రెండు హెలీకాప్టర్లు గాల్లోనే ఢీకొంటే ఎట్టుంటాదో తెలుసా.. వీడియో!
అవును... ఆదివారం దక్షిణ న్యూజెర్సీలో రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది.;
రోడ్డుపై రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొంటే ఎలా ఉంటుంది..? రెండు బండ్లు తుక్కు తుక్కు అయిపోతాయి! మరి రెండు హెలీకాప్టర్లు గాల్లో ఒకదానినొకటి ఢీకొంటే..! తాజాగా దక్షిణ న్యూజెర్సీలో ఇదే జరిగింది. రెండు హెలీకాటర్లు గాల్లోనే ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
అవును... ఆదివారం దక్షిణ న్యూజెర్సీలో రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన అట్లాంటిక్ కౌంటీలోని ఒక చిన్న ఎయిర్ ఫీల్డ్ అయిన హామోంటన్ మున్సిపల్ విమానాశ్రయం పైన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:25 గంటలకు జరిగింది. ఎయిర్ పోర్ట్ సమీపంలో విమాన ప్రమాదం జరిగిందనే నివేదికల తర్వాత అత్యవసర బృందాలను పంపినట్లు హామోంటన్ పోలీస్ చీఫ్ కెవిన్ ఫ్రైల్ తెలిపారు.
ఇదే సమయంలో.. ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, జాతీయ రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు ప్రారంభించాయని అన్నారు. అదేవిధంగా.. విమాన మార్గాలు, కమ్యూనికేషన్లు, ఢీకొనడానికి దోహదపడిన ఇతర అంశాలను ఫెడరల్ పరిశోధకులు పరిశీలిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్... ఈ ప్రమాదంలో ఎన్ స్ట్రోమ్ ఎఫ్-28ఏ హెలికాప్టర్, ఎన్ స్ట్రోమ్ 280సి లు ఢీకొన్నాయని ఎలిపింది. అయితే.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రెండు హెలికాప్టర్లలోనూ పైలెట్లు మాత్రమే ఉన్నారని వెల్లడించింది. ఇందులో ఓ హెలికాప్టర్ పైలెట్ అక్కడికక్కడే మృతి చెందగా.. రెండవ పైలెట్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. అతడి పరిస్థితి విషయంగా ఉందని తెలిపారు!
ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సందర్భంగా స్పందించిన అక్యూవెదర్... ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులు ప్రధాన కారకంగా కనిపించలేదని.. ఆకాశం ఎక్కువగా మేఘావృతమై ఉందని.. అయితే గాలులు తక్కువగానే ఉన్నాయని.. ఢీకొన్న ప్రాంతంలో దృశ్యమానత బాగానే ఉందని తెలిపింది. అంటే.. ఈ ప్రమాదానికి వాతావరణ పరిస్థితులు కారణం కాదని వెల్లడించినట్లయ్యింది!
కాగా... హోమోంటన్ అనేది ఫిలడెల్ఫియాకు ఆగ్నేయంగా సుమారు 35 మైళ్ల (దాదాపు 56 కిలోమీటర్ల) దూరంలో ఉన్న నివాసితుల ప్రాంతం. ఇక్కడ సుమారు 15,000 వరకూ నివసిస్తున్నారు. వ్యవసాయ మూలాలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో ఒక మిలియన్ ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం ఉంది.