స్టూడెంట్స్ దెబ్బ అట్లుంటదీ.. ఒక్క పోస్టుతో నటి పెర్లీ మానీకి భారీ షాక్
అసలేం జరిగిందంటే... ఇటీవల విద్యార్థులు నీట్ పై చేస్తున్న నిరసనను చూసి పెర్లీ గారి హృద్రోగం తట్టుకోలేకపోయింది.
సెలబ్రిటీలు సోషల్ మీడియాను ప్రమోషన్లకు.. రీల్స్‌కి మాత్రమే వాడుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈపాటికే ప్రముఖ నటి, యాంకర్ పెర్లీ మానీకి బాగా అర్థమైపోయి ఉంటుంది. సామాజిక అంశాల మీద ప్రేమ ఒలకబోద్దామని భావించి ఒక్క పోస్టు పెడితే... ఫాలోవర్లు దెబ్బకి "మేము నీకు అన్‌ఫాలో కొడుతున్నాం తల్లీ" అంటూ గెంటేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
బాధ్యతగల సలహానా? లేక బ్రేకింగ్ మిస్టేకా?
అసలేం జరిగిందంటే... ఇటీవల విద్యార్థులు నీట్ పై చేస్తున్న నిరసనను చూసి పెర్లీ గారి హృద్రోగం తట్టుకోలేకపోయింది. "ప్రొటెస్ట్ చూస్తుంటే చాలా బాధగా ఉంది. ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు, దయచేసి ఇంటికి వెళ్లిపోండి" అంటూ ఒక ఉచిత సలహాను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ రూపంలో వదిలారు.
పాపం ఆమె ఉద్దేశం విద్యార్థుల భద్రతే కావచ్చు.. కానీ హక్కుల కోసం రోడ్డెక్కి పోరాడుతున్న వారికి ఈ "జ్ఞానబోధ" అసలు రుచించలేదు. "మేము ఇక్కడ భవిష్యత్తు కోసం కొట్లాడుతుంటే, నువ్వు హాయిగా ఏసీ రూమ్‌లో కూర్చుని 'ఇంటికి వెళ్ళిపోండి' అని సలహాలిస్తావా?" అంటూ నెటిజన్లు పెర్లీపై ట్రోలింగ్ అస్త్రాలు విసిరారు. ఉద్యమాన్ని నీరుగార్చేలా మాట్లాడొద్దంటూ ఘాటుగానే క్లాస్ పీకారు.
కాషాయం మెరుపులు.. కలర్ ఫుల్ వివాదాలు..
ఇది చాలదన్నట్టు.. ఆమె పెట్టిన ఆ స్టోరీకి 'కాషాయం' రంగు బ్యాక్‌గ్రౌండ్ వాడటం మరో పెద్ద రచ్చకు దారితీసింది. దీనిపై నెటిజన్లు నిలదీసేసరికి... "అయ్యో నాకేమీ రాజకీయం తెలీదు బాబోయ్.. నాకు కాషాయం రంగు అంటే ఇష్టం.. అది మన జాతీయ జెండాలో కూడా ఒక భాగమే కదా!" అంటూ ఆమె ఇచ్చిన వివరణ 'మింగలేక కక్కలేక' అన్నట్టు తయారైంది. వివరణ ఇచ్చి నిప్పును ఆర్పేద్దామనుకుంటే అది కాస్త పెట్రోల్ పోసినట్లయింది.
"అన్‌ఫాలో" కొట్టిన జనం.. డిజిటల్ షాక్
ఈ చిన్నపాటి సలహా పుణ్యమా అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె దాదాపు 3 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయారు. 5.7 మిలియన్ల నుంచి ఒక్కసారిగా 5.4 మిలియన్లకు పడిపోవడమంటే సాధారణ విషయం కాదు.. కేవలం ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే కాదు.. యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో కూడా ఫాలోవర్లు 'ఎగ్జిట్' బటన్ నొక్కేస్తున్నారు.
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏది మాట్లాడినా అది క్షణాల్లో తుఫానుగా మారుతుంది. "నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది" అంటారు కానీ సోషల్ మీడియా యుగంలో "పోస్టు మంచిదైతే ఫాలోవర్లు మిగులుతారు" అని సవరించుకోవాలేమో.. మరి ఈ ఊహించని షాక్ నుంచి బయటపడటానికి పెర్లీ మేడమ్ మరో సారీ పోస్ట్ పెడతారో లేక సైలెంట్‌గా ఉండిపోతారో చూడాలి.