నన్ను బాగా వాడుకోండయ్యా...ఎవరా ఎంపీ...ఏమా కధ ?
ఈ నేపధ్యంలో ఇటీవల జరిగిన పలు కార్యక్రమాలలో సైతం బాబూరావుకి చివరిగా మాట్లాడే అవకాశం ఇచ్చారని ఆయన గుస్సా అయ్యారు.
రాజకీయాల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. కొందరు నేతలకు పదవులు ఇచ్చినా పనిచేయరు. మరి కొందరు వీర లెవెల్ లో పనిచేద్దామని ఉత్సాహపడుతున్నా వారికి చాన్స్ ఇవ్వరు. ఇది అన్ని పార్టీలలో ఉండేదే. వైసీపీలో అయితే ఈ తేడా బాగా అని అంటున్నారు. వైసీపీలో పార్టీ నిర్మాణం నుంచి నిర్ణయాల నుంచి అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. అధినాయకత్వం ఎవరిని పిలిచి మైక్ అప్పగిస్తే వారే మాట్లాడుతారు. అదే సమయంలో ఒకరికి పెద్ద పీట వేశారు అని మిగిలిన వారు అసూయ చెందేలోగా వారు ఎక్కడ ఉంటారో తెలియనంత పాతాళానికి చేరుకుంటారు. అయితే వైసీపీలో నాయకులను వాడుకోవడం తెలియదా అంటే ఎందుకు తెలియదు భేషుగ్గా వాడుకుంటారు అని జవాబు వస్తుంది. మరి కొందరు అయితే తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సరిగ్గా పార్టీ వేదికల మీద తమ ప్రెజెన్స్ లేకుండా పోతోంది అని తీవ్ర అసంతృప్తిలో ఉంటున్నారు. వారిలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఒకరు అని ప్రచారం సాగుతోంది.
అధికార పదవిలో :
ఇదిలా ఉంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో పెద్ద పదవితో అధికార హోదాలో ఉన్న ఏకైక నాయకుడు గొల్ల బాబూరావు మాత్రమే. మిగిలిన వారు అంతా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు. అంతే కాదు గొల్ల బాబూరావు మూడు సార్లు పాయకరావుపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2009లో కాంగ్రెస్ నుంచి తొలిసారి వైఎస్సార్ చలవతో గెలిచారు. ఆ తరువాత వైఎస్సార్ కుటుంబం మీద అభిమానంతో వైసీపీలో చేరి 2012లో ఉప ఎన్నికల్లో మరోసారి గెలిచారు. 2019లో మళ్ళీ మూడోసారి గెలిచారు. అయితే ఆయన కోరుకున్న మంత్రి పదవి రాలేదని అప్పట్లో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసేవారు. 2024లో ఆయనకు పాయకరావుపేట టికెట్ దక్కలేదు. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా నుంచి రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులుని తెచ్చి పోటీ చేయించారు. అదే సమయంలో రాజ్యసభ సీటు బాబూరావుకి ఇచ్చి ఆయనను పెద్దల సభకు పంపారు. ఆనాడు బాబూరావు మదిలో ఏముందో కానీ ఫలితాలు వచ్చాక మాత్రం ఆయన ఎంత అదృష్టవంతులో వైసీపీ నేతలే గట్టిగా చెప్పుకున్నారు. అంతా ఓటమి పాలు అయితే 2030 దాకా ఎంపీగా ఉన్న పదవితో బాబూరావు రాజకీయ హవా చాటుకున్నారు.
ముఖ్య బాధ్యతలు అంటూ :
ఇదిలా ఉంటే బాబూరావు తనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని తాను వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకుని రావడానికి కృషి చేస్తాను అని అంటున్నారు. తనకు రాజకీయంగా 16 ఏళ్ళకు పై చిలుకు అనుభవం ఉందని ఆయన అంటున్నారు. జిల్లాలో పార్టీని పరుగులు పెట్టించేలా తన యాక్షన్ ప్లాన్ ఉంటుందని అంటున్నారు. అయితే వైసీపీలో మాత్రం ఇతర నాయకులదే పెత్తనం అన్నట్లుగా ఉంటోంది. బాబురావు వంటి కీలక నాయకుడిని రాజ్యసభ ఎంపీని పక్కన పెడుతున్నారని ఆయన వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. బలహీన వర్గాలకు చెందిన తమ నాయకుడిని ముందు పెడితే పార్టీకే మేలు అని వారు అంటున్నారు.
అక్కడే తేల్చుకుంటారా :
ఈ నేపధ్యంలో ఇటీవల జరిగిన పలు కార్యక్రమాలలో సైతం బాబూరావుకి చివరిగా మాట్లాడే అవకాశం ఇచ్చారని ఆయన గుస్సా అయ్యారు. దీని మీద అధినాయకత్వంతోనే నేరుగా తేల్చుకుంటాను అని ఆయన అంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మరి అన్నీ తెలిసిన అధినాయకత్వం బాబూరావుకు జిల్లాలో ముఖ్య పాత్ర ఇచ్చి ముందుకు పంపిస్తుందా అన్నదే చూడాలని అంటున్నారు. రాజకీయంగా చక్రం తిప్పాలని పెద్దల సభలో ఎంపీ అయిన పెద్దాయన ఆరాటపడుతూంటే వైసీపీ పెద్దలు మాత్రం ఎందుకో ఆయనను కొంత వరకే వాడుకుంటున్నారు అని అంటున్నారు. నన్ను పూర్తిగా వాడుకోండి నా అనుభవం అంతా పార్టీకి అందిస్తాను అని గొల్ల బాబూరావు అంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. మరి వైసీపీ హైకమాండ్ ఆయన్ని ఎలా వాడుకుంటుందో చూడాల్సి ఉంది.