సరదా సిగరెట్టు కాదు...ఫుల్ గా తీర్చేస్తుందా ?

సరదా సరదా సిగరెట్టు దొరల్ తాగు బల్ సిగరెట్టు అని బ్లాక్ అండ్ వైట్ సినిమాలో అలనాటి కమెడియన్ రేలంగి పాడే పాట ఉంది.;

Update: 2025-12-29 05:30 GMT

సరదా సరదా సిగరెట్టు దొరల్ తాగు బల్ సిగరెట్టు అని బ్లాక్ అండ్ వైట్ సినిమాలో అలనాటి కమెడియన్ రేలంగి పాడే పాట ఉంది. ఇపుడు అర్జంటుగా ఆ పాటను గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది దొరలు తాగే సిగరెట్ కాబోతోంది. అంటే సామాన్యుడికి చిక్కకుండా దక్కకుండా పోతోంది అన్న మాట. కాస్తా దమ్ము కొట్టు గురూ అని ఫ్రెండ్ కి ఆఫర్ చేసే సాధారణ సిగరెట్టు ఇపుడు బంగారం కాబోతోంది. రేటుకి టాప్ గేర్ వేస్తూ ఎవరెస్ట్ ఎక్కిపోతోంది.

ధూమ ప్రియులకు చేదు :

పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్ అన్నాడు మహాకవి గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో గిరీశం. మరి దున్నపోతు అయినా అవుతాడేమో కానీ పొగ తాగేందుకు ఆస్కారం లేకుండా ధర దంచేసేలా ఉండబోతోంది అని అంటున్నారు. ధూమపానం చేసేవారికి అందునా సిగరెట్లు ప్రేమికులకు ఎన్నో రెట్లు దాని ధరను పెంచి మరీ చేదు నిజం చెప్పబోతున్నారుట. కేంద్రం ఈ విషయంలో సీరియస్ గానే ఉంది అని అంటున్నారు.

సిగరెట్లు మానిపించడానికే :

సిగరెట్లు వల్ల ఆదాయం మాట ఎలా ఉన్నా అనారోగ్యాలు అయితే బోలెడు వస్తున్నాయి. అందుకే సిగరెట్ ధరనే సామాన్యుడు కాదు కదా దొరలైనా కొనలేని స్థితికి అమాంతం పెంచేస్తే ఆ వినియోగం అన్నది తగ్గిపోతుందని కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఎక్సైజ్ డ్యూటీ భారీగా పెంచితే సిగరెట్టు మోయలేని భారం అవుతుంది అని అంటున్నారు.

నాలుగింతలుగా :

ప్రస్తుతం మార్కెట్ లో సిగరెట్ ఒకటి ధర 18 రూపాయలుగా ఉంది. దీనిని ఏకంగా నాలుగింతలుగా అంటే 73 రూపాయలుగా ఒక్కో సిగరెట్ ధరను పెంచాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ విధంగా చేస్తే పది సిగరెట్లు కలిగిన ఒక పెట్టే ప్రసుతం 180 రూపాయలకు వచ్చేది కాస్తా 720 రూపాయలు అవుతుంది. రోజుకు ఈజీగా ఒక పెట్టె కాదు రెండు కాల్చేసే వారు ఉన్నారు. పెరిగిన రేట్లతో ఒక్క పెట్టె కాదు కదా ఒక్క సిగరెట్ కూడా కొనలేరు కాల్చలేరు అని అంటున్నారు.

పాపం సిగరెట్టు ప్రేమికులు :

ఇక కేంద్రం అయితే సెంట్రల్ ఎక్సైజ్ ఎమెండ్మెంట్ బిల్ 2025 లో ఈ ప్రతిపాదనలు పెట్టి అంతా సిద్ధం చేసింది అని అటున్నారు. ఇక ఈ నిర్ణయం పట్ల దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అయితే పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక చెడు అలవాటుని దూరం చేయడానికి ఈ రకంగా చేయాల్సిందే అని సపోర్టు చేస్తున్నారు పాపం సిగరెట్టు ప్రేమికులు మాత్రం కిందా మీదా అవుతున్నారు. ఎందుకంటే వారికి సిగరెట్టు లేకపోతే డైలీ కాలకృత్యాలు సాగవు. మరి ఏం చేస్తారో ఏమిటో.

Tags:    

Similar News