బిడ్డను పెంచేందుకు రూ.1.39 కోట్లు ఖర్చా? వైరల్ వీడియోపై నెటిజన్లలో చర్చ

అదే విధంగా వైద్య ఖర్చులు, టీకాలు, ఆరోగ్య పరీక్షలు, దుస్తులు, ప్రయాణాలు, వినోదం, ఇతర నిత్యావసర అవసరాలకు మిగిలిన మొత్తం వెచ్చించాల్సి వస్తుందని వీడియోలో వివరించారు.

Update: 2026-08-04 10:35 GMT

పిల్లోడు పుట్టగానే "హాస్పిటల్‌కి స్వాగతం" అనడానికి బదులు "మీ బిల్లు రూ.1.39 కోట్లు సార్" అని హ్యాండ్ ఓవర్ చేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి షాకే ఇచ్చాడో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఒక చిన్నారిని 18 ఏళ్లు పెంచడానికి దాదాపు రూ.1.39 కోట్లు ఖర్చవుతుందంటూ ఆయన వేసిన 'షాకింగ్' క్యాలిక్యులేషన్స్ చూసి.. నెటిజన్లు "అంతేనా.. కాలేజీ ఫీజులు, పెళ్లి ఖర్చులు ఆఫర్ కింద ఉచితంగా ఇస్తున్నారా ఏంటి?" అంటూ సెటైర్లు వేస్తున్నారు.

భారతదేశంలో ఒక బిడ్డను పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు పెంచేందుకు సుమారు రూ.1.39 కోట్లు ఖర్చవుతుందని ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పిల్లల పెంపకం, విద్య, వైద్యం, జీవన వ్యయాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియో విస్తృత చర్చకు దారి తీసింది. అయితే ఇందులో పేర్కొన్న లెక్కలు అధికారిక ప్రభుత్వ గణాంకాలు లేదా ఏదైనా పరిశోధనా సంస్థ నివేదిక ఆధారంగా వెల్లడించినవి కావని.. ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన అంచనాలేనని గుర్తుంచుకోవాలి.

వైరల్ వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం.. ఒక చిన్నారిని 18 ఏళ్ల వరకు పెంచేందుకు అయ్యే మొత్తం ఖర్చులో విద్యకే అత్యధికంగా రూ.75 లక్షలు వెచ్చించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇందులో స్కూల్ ఫీజులు, పుస్తకాలు, కోచింగ్, అదనపు శిక్షణ, ఇతర విద్యా సంబంధిత వ్యయాలు కూడా ఉంటాయని వివరించారు. ఆ తర్వాత ఆహారం కోసం సుమారు రూ.30 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు.

అదే విధంగా వైద్య ఖర్చులు, టీకాలు, ఆరోగ్య పరీక్షలు, దుస్తులు, ప్రయాణాలు, వినోదం, ఇతర నిత్యావసర అవసరాలకు మిగిలిన మొత్తం వెచ్చించాల్సి వస్తుందని వీడియోలో వివరించారు. ముఖ్యంగా ప్రైవేట్ విద్యాసంస్థలు, నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయం, ఆరోగ్య సేవల ఖర్చులు ఈ లెక్కలకు ప్రధాన కారణాలుగా ఇన్‌ఫ్లుయెన్సర్ పేర్కొన్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కొందరు నెటిజన్లు ప్రస్తుతం పిల్లలను పెంచడం నిజంగానే చాలా ఖరీదైన వ్యవహారంగా మారిందని.. అందుకే చాలామంది కుటుంబాలు ఒకే బిడ్డతో పరిమితమవుతున్నాయని లేదా పిల్లలను కనడంపై ఆర్థిక కోణంలో ఆలోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు. మరికొందరు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విద్యా వ్యవస్థలో అధిక ఫీజులు, వైద్య ఖర్చులు కుటుంబాలపై తీవ్ర భారం మోపుతున్నాయని వ్యాఖ్యానించారు.

మరోవైపు ఈ వీడియోలో చెప్పిన ఖర్చులను కొందరు అతిశయోక్తిగా కొట్టిపారేశారు. ప్రతి కుటుంబం జీవనశైలి, ఆదాయం, నివాస ప్రాంతం, పిల్లల విద్య కోసం ఎంచుకునే సంస్థలను బట్టి ఖర్చులు మారుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆరోగ్య సేవలు వినియోగించే కుటుంబాల్లో ఈ వ్యయం చాలా తక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

ఇక మరికొందరు నెటిజన్లు డబ్బుతో పిల్లల విలువను కొలవలేమని వ్యాఖ్యానించారు. సంతానం ఇచ్చే ఆనందం, కుటుంబానికి తీసుకొచ్చే సంతోషం, భావోద్వేగ బంధం ముందు డబ్బు పెద్ద విషయం కాదని వారు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ఈ వైరల్ వీడియో పిల్లల పెంపకం ఖర్చులపై, కుటుంబ ఆర్థిక ప్రణాళికపై, నేటి జీవన వ్యయాలపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది.

Tags:    

Similar News