వలస జీవుల ఆశల సమరం.. అమెరికాలో ఉద్యోగం పోతే ఇళ్లు వదిలి భారత్‌కు రావాల్సిందేనా?

ఇక్కడున్న వారి కుటుంబాలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అసలు ఈ వైరల్ పోస్టుల వెనుక ఉన్న నిష్టుర సత్యమేమిటి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Update: 2026-09-29 14:30 GMT

ఒక స్వప్నం... దశాబ్దాల కష్టం... రెక్కలు ముడుచుకుని మాతృభూమికి చేరే క్షణం ఎంత వేదన భరితంగా ఉంటుందో ఊహించగలమా? ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులు పదుల సంఖ్యలోని భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అమెరికాలోని ఒక ఇంట్లో ఫర్నిచర్, పిల్లల బొమ్మలు, సామాన్లు యథావిధిగా వదిలేసి ఓ కుటుంబం భారత్‌కు తిరిగి వెళ్లిపోయిందన్న దృశ్యాలు ప్రవాస భారతీయులను.. ఇక్కడున్న వారి కుటుంబాలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అసలు ఈ వైరల్ పోస్టుల వెనుక ఉన్న నిష్టుర సత్యమేమిటి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సముద్రం దాటి వెళ్లిన ప్రతీ హెచ్-1బీ ఉద్యోగి కథ వెనుక ఒక పెద్ద త్యాగం ఉంటుంది. రాత్రింబవళ్లు కష్టపడి.. డాలర్ల కలలను నిజం చేసుకుంటూ.. కష్టపడి సంపాదించిన డబ్బుతో అమెరికా నేలపైన ఒక సొంతింటిని నిర్మించుకుంటారు. ఆ ఇంట్లోని ప్రతీ మూల ఒక జ్ఞాపకమే. కానీ ఒక్క టెక్ కోత... లేదా ఒక్క వీసా రద్దు వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. హెచ్1బీ ఉద్యోగం పోయిన తర్వాత ఇచ్చే ఆ 60 రోజుల గడువు ఒక రకమైన కౌంట్‌డౌన్ లాంటిది. ఆ గడువులోగా ఇంకో స్పాన్సర్ దొరక్కపోతే దశాబ్దాల ప్రయాణాన్ని మూటగట్టుకుని దేశం విడిచి వెళ్లక తప్పదు.

అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు అందరూ ఇళ్లను.. ఆస్తులను అనాథలుగా వదిలేసి పారిపోతున్నారా అంటే అది పూర్తిగా నిజం కాదు. ఒక ఇంటిని అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం అనేది రాత్రికి రాత్రే జరిగే ప్రక్రియ కాదు. మార్కెట్ పరిస్థితులు బాగోలేనప్పుడు.. లోన్ బకాయిలు ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని కుటుంబాలు అత్యవసర పరిస్థితిలో తీవ్ర నష్టాలను భరించాల్సి వస్తుంది. ఒకవేళ ఇల్లు వదిలి వెళ్లినా.. ఆ అప్పులు ఆటోమేటిక్‌గా రద్దు కావు. చట్టపరమైన ఫోర్‌క్లోజర్ ప్రక్రియలు, బ్యాంకింగ్ చర్యలు వారిపై కొనసాగుతూనే ఉంటాయి.

గతంలో 2000 నాటి డాట్‌కామ్ సంక్షోభం.. 2008 నాటి తీవ్ర ఆర్థిక మాంద్యం సమయంలోనూ ఇటువంటి కష్టకాలం వచ్చింది. నాటి జ్ఞాపకాలు నేటికీ గాయాలుగానే మిగిలాయి. కానీ ఒక్క వైరల్ పోస్ట్ ను చూసి అమెరికాలోని ప్రతి భారతీయ హెచ్1బీ కుటుంబం తీవ్ర సంక్షోభంలో ఉందనుకోవడం తొందరపాటే అవుతుంది.

వైరల్ అయ్యే పోస్టులు, వీడియోలు కేవలం ఆందోళనను భావోద్వేగాలను పెంచగలవు. కానీ ప్రవాస భారతీయుల అసలు పోరాటం చట్టం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, గ్రీన్ కార్డ్ నిరీక్షణ, ఉద్యోగ భద్రతలతో ముడిపడి ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపినా... మళ్లీ నిలదొక్కుకునే ఆత్మవిశ్వాసమే మన భారతీయుల అతిపెద్ద బలం. భయం కన్నా వాస్తవాలను గ్రహించి సరైన చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవడమే ఈ క్లిష్ట సమయం నుంచి గట్టెక్కించే ఏకైక మార్గం.

Tags:    

Similar News