ట్రంప్ తెలివే తెలివి: పన్నులు పెంచి పెట్టుబడులు రాబట్టారా?
అయితే.. దీనికి భిన్నంగా పరిశ్రమ దారులను, పెట్టుబడి దారులను బెదిరించి లొంగ దీసుకోవడం.. వారితో పెట్టుబడులు పెట్టించడం అనేది ఎక్కడా లేదు.
రాష్ట్రాలకైనా.. దేశాలకైనా పెట్టుబడులు రావాలంటే.. ప్రభుత్వాలు కొన్ని మెట్లు దిగి వస్తాయి. పెట్టుబడి దారులకు అనుకూల విధానాలను రూపొందిస్తాయి. పన్నులు తగ్గిస్తాయి.. రాయితీలు పెంచుతాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ ల్లో జరుగుతున్న విధానాలు ఇవే. ఇక, కేంద్ర ప్రభుత్వంకూడా.. అనేక రాయితీలు ఇస్తోంది. పెట్టుబడులు పెట్టేవారి కి రెడ్ కార్పెట్ పరుస్తోంది. అయితే.. దీనికి భిన్నంగా పరిశ్రమ దారులను, పెట్టుబడి దారులను బెదిరించి లొంగ దీసుకోవడం.. వారితో పెట్టుబడులు పెట్టించడం అనేది ఎక్కడా లేదు.
కానీ, ఈ విధానం కూడా తనకు సాధ్యమేనని అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా భారత్‌కు చెందిన ఎస్సార్ గ్రూప్ సంస్థ అమెరికాలో పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా వెల్లడించారు. ఐరన్ ఫ్యాక్టరీని ఈ సంస్థ అమెరికాలో ఏర్పాటు చేయనుంది. దీనికిగాను భారత కరెన్సీలో లక్షా 40 వేల కోట్ల రూపా యలను పెట్టుబడిగా పెట్టనుంది. తద్వారా 2 వేల మందికి ఉద్యోగాలు.. అంతే సంఖ్యలో కార్మికులకు ఉపాధి వంటి వి లభించనున్నాయి. అయోవా రాష్ట్రంలో ఈ సంస్థ ఏర్పాటు కానుంది.
అమెరికా చరిత్రలో అతి పెద్ద రెండో విదేశీ పెట్టుబడి ఇదే కావడం గమనార్హం. ఈ విషయాన్నే ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ పెట్టుబడితో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెట్టుబడిదారులు కూడా అమెరికాకు `క్యూ` కడతారని ఆయన పేర్కొన్నారు. అదేసమయంలో ట్రంప్ మద్దతుదారులు, కొందరు మంత్రులు ఈ విషయంపై దూకుడు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ సుంకాలు, పన్నుల కొరడా ఝళిపించబట్టే.. విదేశీ పెట్టుబడులువస్తున్నాయని వ్యాఖ్యానించారు.
విదేశీ వస్తువులపై 50 నుంచి 100 శాతం సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా సుంకాలు కట్టుకునే బదులు.. అమెరికాలోనే సంస్థలను స్థాపిస్తే బెటర్ అని భావిస్తున్నారని.. అందుకే ఎస్సార్ సంస్థ అమెరికా లో పెట్టుబడులు పెడుతోందని అన్నారు. ఇక, అమెరికాలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు జీరో సుంకాలు, పన్నుల్లో రాయితీ వంటివి ఇస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. ఇతర దేశాల్లో మాదిరిగా అమెరికాలో వ్యాపారం చేయాలంటే.. పక్కాగా నిబంధనలు పాటించాలి. పనికి తగిన వేతనంకాదు.. నిర్దేశిత వేతనం ఇవ్వాలి. సమయ పాలన పాటించాలి. దీంతో విదేశీపెట్టుబడి దారులు, ముఖ్యంగా భారత్‌కు చెందిన సంస్థలు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడుతుంటాయి. కానీ, సుంకాల ఎఫెక్ట్‌తో ఇప్పుడు అమెరికాబాటపట్టడం గమనార్హం.