వైసీపీ ఏం చేసిందో... మ‌నం ఏం చేస్తున్నామో చెప్పండి!: చంద్ర‌బాబు

అంతేకాదు.. ప్ర‌తి ఇంట్లో ఎంత మందికి ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాలు అందుతున్నాయో జాబితాను తీసుకుని మ‌రీ వివ‌రించాలన్నారు.

Update: 2026-07-27 10:15 GMT

త్వ‌ర‌లోనే రానున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో ఆదివారం వ‌ర్చు వ‌ల్ విధానంలో పార్టీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో ఆయ‌న చ‌ర్చించారు. త్వ‌ర‌లో ప్రారంభ‌మ‌య్యే 'ఇంటింటికీ కూట‌మి' పేరుతో నిర్వ‌హించే కార్య‌క్ర‌మానికి సంబంధించి ప‌లు కీల‌క విష‌యాల‌పై ఆయ‌న దిశానిర్దేశం చేశారు. ప్ర‌తి ఇంటికీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు వెళ్లాల‌ని తేల్చి చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వం ఈ రెండు సంవ‌త్స‌రాల కాలంలో ఏం చేసిందో వివ‌రించాల‌ని సూచించారు. అంతేకాదు.. ప్ర‌తి ఇంట్లో ఎంత మందికి ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాలు అందుతున్నాయో జాబితాను తీసుకుని మ‌రీ వివ‌రించాలన్నారు.

స‌మ‌స్య‌ల‌పై..

ప్ర‌తి ఇంటికీ వెళ్లిన స‌మ‌యంలో ప్ర‌జ‌ల నుంచి అనేక స‌మస్య‌లు ఎదురయ్యే అవ‌కాశం ఉంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. అయితే.. ఎక్క‌డా వివాదాలకు, వాగ్వాదాల‌కు అవ‌కాశం లేకుండా ప్ర‌జ‌ల‌కు అన్నీ వివ‌రించాల‌న్నారు. ప్ర‌ధానంగా గ‌త ప్ర‌భుత్వం చేసిన అప్పుల కార‌ణంగా ఆర్థిక ప‌రిస్థితి ఇబ్బందిగా ఉంద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు చేరవేయాల‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని వివ‌రించాల‌న్నారు. అలానే పెట్టుబ‌డులు, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరును కూడా ఇంటింటికీ వెళ్లి వివ‌రించాల‌ని దిశానిర్దేశం చేశారు. ఈ విష‌యంలో స‌హ‌నం, ఓర్పుతో నాయ‌కులు వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

ప్ర‌తి ఇంటికీ 15 నిమిషాలు..

ప్ర‌తి ఇంటికీ 15 నిమిషాల చొప్పున స‌మ‌యం కేటాయించాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ఎమ్మెల్యే లేదా ఎంపీ.. ఇత‌ర నాయ కులు క‌లిసి వెళ్లాల‌ని.. ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమాన్ని పుస్త‌కాలు లేదా క‌ర‌ప‌త్రాల‌తో వివ‌రించాల‌న్నారు. 15 నిమిషాల వ్య‌వధిలో ఆ కుటుంబంలోని ప్ర‌తి ఒక్క‌రినీ ఆప్యాయంగా ప‌ల‌క‌రించాల‌ని కూడా సూచించారు. ఎవ‌రైనా ఇబ్బందులు ప్ర‌స్తావిస్తే.. వాటిని పరిష్క‌రించేందుకు వీలుగా విన‌తి ప‌త్రాలు తీసుకోవాల‌న్నారు. అలాగే, ప్ర‌భుత్వంపై ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేసినా.. దాని వెనుక ఉన్న కార‌ణాలు తెలుసుకుని వివ‌ర‌ణ ఇవ్వాల‌ని.. ఎదురు దాడి చేయ‌డం, మాట‌ల‌తో మ‌భ్య‌పెట్ట‌డం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంవంటివి చేయ‌రాద‌ని పేర్కొన్నారు.

ప్ర‌తి ఒక్క‌రినీ..

ప్ర‌తి ఒక్క నాయ‌కుడు ఎంత మందిని క‌లుస్తున్నారు? ఎన్ని ఇళ్ల‌కు వెళ్తున్నారు? అనే విష‌యాల‌ను ఐటీడీపీ ప్ర‌త్యేకంగా గ‌మ‌నిస్తుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు.. నాయ‌కులు తాము వెళ్లిన ఇళ్లు, క‌లిసి న కుటుంబాల వివ‌రాల‌ను త‌క్ష‌ణ‌మే మై టీడీపీ యాప్‌లో నిక్షిప్తం చేయాల‌ని కూడా చంద్ర‌బాబు సూచించారు. అలానే కూట‌మి పార్టీల‌ను కూడా క‌లుపుకొని వెళ్లాల‌న్నారు. స్థానిక సంస్థ‌ల్లో విజ‌య‌మే ప‌ర‌మావ‌ధిగా ముందుకు సాగాల‌న్న చంద్ర‌బాబు.. ఈ స‌మ‌యంలో వైసీపీ పాల‌న‌కు.. కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌కు పోల్చి వివ‌రించాల‌ని కూడా తెలిపారు. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న‌ట్టు వివ‌రించారు.

Tags:    

Similar News