బాబుకు ఫ్యామిలీ కంటే పార్టీ మెంబర్సే ఎక్కువ

Update: 2015-10-04 09:49 GMT
జాతీయ పార్టీగా అవతరించిన తెలుగుదేశం పార్టీ.. తన నూతన కమిటీలతో ఏపీ ముఖ్యమంత్రి.. పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా పార్టీ సభ్యులే తనకు ఎక్కువని చెప్పుకున్న ఆయన పార్టీకి సంబంధించిన తన స్వప్నాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని చెప్పిన ఆయన.. తెలుగుదేశం పార్టీ ఎన్నో వినూత్న విధానాలకు తెర తీసిందని చెప్పుకొచ్చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని చెప్పిన చంద్రబాబు.. రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయని.. వాటిని అధిగమిస్తూ తాము ముందుకువెళుతున్నట్లు చెప్పారు.

రానున్న రెండేళ్లలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్న అభిలాషను వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఏపీలో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని.. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేవించారు. తెలుగు జాతికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేశారని చెప్పిన చంద్రబాబు.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచే వ్యక్తిగా  ఆయన్ను అభివర్ణించారు.

తెలుగువారి భవిష్యత్తు కోసమే ఎన్నికల ముందే ఎన్డీచేతో తాము పొత్తు పెట్టుకున్నామని చెప్పిన చంద్రబాబు.. తెలంగాణలో పార్టీ తిరుగులేని శక్తిగా మారాలన్న అభిలాషను వ్యక్తం చేశారు.  పార్టీ సభ్యత్వ నమోదు ద్వారా రూ.55కోట్లు సమకూర్చుకున్నామని.. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘనతను సాధించిన పార్టీ తమదొక్కటేనని చెప్పారు.

ఇతర పార్టీలు తమను అనుసరించాలని ప్రయత్నించి విఫలమయ్యాయని చెప్పిన ఆయన.. కార్యకర్తల త్యాగాల వల్లే నేతలకు పదవులు దక్కాయని.. ఏదైనా తేడాలు వస్తే పదవులకు వారు దూరం అవుతారని హెచ్చరించారు. మొత్తానికి కాస్తంత ఆశను.. మరికొంచెం వార్నింగులు ఇచ్చిన చంద్రబాబు కలలు ఎంతవరకు సాకారం అవుతాయో చూడాలి.
Tags:    

Similar News