గంజాయి స్మ‌గ్లర్ల జాబితా నా ద‌గ్గ‌రుంది.. : బాంబు పేల్చిన‌ ఏపీ స్పీక‌ర్

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు తాజాగా బాంబు పేల్చారు. రాష్ట్రంలో గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తున్న వారి జాబితా త‌న ద‌గ్గ‌ర ఉంద‌ని పేర్కొన్నారు.

Update: 2026-08-04 11:28 GMT

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు తాజాగా బాంబు పేల్చారు. రాష్ట్రంలో గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తున్న వారి జాబితా త‌న ద‌గ్గ‌ర ఉంద‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. పోలీసుల‌ను ఉద్దేశించి కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న వ‌ద్ద ఉన్న జాబితాను పోలీసుల‌కు పంపిస్తాన‌ని.. ద‌మ్ముంటేవారిని అరెస్టు చేయాల‌ని ఆయ‌న స‌వాల్ రువ్వారు. అదేస‌మ‌యంలో గంజాయి స్మ‌గ్ల‌ర్ల‌ను సాదాసీదా జైల్లో పెడుతున్నార‌ని.. ఇది వారికి ఎంజాయ్ మెంటుగా మారిపోయింద‌ని వ్యాఖ్యానించారు. అలా కాకుండా... గంజాయి స్మ‌గ్ల‌ర్ల‌ను అండ‌మాన్ జైల్లో పెట్టాల‌ని సూచించారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఏం జ‌రిగింది?

'సంక‌ల్పం-2.0' పేరుతో ప్ర‌భుత్వం రాష్ట్రంలో గంజాయి నిర్మూలనపై ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హిస్తోంది. ప్ర‌తి సోమ‌వారం నియోజ‌క‌వ‌ర్గాలు, న‌గ‌రాల్లో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంపీలు కూడా హాజ‌ర‌వుతున్నారు. ఈ క్ర‌మంలో సోమ‌వారం అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు పాల్గొన్నారు. స‌హ‌జంగానే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసే ఆయ‌న‌.. గంజాయి నిర్మూల‌న‌, పోలీసుల వైఖ‌రిపై కూడా అలానే వ్యాఖ్య‌లు సంధించారు. విశాఖ‌ప‌ట్నంలోని ఇంజ‌నీరింగ్ కాలేజీ హాస్ట‌ళ్ల‌లో విద్యార్థులు రాత్రి పూట గంజాయి తాగుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానిం చారు.

ఇది తాను ఆరోపిస్తున్న‌ది కాద‌ని.. పోలీసు రికార్డులే చెబుతున్నాయ‌ని అయ్య‌న్న అన్నారు. పిల్లలను కాలేజీల‌కు పంపేసి ఫీజులు క‌ట్టేసి త‌ల్లిదండ్రులు చేతులు దులుపుకొంటున్నార‌ని ఆరోపించారు. కానీ, విద్యార్థుల‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించారు. యుక్త వ‌య‌సులో గంజాయికి అల‌వాటు ప‌డితే.. వారి కుటుంబాల పరిస్థితి ఏంటో ఆలోచించాలని కోరారు. పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని త‌న‌కు కొంద‌రు ఫిర్యాదులు చేశార‌ని.. కానీ, ఇలాంటి కేసుల్లో మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని తాను సిఫార్సు చేశాన‌ని చెప్పారు.

గంజాయి స‌ర‌ఫ‌రాదారులు, మాఫియా వివ‌రాలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌న్నారు. వారి వివ‌రాల‌ను పోలీసుల‌కు కావాలంటే ఇస్తాన‌ని చెప్పారు. అయితే.. వారిని అరెస్టు చేసే ద‌మ్ము ఉందో లేదో.. పోలీసులు ఆలోచించుకోవాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలావుంటే, అసెంబ్లీస్పీక‌ర్‌గా ఉన్న అయ్య‌న్న పాత్రుడు త‌న వ‌ద్ద గంజాయి స్మ‌గ్ల‌ర్ల జాబితా ఉంద‌ని ప్ర‌క‌ట‌న చేయ‌డంతో పెను సంచ‌ల‌నంగా మారింది. దీనిపై టీడీపీ నాయ‌కులే విస్తుబోతున్నారు. మరి ఆయ‌న ఏ ఉద్దేశంతో అన్నారో అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Tags:    

Similar News