బాబులో పెరిగిన ధీమా...జగన్ కి నో చాన్స్ ?

అంతే కాదు ఆయన తన స్వీయ అనుభవంతో కూడా ప్రతీ అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. బేరీజు వేస్తారు. దాంతోనే బాబు ఏ విషయం మీద అయినా గట్టిగా చెప్పగలరు అని అంటున్నారు.

Update: 2026-07-27 03:54 GMT

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుది నాలుగున్నరకు పై చిలుకు దశాబ్దాల రాజకీయ అనుభవం. ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ మూడు సార్లు సీఎం అయితే చంద్రబాబు అంతకు మించి అయ్యారు. ఇక ఎన్ టీఆర్ ఎనిమిదేళ్ళ పాటు ఉమ్మడి ఏపీని పాలిస్తే చంద్రబాబు రెట్టింపు కాలం సీఎంగా ఈ రోజుకు ఉన్నారు. జనం నాడిని పట్టుకోవడంతో బాబుని మించిన వారు ఎవరూ లేరని అంటారు. ఆయన ఎప్పటికపుడు అన్నీ చెక్ చేయించుకుంటారు. ఆయన నిరంతరం జనంతో ఉంటారు. వివిధ వర్గాల ద్వారా ఏజెన్సీల ద్వారా కూడా ప్రజాభిప్రాయాన్ని ఒడిసిపడతారు. అంతే కాదు ఆయన తన స్వీయ అనుభవంతో కూడా ప్రతీ అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. బేరీజు వేస్తారు. దాంతోనే బాబు ఏ విషయం మీద అయినా గట్టిగా చెప్పగలరు అని అంటున్నారు.

కూటమిదే అధికారం అంటూ :

ఏపీలో మరోసారి కూటమిదే అధికారం అని టీడీపీ అధినేత తాజాగా పార్టీ నేతల టెలి కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించారు. మళ్ళీ వచ్చేది మనమే అని బలంగా చెప్పారు. అయితే నేతలు రిలాక్స్ కాకుండా ప్రజలతో ఉండాలని ఆయన కోరారు. అయితే బాబు ఇంత నిబ్బరంగా ఎలా చెప్పగలుగుతున్నారు అన్నదే ఇపుడు చర్చగా సాగుతోంది. బాబు ఊరకే మాట్లాడరు, ఆయన ఒక మాట అన్నారు అంటే దాని వెనకాల లెక్కలు చాలానే ఉంటాయని అంటున్నారు. ఏపీలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా టీడీపీ కూటమి వైపు పార్టీలు అన్నీ ఉన్నాయి. అవతల వైపు వైసీపీ ఒకటి ఒంటరి అంకె అన్నట్లుగా ఉంది. కాంగ్రెస్ వామపక్షాల బలం ఇప్పట్లో పెరగలేదు, రేపటి రోజున పెరిగినా అది వైసీపీకే నష్టం తప్ప కూటమికి కాదని కూడా బాబు అంచనా వేస్తున్నారు అని అంటున్నారు.

వైసీపీ దూకుడు మీద :

వైసీపీ 2014 నుంచి 2019 మధ్యలో పెద్ద ఎత్తున దూకుడు చేసేది, ప్రతీ అంశం మీద జగన్ నేరుగా జనంలో ఉంటూ పాల్గొనేవారు. అదే విధంగా ఆయన పోలవరం పాదయాత్ర చేశారు. అలాగే దీక్షలు చేశారు. అనేక అంశాల మీద జనంలోనే ఉంటూ గట్టిగా రియాక్ట్ అయ్యేవారు. ఇక అసెంబ్లీలో కూడా గట్టిగానే వైసీపీ తన వాదన వినిపించేది. తొలి మూడేళ్ళు అసెంబ్లీలో జగన్ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఉండేది. ఇవన్నీ జనంలో భారీ ఇంపాక్ట్ చూపించాయి. ఇవి జరిగిన తరువాతనే జగన్ పాదయాత్రకు సిద్ధపడ్డారు. దాని మీద మంచి స్పందన లభించింది అని టీడీపీ అధినాయకత్వం విశ్లేషణగా ఉంది అంటున్నారు.

నాటి వేడి లేదా :

ఇక వైసీపీ ప్రస్తుతం అంటే 2024 నుంచి ప్రతిపక్షంలో ఉంది. ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో అసెంబ్లీకి రావడం మానుకుంది. ఆ విధంగా చట్ట సభలలో తన గొంతు వినిపించే చాన్స్ మిస్ అయింది. ఇక వైసీపీలో ఓటమి తరువాత అత్యధిక శాతం నాయకులు అయితే సైలెంట్ అయిపోయారు. కొందరు మాత్రమే మాట్లాడుతున్నారు. మరో విషయం తీసుకుంటే అధినేత జగన్ లో కూడా మునుపటి దూకుడు కనిపించడం లేదని అంటున్నారు. ఇక 2019కి ముందు వేరు అప్పుడు జగన్ ఎలా పాలిస్తారో అన్న అసక్తి ఉండేది అందుకే ఒక్క చాన్స్ అంటే ఇచ్చారు అని టీడీపీ హైకమాండ్ ఆలోచనగా ఉంది. ఇపుడు వైసీపీ పాలన చూశారు కాబట్టి ఆ మోజు ఉండదని కూడా భావిస్తున్నారు.

దూరంగానే ఆ వర్గాలు :

మరో వైపు పట్టణ వర్గాలు న్యూట్రల్స్, మేధావులు విద్యావంతులు ఇంకా వైసీపీకి దూరంగానే ఉన్నారని టీడీపీ వైపు నుంచి విశ్లేషణగా ఉంది అని అంటున్నారు. అంతే కాదు అనేక కీలక సామాజిక వర్గాలలో కూడా వైసీపీ పట్ల భావన మారలేదని గుర్తు చేస్తున్నారు. వైసీపీ కూడా వారిని దగ్గరకు తీసే విధంగా ఆత్మ విమర్శ చేసుకోవడం తన వైఖరి మార్చుకోవడం వంటివి చేయలేదని అంటున్నారు. అలాగే అభివృద్ధి విషయంలో వైసీపీ అజెండా ఎపుడూ అస్పష్టంగానే ఉంటోంది అని అది టీడీపీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. మూడు రాజధానులు మావిగన్ అంటూ అమరావతి విషయంలో వైసీపీ చేస్తున్న ప్రకటనలు కూడా ఆ పార్టీని పలచన చేశాయనే అంటున్నారు. ఇలా అనేక అంశాలు ముడిపడి ఉన్నందువల్ల వైసీపీ విషయంలో జనాలు రెండో చాన్స్ ఇవ్వడం నో చాన్స్ ని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. పైగా మూడు పార్టీలతో టీడీపీ బలంగా ఉంటే వైసీపీ ఒంటరి పోరాటం చేయడం వల్ల కూడా ఆ పార్టీలో ధీమా పెరుగుతోంది అని అంటున్నారు. అందుకే బాబు మళ్ళీ వచ్చేది మేమే అని నిబ్బరంగా చెబుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News