చెల్లెలి ఆపరేషన్ : స్పందించని జగన్.. అన్నాచెల్లెలి బంధం తెగిపోయినట్లేనా?
మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు శస్త్రచికిత్స జరిగినా ఆయన పరామర్శించకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
మానవ సంబంధాలలో రక్తసంబంధానికి ఎంతో విలువ ఉంటుంది. కుటుంబ వ్యవస్థకు, సమాజంలో పరస్పర సహకారానికి రక్తసంబంధమే మూలస్తంభమని చెబుతుంటారు. కుటుంబ బలాన్ని, భావోద్వేగ భద్రతను అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల అనుబంధం ఇస్తుంది. అయితే రాజకీయ కారణాల వల్ల ఇటువంటి అనుబంధాలు తెగిపోయే పరిస్థితులు ఏర్పడటం ఒక విషాదమనే చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో తలెత్తిన విభేదాలు అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని పూర్తిగా తెగిపోయే స్థాయికి చేర్చాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు శస్త్రచికిత్స జరిగినా ఆయన పరామర్శించకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామంతో జగన్, షర్మిల మధ్య బెడిసికొట్టిన సంబంధాలపై విస్తృత చర్చ జరుగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య కుటుంబ విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇవి రాజకీయంగా కూడా వారిద్దరి మధ్య పెను అగాధాన్ని సృష్టించాయని అంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలు ఎంత పెద్దవైనా కష్టసుఖాల్లో కలుసుకోవడం మన భారతీయ సంప్రదాయమని పెద్దలు చెబుతుంటారు. ఇందుకు విరుద్ధంగా మాజీ సీఎం జగన్ కుటుంబంలో విభేదాలు కొనసాగుతుండటమే చర్చనీయాంశమవుతోంది. సహజంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. కానీ జగన్, షర్మిల మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
చాలా కుటుంబాల్లో అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తండ్రీకొడుకులు రాజకీయంగా ప్రత్యర్థులుగా వ్యవహరించడం సర్వసాధారణమే. రాజకీయ కారణాలతో ఒకరినొకరు విభేదించుకుంటూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. అదే సమయంలో, రాజకీయ వైరం ఎంత ఉన్నా కుటుంబ అనుబంధాలను ఛిన్నాభిన్నం చేసుకోకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. అయితే మాజీ సీఎం జగన్, పీసీసీ చీఫ్ షర్మిల విషయంలో మాత్రం అటువంటి జాగ్రత్త మచ్చుకైనా కనిపించడం లేదని అంటున్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షర్మిల ఆకస్మికంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్వయంగా వెల్లడించారు. కొన్నాళ్లుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న షర్మిల అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, ఆమె ఆస్పత్రిలో చేరినట్లు అప్పటివరకు ఎవరికీ తెలియదు. తనకు ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని ఆమె తెలియజేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక ఆమె త్వరగా కోలుకోవాలని, మునుపటిలా రాజకీయంగా చురుగ్గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమాల ద్వారా కోరారు.
రాజకీయంగా ప్రత్యర్థులు అయినప్పటికీ షర్మిల కోలుకోవాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే జగన్ కూడా స్పందిస్తూ ట్వీట్ చేస్తారని అభిమానులు ఎదురుచూశారు. కానీ, షర్మిలకు శస్త్రచికిత్స జరిగి రెండు రోజులు గడుస్తున్నా జగన్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చెల్లెలుగా షర్మిలపై ఏమైనా మనస్పర్థలు ఉన్నప్పటికీ, రాజకీయంగా ఒక ప్రముఖ స్థానంలో ఉన్న మహిళా నాయకురాలిపై కనీస సానుభూతి చూపడం మానవతా దృక్పథమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే, అన్నాచెల్లెళ్ల మధ్య సంబంధాలు మళ్లీ పూర్వ స్థితికి రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.