బోండా విత్ అంబటి...టీడీపీ సీరియస్ డెసిషన్ ?
ఈ నేపథ్యంలో పార్టీలో మరో నేత ఈ విధంగా వైసీపీ నేతలతో వేదికలు పంచుకోకుండా ఉండాలంటే ముందు బోండా ఉమాని పిలిచి వివరణ కోరాలని అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకుడు బోండా ఉమా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇద్దరూ గుంటూరు జిల్లాలో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో ఒకే వేదిక పంచుకున్నారు. అంతే కాదు మూడు గంటల పాటు సాగిన ఈ సభలో పక్క పక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు. నవ్వులు చిందిస్తూ ఫోటోలు కనిపించారు. ఇక ఇదే సభలో బోండా ఉమా మాట్లాడుతూ కాపులలో అసంతృప్తి ఉందని అన్నారు. వారు ఎవరి పక్షం ఉంటే వారిదే విజయం అని కూడా అన్నారు. ఇవన్నీ కూడా టీడీపీలో ఇపుడు చర్చనీయాంశం అయ్యాయి. దాంతో పాటు టీడీపీ అధినాయకత్వం కూడా బోండా ఉమా వైఖరి మీద సీరియస్ గా ఉందని అంటున్నారు. వైసీపీని ఒక వైపు గొడ్డలి పార్టీ విష వృక్షం అని తాము ప్రచారం చేస్తూంటే మరో వైపు తమ పార్టీకి చెందిన నాయకులు అంతా వైసీపీ నేతలతో చేతులు కలిపి వేదికలు ఎలా పంచుకుంటారు అని టీడీపీ అధినాయకత్వం ఫైర్ అవుతోంది అని అంటున్నారు.
వారితో అసలు వద్దు :
ఇదిలా ఉంటే టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ ని తాజాగా నిర్వహించిన చంద్రబాబు ఇదే విషయం పార్టీ నాయకులకు చెప్పారని అంటున్నారు. టీడీపీ నేతలు అంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వైసీపీ కుల మత రాజకీయాలకు పాల్పడుతోందని ఆ పార్టీ ట్రాప్ లో టీడీపీ వారు ఎవరూ చిక్కుకోవద్దు అని గట్టిగానే చెప్పారు. భవిష్యత్తులో కూడా ఎవరూ వైసీపీ నేతలతో బహిరంగంగా కనిపించవద్దు అని ఒక ఆదేశంగానే బాబు చెప్పారని అంటున్నారు.
టీడీపీ టార్గెట్ గా :
మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రతీ రోజూ టీడీపీని చంద్రబాబుని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారని అలాంటి నేతతో బోండా ఉమా ఒకే వేదికను పంచుకోవడం పట్ల టీడీపీలో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది అని అంటున్నారు. ఇది తప్పుడు సంకేతాలు ఇస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. గతంలో కూడా కొందరు నేతలు ఇలాగే వైసీపీ నేతలతో కనిపించారని ఈ విధంగా చేయడం వల్ల జనాల్లోకి వేరే విధంగా సందేశం వెళ్తుందని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. ఒక వైపు వైసీపీ మీద తీవ్రంగా టీడీపీ మండిపడుతోంది. మరి ఈ విధంగా నాయకులు కనిపిస్తే ఆ విమర్శలు లైట్ తీసుకునే ప్రమాదం ఉందని కూడా ఆలోచిస్తోంది అంటున్నారు.
బోండా నుంచి అలా :
ఈ నేపథ్యంలో పార్టీలో మరో నేత ఈ విధంగా వైసీపీ నేతలతో వేదికలు పంచుకోకుండా ఉండాలంటే ముందు బోండా ఉమాని పిలిచి వివరణ కోరాలని అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు ఇద్దరూ బోండా నుంచి వివరణ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారని అంటున్నారు. ఈ విధంగా కఠినంగా లేకపోతే భవిష్యత్తులో మరింత మంది ఇదే విధంగా వ్యవహరిస్తారు అన్నది దృష్టిలో ఉంచుకునే బాబు సీరియస్ గా ఈ విషయంలో ఉన్నారని అంటున్నారు. మరి బోండా ఉమా ఏ రకమైన వివరణ ఇస్తారు అన్నది ఇపుడు చూడాలి. బోండా ఉమా కూడా ఫైర్ బ్రాండ్ లీడర్ గా ముద్ర పడ్డారు. ఆయన మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్నారు. ఈ మధ్యనే విజయవాడలో జరిగిన ముద్రగడ సంస్మరణ సభలో ఆయన పాల్గొని విజయవాడ సెంట్రలో నడిబొడ్డున ముద్రగడ విగ్రహం పెడతామని అన్నారు. ముద్రగడ ఆశయాల కోసం కృషి చేస్తామని కూడా చెప్పారు. మొత్తం మీద ఇటీవల బోండా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.