వైపు అడుగులు పడుతున్నాయా అనే చర్చకు ఇది ఊతమిస్తోంది.

ఇరాన్ తీసుకున్న ఈ యువాన్ నిర్ణయం యుద్ధ క్షేత్రంలో బాంబుల కంటే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది అమెరికా ఆర్థిక వెన్నెముకను విరిచేసే ఎత్తుగడగా కనిపిస్తోంది. యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు, ఇప్పుడు కరెన్సీ నోట్ల మధ్య కూడా మొదలైంది. హర్మూజ్ జలసంధిలో సాగుతున్న ఈ ఆర్థిక పోరు ప్రపంచ మార్కెట్లను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మరియు అమెరికా దీనికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటుందో రాబోయే రోజుల్లో తేలనుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ యుగం ముగియడానికి ఇది ఆరంభమా లేక ఇరాన్ చేస్తున్న విఫల ప్రయత్నమా అన్నది కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News