కూటమి మీద విష్ణు చక్రం...రాజు గారి తీరు వెనక ?

విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఉన్నట్లుండి కూటమి ప్రభుత్వానికే ఎదురు నిలిచారు.;

Update: 2025-12-29 06:30 GMT

విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఉన్నట్లుండి కూటమి ప్రభుత్వానికే ఎదురు నిలిచారు. అది కూడా గతంలో తానే అన్ని విధాలుగా జగన్ సర్కార్ మీద తీవ్ర విమర్శలు చేసిన రుషికొండ పాలెస్ మీద. ఏకంగా రుషికొండకు గుండు కొట్టించారు అని జగన్ ప్రభుత్వం మీద పెద్ద గొంతుతో గత అయిదేళ్ళ కాలంలో విరుచుకుపడిన వారిలో ఫస్ట్ పర్సన్ విష్ణు కుమార్ రాజు ఉన్నారు. ఆయన జగన్ మీద విమర్శలు అంటే ఒంటి కాలి మీద లేచేవారు. ఒక్కోసారి ఆయన చాలా దూకుడుగా చేసిన విమర్శలు హాట్ కామెంట్స్ గా మారి ఏపీలో పెద్ద చర్చకు దారి తీసిన సందర్భాలూ ఉన్నాయి.

టీడీపీతోనే అంటూ :

ఇక పేరుకు బీజేపీ ఎమ్మెల్యే అయినా టీడీపీ మనిషిగా ఆయన ఉన్నారు అని గతంలో అనేక సందర్భాలలో విష్ణు మీద సొంత పార్టీ వారే పరోక్షంగా విమర్శలు చేసిన సందర్భం ఉంది. ఇక ఆయన చంద్రబాబుతో సాన్నిహిత్యం నెరుపుతూ వ్యవహరించిన తీరు కూడా మరో చర్చగా ఉండేది. ఇవన్నీ పక్కన పెడితే ఆయన గతంలో బీజేపీ తరఫున అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. ప్రస్తుతం అదే పదవిలో ఉన్నారు. మంత్రి అవుదామన్న ఆశలు అయితే తీరలేదు రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వారుగా బీజేపీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఆయన ఒక్కరే ఉన్నారు. కానీ మినిస్టర్ పోస్టు మాత్రం దక్కలేదు. ఇదొక అసంతృప్తి అయితే మరొకటి కూటమితో ఇటీవల ఆయన అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. బీజేపీలో కీలక నేతలు టీడీపీతో సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో రాజు గారు దూరం జరిగారా లేక అలాగే ఉన్నారా అన్నది మరో చర్చ.

ఆధ్యాత్మిక కేంద్రం అంటూ :

రుషికొండ ప్యాలెస్ ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలని రాజు గారు కొత్త డిమాండ్ ముందు పెట్టారు. దానికి హొటల్స్ కి ఇవ్వడం వ్యాపారం చేయడం కాదని ఆయన విమర్శించారు. విశాఖ అంటే కేవలం ఐటీ సెక్టార్ మాత్రమే కాదని కూడా రాజు గారు బిగ్ సౌండ్ చేస్తున్నారు. పైగా మంత్రుల ఉప సంఘం విశాఖకు చెందిన ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని ఆయన లాజిక్ పాయింట్ ని లేవనెత్తారు. ఇవన్నీ చూస్తూంటే రాజు గారి మాటలలో తేడా ఎక్కడో కొడుతోంది అని అంటున్నారు.

వారికే ఇస్తారా :

ఇక విశాఖ విజయవాడలలో ఇప్పటికే స్టార్ హొటెల్స్ ని నిర్వహిస్తున్న బిగ్ షాట్స్ కే రుషికొండ పాలెస్ ని కట్టబెడతారు అని ప్రచారం సాగుతోంది. ఆ విషయం ముందే పసిగట్టిన రాజు గారు అక్కడ బడా స్టార్ హొటల్ పెడితే సామాన్యులు ఏమి వెళ్ళగలరు అని పాయింట్ రైజ్ చేశారు అని అంటున్నారు. అదే విధంగా వారికి ఇవ్వడం ఈయనకు నచ్చడం లేదా ఈయన మదిలో వేరే ఎవరైనా ఉన్నారా అన్న చర్చ కూడా ఉంది. ఇంకో వైపు చూస్తే వచ్చే ఎన్నికల విషయంలో కూడా రాజు గారికి ఒక క్లారిటీ వచ్చిందా అందుకేనా ఆయన ఈ విధంగా ఓపెన్ అవుతున్నారు అని కూడా చర్చించుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే రాజు గారి టోన్ మారింది. సౌండ్ పెరిగింది. టీడీపీనే టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంది. మరి దీని వెనక వ్యూహం ఏమిటి ఆయన ఏమి కోరుతున్నారు అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News