వివాహేతర డేటింగ్ యాప్‌ల వైపు భారతీయులు… 40 లక్షల మంది వినియోగదారులు

వినియోగదారులు రోజుకు సగటున 60 నుండి 90 నిమిషాల సమయాన్ని ఈ యాప్‌లో గడుపుతున్నారు.;

Update: 2026-03-14 11:02 GMT

భారతదేశంలో వివాహ బంధాన్ని అత్యంత పవిత్రమైనదిగా జీవితాంతం కొనసాగాల్సిన కట్టుబాటుగా పరిగణించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. కానీ నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, మారుతున్న సామాజిక దృక్పథాల కారణంగా సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. ఈ మార్పులకు నిదర్శనంగా ప్రపంచంలోనే మొట్టమొదటి వివాహేతర డేటింగ్ ప్లాట్‌ఫామ్ ‘గ్లీడెన్’ భారతదేశంలో అనూహ్యమైన ఆదరణ పొందుతోంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 40 లక్షల మందికి పైగా భారతీయులు ఈ ప్లాట్‌ఫామ్‌లో సభ్యత్వం కలిగి ఉండటం గమనార్హం.

గణాంకాలు చెబుతున్న వాస్తవం

ప్రస్తుతం ఈ యాప్ వినియోగదారుల్లో 65 శాతం మంది పురుషులు ఉండగా 35 శాతం మంది మహిళలు ఉన్నారు. అయితే, గడిచిన రెండు సంవత్సరాల్లో మహిళల భాగస్వామ్యం ఏకంగా 148 శాతం పెరగడం సామాజిక విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారతీయ సమాజంలో మహిళలు తమ వ్యక్తిగత కోరికలు, నిర్ణయాల విషయంలో మరింత ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తోంది.

నగరాల వారీగా వినియోగం: బెంగళూరు టాప్, హైదరాబాద్ నెక్స్ట్

టెక్నాలజీ, ఆధునిక జీవనశైలికి కేంద్రమైన బెంగళూరు నగరం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. మొత్తం యూజర్లలో దాదాపు 18 శాతం మంది బెంగళూరుకు చెందినవారే కావడం విశేషం. ఐటీ రంగంలో పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం, ఆధునిక భావజాలం ఈ నగర వినియోగానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

బెంగళూరు తర్వాత హైదరాబాద్ నగరం రెండో స్థానంలో నిలిచింది. మొత్తం యూజర్లలో 17 శాతం మంది హైదరాబాద్ నుంచి ఉండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (11%), ముంబై (9%), పుణే (7%) నగరాలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ధోరణి కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. లక్నో, చండీగఢ్, సూరత్, భువనేశ్వర్, పట్నా , గౌహతి వంటి రెండో శ్రేణి నగరాల్లో కూడా ఈ ప్లాట్‌ఫామ్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది.

యాప్ వినియోగం.. ప్రత్యేక విశ్లేషణ

వినియోగదారులు రోజుకు సగటున 60 నుండి 90 నిమిషాల సమయాన్ని ఈ యాప్‌లో గడుపుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు కార్యాలయ విరామ సమయాల్లో రాత్రి 10 గంటల నుండి అర్ధరాత్రి వరకు యాప్ వినియోగం గరిష్టంగా ఉంటోందని సంస్థ పేర్కొంది.

వినియోగదారుల ప్రాధాన్యతలు మారాయి..

పురుషులు ప్రధానంగా 25–30 ఏళ్ల వయసున్న మహిళల పట్ల ఆసక్తి చూపుతుండగా మహిళలు 30–40 ఏళ్ల మధ్య వయసున్న, ఆర్థికంగా స్థిరపడిన పురుషులు అయిన డాక్టర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, సీఏలు పట్ల మొగ్గు చూపుతున్నారు.

సామాజిక మార్పుకు సంకేతమా?

గ్లీడెన్ ఇండియా కంట్రీ మేనేజర్ సిబిల్ షిడెల్ అభిప్రాయం ప్రకారం ఈ మార్పు కేవలం టెక్నాలజీ వల్ల మాత్రమే వచ్చింది కాదు. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛపై అవగాహన పెరగడం, సంప్రదాయ బంధాల్లో ఎదురయ్యే అసంతృప్తిని కొత్త కోణంలో పరిష్కరించుకోవాలనే ఆలోచన ఈ ధోరణికి కారణమవుతున్నాయి.

భారతీయ సమాజంలో వివాహం ఇప్పటికీ పటిష్టమైన వ్యవస్థే అయినప్పటికీ డిజిటల్ ప్రపంచం అదనపు ప్రత్యామ్నాయాలను అన్వేషించే వీలు కల్పిస్తోంది. ఈ సంఖ్యలు పెరగడం చూస్తుంటే వ్యక్తిగత బంధాల పట్ల భారతీయుల దృక్పథంలో ఒక నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News