మేనమామ కానుక.. విలువ రూ.756 కోట్లు!! తమిళనాడులో విజయ్ సంచలనం
తమిళనాడు సాంప్రదాయం ప్రకారం మేనమామ (తాయ్‌మామన్) పుట్టిన బిడ్డకు కానుకలు ఇచ్చే ఆచారాన్ని గుర్తుచేస్తూ ఈ పేరు పెట్టారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక జనాకర్షక విధానాలు అవలంబిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్న దళపతి విజయ్ మరో సంచలన పథకానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తయ్‌మామన్ బంగారు ఉంగరం పథకం అమలులోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 22 తర్వాత పుట్టిన ప్రతి బిడ్డకు గ్రాము బరువు ఉన్న 22 క్యారెట్ల బంగారు ఉంగరాన్ని ప్రదానం చేయనున్నారు. తమిళనాడు సాంప్రదాయం ప్రకారం మేనమామ (తాయ్‌మామన్) పుట్టిన బిడ్డకు కానుకలు ఇచ్చే ఆచారాన్ని గుర్తుచేస్తూ ఈ పేరు పెట్టారు.
ముఖ్యమంత్రి విజయ్ పక్కావ్యూహం ప్రకారం ఈ పథకాన్ని తీసుకువచ్చారని అంటున్నారు. ప్రజలతో ఒక భావోద్వేగ సంబంధం ఏర్పాటు చేసుకోడానికి తనను తాను మేనమామగా పిలుపించుకునేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళనాడులో అమ్మగా జయలలిత, అన్నగా ఎంజీఆర్ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెబుతున్నారు. ఇప్పుడు మేనమామగా తాను కూడా ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి దళపతి విజయ్ పావులు కదుపుతున్నట్లు ఉన్నారని అంటున్నారు. ఇక ఏటా సుమారు 4.4 లక్షల మంది చిన్నారులు జన్మిస్తుంటే, ఈ ఏడాది బంగారు ఉంగరాల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.756 కోట్లు కేటాయించిందని చెబుతున్నారు.
కాగా, ఈ పథకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మార్కెట్ లో తరచూ ఒడిదుడుకులు లోనయ్య బంగారం ధరల ప్రభావం పథకంపై ఉండకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని అంటున్నారు. ఏడాది కోసం ఇప్పటికే బంగారం సేకరించిందని, ఈ విషయమై టెండర్లు ఆహ్వానించి దాదాపు 4 లక్షలకు పైగా ఉంగరాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్డర్ ఇచ్చినందున ధరల ప్రభావం ప్రభుత్వంపైన పథకంపైన ఉండదని అంటున్నారు.
ఇక మేనమామ కానుకగా 22 క్యారెట్ల బంగారు ఉంగరం అందుకుంటున్న తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిద్వారా ఒక్కో కుటుంబానికి సుమారు పది వేల వరకు లబ్ది చేకూరుతుందని అంటున్నారు. ప్రభుత్వం నుంచి విలువైన కానుక ఇస్తున్నందున ఎటువంటి అవకతకవలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని అంటున్నారు. ప్రతి ఉంగరానికి సురక్షితమైన ప్యాకింగ్ చేయడంతోపాటు ప్రత్యేక సీరియల్ నంబరు కేటాయించారని చెబుతున్నారు. ఎక్కడైనా పొరపాటు జరిగినా, సీరియల్ నంబరు ఆధారంగా గుర్తించే వీలు ఉంటుందని చెబుతున్నారు.