విజయ్ బాటలో ధనుష్.. తమిళ పాలిటిక్స్ లోకి 'స్టార్ వార్స్'.. హిట్ అవుతుందా?
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, జాతీయ అవార్డు గ్రహీతగా ఎంతో గుర్తింపు పొందిన ధనుష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
తమిళనాడు పాలిటిక్స్‌లో మరో దళపతి వేవ్ రాబోతుందా? రీల్ హీరోగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ధనుష్.. ఇప్పుడు 'రియల్' రాజకీయంలోకి ఎంట్రీకి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారా? 'దళపతి' విజయ్ స్టైల్‌లోనే సైలెంట్‌గా స్కెచ్ వేస్తూ అభిమానులకు ఆయన ఇచ్చిన లేటెస్ట్ కాల్ తమిళ రాజకీయాన్ని హీటెక్కిస్తోంది.. రాయన్ నేషనల్ అవార్డు రగడ నుంచి పొలిటికల్ పిలుపు వరకు.. నెట్టింట వైరల్ అవుతున్న ఆ సంచలన వీడియో వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి?
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, జాతీయ అవార్డు గ్రహీతగా ఎంతో గుర్తింపు పొందిన ధనుష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల తన అభిమాన సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ధనుష్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకుంది.
ఫ్యాన్స్‌కు పిలుపు.. సమాజ సేవపై క్లారిటీ
ఈ సమావేశంలో ధనుష్ మాట్లాడుతూ తన అభిమానులకు ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. అభిమానులందరూ ఒకే వేదికపైకి రావడం వల్ల లభించే శక్తి అపారమైనదని, కానీ ఆ శక్తిని కేవలం ఆడియో ఫంక్షన్లు, సెలబ్రేషన్లకు మాత్రమే పరిమితం చేయకూడదు. తనను కలవడానికి మాత్రమే వినియోగించకూడదు. ఆ శక్తిని సమాజ శ్రేయస్సు కోసం, పేద కుటుంబాలకు అండగా నిలవడానికి వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు. అభిమాన సంఘాల ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని, ఇతరులలోనూ చైతన్యాన్ని నింపే బాధ్యతను ఫ్యాన్స్ తీసుకోవాలని కోరారు.
విజయ్ రూట్‌లోనే ధనుష్?
తమిళనాడు ముఖ్యమంత్రిగా సుపరిచితుడైన విజయ్ తన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీని ప్రకటించడానికి ముందు తన అభిమాన సంఘాల ద్వారా దాదాపు దశాబ్ద కాలం పాటు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ధనుష్ కూడా సరిగ్గా అదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నారనే అభిప్రాయాలు తమిళ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయకాంత్, కమల్ హాసన్ నుండి విజయ్ వరకు సినీ నేపథ్యం ఉన్న నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ధనుష్ కూడా అదే బాటలో నడుస్తారా అనేది ఉత్కంఠగా మారింది. అయితే పొలిటికల్ ఎంట్రీపై ధనుష్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
'రాయన్' నేషనల్ అవార్డు విమర్శలపై నిజాయితీ
ఇదే సమావేశంలో తన ‘రాయన్’ సినిమాకు వచ్చిన జాతీయ అవార్డు విమర్శలపై ధనుష్ ఎంతో నిజాయితీగా స్పందించారు. 2024లో 'రాయన్' కంటే మెరుగైన చిత్రాలు కూడా వచ్చాయని.. ప్రజల అభిప్రాయాల్లో కొంత వాస్తవం ఉందనే విషయాన్ని ఆయన ఓపెన్‌గా అంగీకరించారు. తనపై వచ్చే విమర్శలను ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో స్వీకరిస్తానని తెలిపారు.
అభిమానులను సేవా బాట పట్టించడం వెనుక ధనుష్‌కు ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా లేదా ఇది కేవలం సమాజ హితం కోసమేనా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు..