బొండా ఉమా వ్యవహారం ముదురుతోంది.. టీడీపీలో ఏం జరుగుతోంది?

అయితే ఈ విషయంపై మీడియా ముఖంగా స్పందించిన ఎమ్మెల్యే బొండా ఉమా ఎదురు ప్రశ్నలతో అధిష్టానానికి సవాల్ విసురుతున్న సంకేతాలు పంపుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.

Update: 2026-07-27 07:11 GMT

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడమే కాకుండా, పార్టీలో కాపులను పట్టించుకోవడం లేదన్న వ్యాఖ్యలతో ఎమ్మెల్యే ఉమాపై పార్టీ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఆయన నుంచి వివరణ తీసుకోవాల్సిందిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడును అధినేత చంద్రబాబు ఆదేశించారు. దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై మీడియా ముఖంగా స్పందించిన ఎమ్మెల్యే బొండా ఉమా ఎదురు ప్రశ్నలతో అధిష్టానానికి సవాల్ విసురుతున్న సంకేతాలు పంపుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.

ఎమ్మెల్యే బొండా నుంచి వివరణ తీసుకోవాల్సిందిగా అధిష్టానం ఆదేశించిందని చెబుతుండగా, ఇంతవరకు తనను ఎవరూ వివరణ అడగలేదని ఎమ్మెల్యే బొండా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో అధిష్టానాన్ని ధిక్కరించేలా ఆయన వేస్తున్న ప్రశ్నలు హీట్ పుట్టిస్తున్నాయి. తాను వైసీపీ నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లలేదని చెబుతూ, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన మాజీ మంత్రి ముద్రగడ సంస్మరణ కార్యక్రమానికి మాత్రమే వెళ్లానని, అక్కడ మాజీ మంత్రి అంబటి కనిపిస్తే మర్యాద కోసం మాట్లాడానని అంటున్నారు. ఇదే సమయంలో రాజమండ్రిలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిర్వహించిన సభకు టీడీపీ నేతలు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధాకృష్ణ వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వారికి లేని అభ్యంతరం తనకు ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించడమే కాకుండా వారికి వివరణ అడుగుతారా? అంటూ అధిష్టానాన్ని ఎమ్మెల్యే నిలదీస్తున్నారు.

అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా వైసీపీకి చెందిన మాజీ మంత్రి బొత్సతో గతంలో మాట్లాడిన విషయాన్ని ఎమ్మెల్యే ఎత్తిచూపుతున్నారు. ఎవరి విషయంలో లేని వివాదాలు తనకే ఎందుకంటూ ఎమ్మెల్యే వేస్తున్న ప్రశ్నలు పార్టీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. కాపు నేతలు అంతా ఒక్కటయ్యే సమయం వచ్చిందని, పార్టీలకు అతీతంగా కాపులు ఏకమవుతామని ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు సైతం రెచ్చగొట్టేవిగా ఉన్నాయని అంటున్నారు. ఆయన వ్యవహారశైలి, మాట్లాడుతున్న విధానం గమనిస్తే పార్టీతో ఢీకొట్టేందుకే ఎమ్మెల్యే సిద్ధమవుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి ముద్రగడే కారణమంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంతో మొదలైన రగడ ఎక్కడి వరకు దారితీస్తుందో అర్థం కావడం లేదని అంటున్నారు. కొన్నాళ్లుగా పార్టీ విషయంలో ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. సమయం చూసుకుని తన వైఖరి బయటపెడతామనే ఆలోచనకు వచ్చిన ఆయన మాజీ మంత్రి ముద్రగడ సంస్మరణ వేదికగా పార్టీపై తిరుగుబాటుకు రెడీ అయ్యారని అంటున్నారు. అయితే టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన ఎమ్మెల్యే ఒక్కసారిగా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారనేది అంతుచిక్కడం లేదు. గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో కాలుష్య నియంత్రణ మండలిపై ఆయన వేసిన ప్రశ్నతో అగ్గి రాజుకుందని, అప్పుడు టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే వైఖరిని తప్పుబట్టడంతోనే ఆయన అసంతృప్తికి లోనయ్యారని అంటున్నారు. అంతేకాకుండా ఇంతకు ముందు ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు లేనట్లు భావిస్తున్న ఆయన కాపు ఉద్యమంతో తన ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. దీంతో అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News