ప్ర‌త్యేక హోదా కోసం చెన్నైలో నిర‌స‌న‌లు!

Update: 2018-03-04 07:54 GMT
కొద్ది రోజుల క్రితం ప్ర‌వేశ పెట్టిన కేంద్ర బ‌డ్జెట్ లో కూడా ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం రిక్త హ‌స్తాలు చూపించ‌డంతో ఆంధ్ర ప్ర‌జ‌లు తీవ్ర నిరాశ‌కు గురైన సంగ‌తి తెలిసిందే. అన్ని పార్టీల ఎంపీలు ....కేంద్రం వైఖ‌రికి నిర‌స‌గా పార్ల‌మెంటులో ఆందోళ‌న‌లు చేశారు. అదే ఊపుతో ఏపీలోని ప్ర‌జ‌లు కూడా బంద్ పాటించి ప‌లు ఆందోళ‌న‌లు చేశారు. ఇంకా కొన్ని చోట్ల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. మోదీ - చంద్ర‌బాబు స‌ర్కార్ ల‌కు మ‌రో ఏడాది మాత్ర‌మే గడువుండ‌డంతో ప్ర‌జ‌లంతా ప్ర‌త్యేక హోదా కోసం క‌దం తొక్కుతున్నారు. తాజాగా, ఏపీకి త‌క్ష‌ణ‌మే ప్రత్యేక హోదాను ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ తమిళనాడులో కూడా తెలుగువారు నిరసనలు చేప‌ట్టారు.

చెన్నైలోని తెలుగుఫోరం ఆధ్వర్యంలో....ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం పలువురు తెలుగువారు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. చెపాక్ లోని స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద జరిగిన ఆందోళన‌ కార్యక్రమంలో చెన్నైలోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు - ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా....ఆంధ్రుల హ‌క్కు అంటూ వారంతా నినాదాలు చేశారు. ప్ర‌త్యేక ప్యాకేజీ వ‌ల్ల ఏపీకి ఒరిగేదేమీ ఉండ‌ద‌ని, ఏపీలో యువతకు ఉద్యోగావకాశాలు రావాలంటే కేంద్రం.... ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. సొంత‌రాష్ట్రంలో ఉపాధి లేక‌ వివిధ న‌గ‌రాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారంద‌రూ....ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే ఆంధ్ర‌కు వ‌చ్చి సెటిల్ అవుతారని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలా ఏపీకి తిరిగి వ‌చ్చిన వారంద‌రూ ఏపీ అభివృద్ధికి శ్ర‌మిస్తార‌ని, డెవ‌ల‌ప్ మెంట్ మరింత వేగవంతం అవుతుందని వారు అన్నారు. కేంద్రం మొండి వైఖ‌రిని విడ‌నాడి విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను నెర‌వేర్చ‌కుంటే త‌మ ఆందోళ‌న‌ల‌ను మ‌రింత ఉధృతం చేస్తామ‌ని వారు హెచ్చరించారు.
Tags:    

Similar News