మోడీ చెప్పినట్టే: పార్లమెంటుకు 'పరీక్షల బిల్లు'.. కానీ..!
ఈ సమయంలో ఓంబిర్లా మాట్లాడుతూ... సభాసాంప్రదాయాలను సభ్యులందరూ... పాటించాలని... సభ్యుల హక్కు అయిన ప్రశ్నోత్తరాలు కొనసాగేలా సహకరించాలని కోరారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన సెల్ఫీ వీడియోల్లో చెప్పినట్టుగానే నీట్ పరీక్ష సహా.. ఇతర ప్రవేశ పరీక్షలకు సంబంధించి పక్కా వ్యవహరించేలా ఉపకరించే కఠిన చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం సర్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో `పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్ మెంట్ బిల్ -2026` ప్రవేశపెట్టింది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో అక్రమ పద్దతులను నివారించడానికి ఉద్దేశించింది. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అనుమతితో ఈ బిల్లును కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెట్టారు.
ఓటింగ్ అనంతరం బిల్లుపై చర్చకు అనుమతిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే.. ముందుగా చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఒకసారి ఓటింగ్ అయిపోయిన తర్వాత.. ఇక, చర్చించి ప్రయోజనం ఏంటన్నది వారి డిమాండ్. ఇక, ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యార్థుల ప్రయోజనాలకు కాపాడేందుకు, పరీక్షల ప్రక్రియను బలోపేతం చేయడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలపై సభలో చర్చించడమే అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉండాలని పేర్కొన్నారు.
విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపైనే ప్రభుత్వం దృఢంగా దృష్టి సారించిందని తెలిపారు. ఈ బిల్లును ఆమోదించడమే ప్రాధాన్యతా అంశమని... ఇది అత్యంత కీలకమైన, ముఖ్యమైన బిల్లని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు సభ దృష్టిని పక్కదారి పట్టించవద్దని కోరారు మరోవైపు.. విపక్షాలు తమ నిరసనలు కొనసాగించడంతో బిల్లును ప్రవేశ పెట్టిన పది నిమిషాల్లోనే లోక్‌సభ వాయిదా పడింది. వాయిదా తీర్మానానికి పట్టుబడుతూ... విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నినాదాలు ప్రారంభించారు.
ఈ సమయంలో ఓంబిర్లా మాట్లాడుతూ... సభాసాంప్రదాయాలను సభ్యులందరూ... పాటించాలని... సభ్యుల హక్కు అయిన ప్రశ్నోత్తరాలు కొనసాగేలా సహకరించాలని కోరారు. అయినా... విపక్షాలు సహకరించకపోవటంతో సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఓంబిర్లా ప్రకటించారు. అనంతరం తిరిగి సభ ప్రారంభమైన తరువాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో సభను మరోసారి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా వాయిదా పర్వం కొనసాగింది. ఛైర్మన్ సీపీ. రాధాకృష్ణన్ అధ్యక్షతన సభ ప్రారంభంకాగానే .... వాయిదా తీర్మానానికి అనుమతించాల్సిందిగా సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఛైర్మన్ ను కోరారు. దీనికి చైర్మన్ అంగీకరించకపోవడంతో వాయిదా వేశారు.