రోజా టైం వచ్చేసింది...? తిరుపతి పోలీసుల నోటీసులతో టెన్షన్
ఇదే కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోక్షిత్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేయగా, ఆయన తిరస్కరించినట్లు చెబుతున్నారు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నాయకురాలు ఆర్కే రోజాపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసిందా? రెండేళ్లుగా రోజా ఎక్కడ చిక్కుతుందా? అని ఎదురుచూస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు ఆంధ్రజ్యోతి ప్రతుల దహనం కేసులో ఆమెను బుక్ చేసేలా అడుగులు వేస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. ఏప్రిల్ నెలలో ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను దహనం చేసిన కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా తిరుపతి ఈస్ట్ పోలీసులు మాజీ మంత్రి రోజాతోపాటు వైసీపీ కీలక నేతలు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇదే కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోక్షిత్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేయగా, ఆయన తిరస్కరించినట్లు చెబుతున్నారు.
ప్రతిపక్ష వైసీపీకి చెందిన నేతలపై వరుసగా కేసులు నమోదు చేస్తూ అరెస్టు చేయిస్తున్న ప్రభుత్వం తాజాగా మాజీ మంత్రి రోజాపై దృష్టి పెట్టిందా? అన్న చర్చే ఎక్కువ హీట్ పుట్టిస్తోంది. ఈ నెల 30న విచారణకు రావాలని లేని పక్షంలో అరెస్టు చేయాల్సివస్తుందని పోలీసులు ఆ నోటీసులో హెచ్చరించారు. పోలీసుల నోటీసులకు భయపడేది లేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ఉందని వాదిస్తున్న రోజా ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకునేలా కనిపిస్తున్నారు. కానీ, రోజా విషయంలో ప్రభుత్వం సీరియస్ గానే ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వ పెద్దల మెయిన్ టార్గెట్ లో ఒకరైన రోజా ఎప్పుడు దొరుకుతుందా? అని ఎదురుచూస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా దూకుడుగా వ్యవహరించేవారు. ప్రధానంగా అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అసభ్యకర వ్యాఖ్యలపై పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయించింది. ఈ లిస్టులో రోజా కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు హెచ్చరించినా, ప్రభుత్వం మాత్రం మాజీ మంత్రి రోజాపై అసభ్యకర దూషణలపై కేసులు నమోదు చేయలేదని అంటున్నారు.
కానీ, ఆడుదాం ఆంధ్రా స్కాంలో మాజీ మంత్రిని బుక్ చేసేలా కొంతవరకు ప్రయత్నాలు జరిగాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఆటల పోటీల్లో అవకతవకలు జరిగాయనే ఫిర్యాదులపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించింది. సుమారు రూ.40 కోట్ల మేర దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ విజిలెన్స్ గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారంలోనే మాజీ మంత్రి రోజాపై చర్యలు ఉంటాయని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక తొలిసారిగా రోజాను విచారణకు రమ్మంటూ పోలీసులు నోటీసులు జారీ చేయడమే హాట్ టాపిక్ అవుతోంది. ఈ కేసులో విచారణకు పిలిచిన తర్వాత పాత కేసులు ఏమైనా బయటకు తీసే అవకాశాలు ఉన్నాయా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతుల దహనం కేసులో మాజీ మంత్రి రోజాతోపాటు వైసీపీకి చెందిన మరో నలుగురు ముఖ్య నేతల పేర్లు ఉన్నప్పటికీ రోజాకు నోటీసులు జారీ చేయడమే ఎక్కువ టెన్షన్ పుట్టిస్తోందని అంటున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన, ఆయన కుమారుడుతోపాటు చంద్రగిరి వైసీపీ సమన్వయకర్త మోహిత్ రెడ్డిపై ఇప్పటికే పలు కేసుల్లో విచారణ జరిగింది. కానీ మాజీ మంత్రి రోజానే తొలిసారిగా పోలీసు విచారణను ఎదుర్కొంటుండటంతో రాజకీయంగా ఈ పరిణామం ఆసక్తి రేపుతోందని అంటున్నారు.