కొత్త స్కెచ్ సిద్ధం చేస్తున్న చంద్రబాబు కోటరీ!

Update: 2018-05-15 03:48 GMT
భారతీయ జనతా పార్టీ కి రాష్ట్రంలో అసలు దిక్కే లేకుండా చేయాలన్నది చంద్రబాబునాయుడు కోరిక. ఈ కోరికను ఈ పదాల్లో ఎన్నడూ బయటపెట్టకపోయినప్పటికీ.. బడ్జెట్ సమావేశాల తర్వాతినుంచి ఆయన చేస్తున్న ప్రతి చర్య అందుకు అనుగుణంగానే ఉంటున్నాయని అనుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు పట్ల నిర్దయగా వ్యవహరించగల నాయకుడిని రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా నియమించడంతో చంద్రబాబు కోటరీ కొత్త ఎత్తుగడలకు పాల్పడుతోంది.

కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా ఉండగా... ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు? ఎక్కడెక్కడ దందాలు సాగించారు? ఆయన మీద అప్పట్లో ఎలాంటి విమర్శలు వచ్చాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుగుదేశం వర్గాలు కెలుకుతున్నట్లుగా తెలుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ గతంలో నేదురుమిల్లి జనార్దనరెడ్డి - కోట్ల విజయభాస్కరరెడ్డి ల హయాంలోనే మంత్రిగా చేశారు. వైఎస్సార్ సీఎం అయిన తర్వాత.. పదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా ఆయన పదవికి ఢోకా రాలేదు. ఇలాంటి నేపథ్యంలో తొలిసారి మంత్రి అయిన నాటినుంచి ఇప్పటిదాకా ఆయన మంత్రిగా చేసిన సమయంలో జరిగిన తప్పులను ఆరా తీయడానికి తెదేపా వర్గాలు రీసెర్చి సాగిస్తున్నట్లు సమాచారం. అలాగే స్థానికంగా కూడా గుంటూరు జిల్లాలో కన్నామీద ఎలాంటి ఆరోపణలున్నో వాటిని కూడా ఆరా తీస్తున్నారు.

ఏతావతా... కన్నా లక్ష్మీనారాయణను అవినీతిపరుడిగా ముద్ర వేయడం ద్వారా... ఇలాంటి అవినీతి పరుల్ని ప్రోత్సహిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఏం సంకేతం ఇవ్వదలచుకుంది? ఎలాంటి పాలన అందివ్వదలచుకుంది? ఇధి సిద్ధాంతాల భాజపా కాదు, మోడీ-షా ద్వయం ఎడ్మినిస్ట్రేషన్ లో పూర్తిగా రూపు మారిపోయిన కొత్త బీజేపీ.. అనే తరహా నినాదాలతో రాష్ట్రంలో ఆ పార్టీని మరింతగా దెబ్బతీయడం లక్ష్యంగా తెలుగుదేశం పావులు కదుపుతోంది.

ఇన్నాళ్లూ రాష్ట్రానికి చేసిన ద్రోహం గురించి మోడీ దళంపై నిందలు వేయడానికి ప్రయత్నించారు. కన్నా నియామకం జరిగిన వెంటనే.. ఆయన భాజపాకు అధ్యక్షుడు అయినప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ సెటైర్లు వేశారు. దానికంటె బలంగా ఉండడానికి కన్నా హయాంలో అవినీతి వివరాలు రాబడితే.. కమదళం పరువు మరింతగా తీయవచ్చునని వారు ఉబలాటపడుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News