ఏజెన్సీ వ‌ణుకుతోంది కేసీఆర్‌.. బీ అలర్ట్‌

Update: 2017-12-16 05:18 GMT
ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల సంబ‌రాలు అంబ‌రాన్ని అంటేలా స్టార్ట్ అయిన వేళ‌..తెలంగాణ‌లోని అదిలాబాద్ జిల్లా అందుకు భిన్నంగా విభేదాల‌తో భ‌గ్గుమంటోంది. ఆదివాసీలు. లంబాడీల మ‌ధ్య నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న వివాదం పెద్ద‌ది కావ‌ట‌మే కాదు.. ఇరువర్గాలు దాడుల‌కు దిగ‌టంతో ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం అట్టుడికిపోతోంది. ఎప్పుడు.. ఎక్క‌డేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి చోటు చేసుకుంది.

ఎస్టీ జాబితాలో నుంచి లంబాడీల‌ను తొల‌గించాల‌ని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నా.. త‌మ‌కు రిజ‌ర్వేష‌న్లు తీసేసి అన్యాయం చేయ‌కూడ‌ద‌ని లంబాడీలు కోరుతున్నారు. ఈ వివాదం ఇప్ప‌టిది కాకున్నా.. ఈ మ‌ధ్య‌న హైద‌రాబాద్ లోని స‌రూర్ న‌గ‌ర్ స్టేడియంలో నిర్వ‌హించిన  ఆదివాసీల స‌భ‌కు భారీ స్పంద‌న రావ‌టం.. ల‌క్ష‌కు పైగా ఆదివాసీలు హాజ‌రు కావ‌టంతో ఈ వ్య‌వ‌హారం తాజాగా తెర మీద‌కు వ‌చ్చింది.

ఇదిలా ఉంటే.. ఆదివాసీల స‌భ‌కు పోటీగా లంబాడీలు అదే స‌రూర్ న‌గ‌ర్ స్టేడియంలో స‌భ‌ను నిర్వ‌హించారు. ఆదివాసీల డిమాండ్ల‌కు కౌంట‌ర్ డిమాండ్ల‌ను తెర మీద‌కు తెచ్చారు. పోటాపోటీగా పెట్టుకున్న స‌భ‌లు రెండు వ‌ర్గాల మ‌ధ్య విభేదాల్ని మ‌రింత పెంచాయ‌ని చెప్పాలి.

త‌మ డిమాండ్ల‌ను తెర మీద‌కు తెస్తూ హైద‌రాబాద్ లో మొద‌లైన పోటాపోటీ స‌భ‌లు.. అదిలాబాద్ జిల్లాను తాకాయి.  ఇలాంటి ప‌రిస్థితుల్లోనే అదిలాబాద్ ఏజెన్సీలోని నార్నూర్ మండ‌లం బేతాల్ గూడ‌లో గురువారం రాత్రి గుర్తు తెలియ‌ని కొంద‌రు వ్య‌క్తులు కుమురం భీం విగ్ర‌హానికి చెప్పుల దండ వేయ‌టంతో వివాదం రాజుకుంది.

త‌మ‌ను అవ‌మానించారంటూ ఆదివాసీలు భ‌గ్గుమ‌న్నారు. కుమురం భీం విగ్ర‌హం ద‌గ్గ‌ర‌కు పెద్ద సంఖ్య‌లో చేరుకున్న ఆదివాసీలు త‌మ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. అప్ప‌టికే అక్క‌డ చేరుకున్న పోలీసులు ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. అక్క‌డ జ‌రిగిన వ్య‌వ‌హారంపై సోష‌ల్ మీడియాలో వ్యాప్తి చెందిన స‌మాచారం ప‌రిస్థితిని ఒక్క‌సారిగా మార్చేసింది.నార్నూర్ మండ‌లం తాడిహ‌త్నూర్ లో ఇరువ‌ర్గాల వారు రోడ్ల మీద‌కు చేరుకొని ప‌ర‌స్ప‌రం రాళ్లు రువ్వుకోవ‌టంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు.

ఇలాంటి స‌మ‌యంలో మ‌రికొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి.  ఉట్నూరు మండ‌లం హ‌న్నాపూర్ లో ఆదివాసీలు ధ‌ర్నా చేస్తుండ‌గా అక్క‌డ‌కు లంబాడీలు చేరుకోవ‌టంతో ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ప‌ర‌స్ప‌రం రాల్లు రువ్వుకున్నారు. ఆదివాసీలు కొంద‌రికి గాయాలు అయ్యాయి. ఈ గొడ‌వ‌లు ముదిరి ఇరు వ‌ర్గాలు బీభ‌త్సాన్ని సృష్టించాయి.

ఇదిలా ఉంటే.. ఆదివాసీలు.. లంబాడీల మ‌ధ్య జ‌రుగుతున్న ఘ‌ర్ష‌ణ‌ల్లో ఆరుగురు మృతి చెందారంటూ కొన్ని టీవీ ఛాన‌ళ్లు అత్యుత్సాహంతో ప్ర‌సారం చేసిన వార్త‌లు ప‌రిస్థితిని మ‌రింత దిగ‌జారేలా చేశాయి. ఘ‌ర్ష‌ణ‌లు ఏజెన్సీతో పాటు మ‌రిన్ని ప్రాంతాల‌కు వ్యాప్తించ‌ట‌మే కాదు.. హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల‌కు పాకేలా చేశాయి. వీరి మ‌ధ్య రాజుకున్న వివాదాన్ని స‌మ‌సిపోయేలా చేసేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ రంగ‌ప్ర‌వేశం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. రెండు ప‌క్షాల వారి వ్య‌వ‌హారాల్ని చ‌క్క‌దిద్దేందుకు మంత్రుల స్థాయిలో క‌మిటీ వేయ‌టంతో పాటు.. త‌ప్పు చేసిన వార‌ని క‌ఠినంగా శిక్షించాల్సిన అవ‌స‌రం ఉంది. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ముప్పు వాటిల్లే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన వారిపై క‌ఠినంగా శిక్షించాల్సిన అవ‌స‌రం ఉంది. ఎంతోకాలంగా న‌డుస్తున్న ఇష్యూ మ‌రింత ముదిరిపోకుండా చేయ‌టంతోపాటు.. ఇరువ‌ర్గాల‌కు ఆమోద‌యోగ్య‌మైన రాజీని చేయాల్సిన అవ‌స‌రం ఉంది. లేనిప‌క్షంలో ప్ర‌భుత్వానికి ఊహించ‌ని త‌ల‌నొప్పులు రావ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News