భారత వ్యాపారి కిడ్నాప్.. రూ.100 కోట్లు డిమాండ్.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ చర్చలలో భారత ప్రభుత్వ ఏజెన్సీల ప్రమేయం ఏమీ లేదని, కుటుంబ సభ్యులే నేరుగా కిడ్నాపర్లతో చర్చలు జరిపి ఆయనను విడిపించినట్లు తెలుస్తోంది.
సుమారుగా 3 నెలల క్రితం కిడ్నాప్ కు గురైన భారత సంతతి వజ్రాల వ్యాపారి కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. పశ్చిమాఫ్రికా దేశం మాలిలో మూడు నెలల క్రితం కిడ్నాప్ అయిన వజ్రాల వ్యాపారి ధీరూ రమణిను కుటుంబ సభ్యులు ఏకంగా రూ.44 కోట్లు చెల్లించి విడుదల చేయించారు. కిడ్నాపర్స్ నుండి బయటకు వచ్చిన రమణిను ప్రస్తుతం మాలిలోని స్థానిక అధికారులు కిడ్నాప్ జరిగిన విషయంపై విచారిస్తున్నట్లు సమాచారం.
వజ్రాల వ్యాపారిని కిడ్నాప్ చేసి 100 కోట్లు డిమాండ్..
అసలు విషయంలోకి వెళ్తే.. గుజరాత్ లోని అమ్రేలీ జిల్లాకు చెందిన ధీరూ రమణికి సూరత్ వజ్రాల పరిశ్రమతో చాలా ఏళ్ల నుండి సంబంధాలు ఉన్నాయి. పైగా ఆయన కొన్నేళ్లుగా అమెరికాలోనే స్థిరపడ్డారు. తన వ్యాపార విస్తరణలో భాగంగా పశ్చిమ ఆఫ్రికా మాలిలోని ఒక బంగారు గనిలో పెట్టుబడులు కూడా పెట్టారు. అమెరికాలో నివాసం ఉంటూనే అంతర్జాతీయంగా వ్యాపారం చేసే రమణి కుటుంబం.. రెండేళ్ల క్రితం బంగారు గనుల రంగంలో కూడా అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే మాలిలోనే ఒక గని పనులను పర్యవేక్షిస్తున్న రమణిని ఈ ఏడాది ఏప్రిల్ లో అక్కడే దుండగులు అపహరించారు. సుమారుగా మూడు నెలల పాటు తమ అధీనంలో ఉంచిన కిడ్నాపర్లు.. ఆయనను విడిచి పెట్టేందుకు ఏకంగా రూ.100 కోట్లు డిమాండ్ చేశారు .
44 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న కుటుంబ సభ్యులు..
అయితే అమెరికాలో ఉంటున్న ఆయన కుటుంబ సభ్యులు.. వీడియో కాల్ ద్వారా రమణి క్షేమంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాతే కిడ్నాపర్లతో నేరుగా చర్చలు జరిపి రూ.44 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నగదు చెల్లించడం తో పాటు ఆయనతో ఉన్న వంట మనిషి, ఎలక్ట్రీషియన్ ను దుండగులు ఇటీవల విడిచిపెట్టారు.
మూడు నెలల తర్వాత విడుదలైన వజ్రాల వ్యాపారి..
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ చర్చలలో భారత ప్రభుత్వ ఏజెన్సీల ప్రమేయం ఏమీ లేదని, కుటుంబ సభ్యులే నేరుగా కిడ్నాపర్లతో చర్చలు జరిపి ఆయనను విడిపించినట్లు తెలుస్తోంది. ఇకపోతే విడుదల తర్వాత స్థానిక పోలీసులు రమణిని విచారించారు. అంతే కాదు ఈ ఘటన జరిగిన తర్వాత మాలిలోని భారత రాయబారి కార్యాలయం అక్కడ ఉన్న భారతీయులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది
భద్రతా లోపించడమే కిడ్నాప్ కు కారణమా..
ఇకపోతే అతిపెద్ద వజ్రాల వ్యాపారిగా గుర్తింపు తెచ్చుకున్న ధీరూ రమణిని మాలిలో కిడ్నాప్ చేయడంతో అక్కడి భద్రత పరిస్థితులపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మాలిలో భద్రతా పరిస్థితులు సరిగా లేకపోవడంతోనే రమణి కిడ్నాప్ జరిగిందని.. ఏప్రిల్ నెలలోనే అక్కడి భారత రాయబార కార్యాలయం పౌరులకు హెచ్చరికలు కూడా జారీ చేసింది అయితే ఈ కిడ్నాప్ వెనుక ఎవరున్నారు? వియోచక క్రయ ధనం చెల్లింపు వంటి వివరాలపై అటు మాలి ప్రభుత్వం గానీ, భారత ప్రభుత్వం కానీ అధికారికంగా స్పందించలేదు. ఏది ఏమైనా కిడ్నాపర్లు 100 కోట్లు డిమాండ్ చేసి చివరికి 44 కోట్ల ధనంతో ఆయనను విడుదల చేశారు. అయితే రమణి స్వదేశానికి ఎప్పుడు తిరిగి వస్తారు అన్నదానిపై స్పష్టత లేదు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.