మరెలా: హోదాకోసం చంద్రబాబును అడగకూడదంట

Update: 2018-02-22 12:49 GMT
రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాలేదని నన్ను అంటారేమిటి? ఇందుకు బాధ్యత మొత్తం నాదే అయినట్టు కొందరు నన్ను తిడుతున్నారెందుకు? వెళ్లి కేంద్రాన్ని అడగండి..? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు డిఫెన్సివ్ తరహాలో మాట్లాడుతున్నారు. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. కేవలం రెండుమూడురోజుల కిందనుంచి మాత్రమే కొత్త పాట ప్రారంభించిన సంగతి అందరికీ తెలుసు. అయతే.. ‘‘కొందరు నన్ను మాత్రమే తిడుతున్నారు. ప్రత్యేకహోదా కేంద్రాన్ని అడగట్లేదని అంటున్నారు. రాత్రింబవళ్లూ నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు’’ అని ముఖ్యమంత్రి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

ఒక పత్రిక చేస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. ఆ పత్రికను ఎవ్వరూ నమ్మరని కూడా అన్నారు. ఆయన పేర్లు చెప్పకుండా మాట్లాడినప్పటికీ.. జగన్ - సాక్షి మీదనే అక్కసు వెళ్లగక్కారని అందరికీ తెలుసు. రాజకీయ విమర్శలను కూడా తిట్లుగా ఆయన నిర్వచించేట్లయితే.. అవును కొందరు చంద్రబాబునాయుడును తిడుతున్న మాట వాస్తవమే కావొచ్చు.

అయితే ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని గుర్తించాలి. ఆయన మీద వస్తున్న విమర్శలు ప్రత్యేకహోదా అడగడం లేదని కాదు. ప్రజల్లో సజీవంగా ఉన్న హోదా ఆకాంక్షను సమూలంగా చంపేసినందుకు! అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం ఇవ్వవద్దని అన్నదంటూ తనకు అబద్ధం చెప్పిందని.. చంద్రబాబునాయుడు ఇవాళ కీలకం బయటకు చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘం మీద కేంద్రం నెపం చెబితే.. చంద్రబాబు అనుభవం మొత్తం ఏమైపోయింది. రాజకీయాల్లో ఓనమాలు దిద్దని పసిపిల్లవాడి లాగా వారు చెప్పిన మాటలను ఆయన ఎలా నమ్మారు? జీఎస్టీ తర్వాత హోదా ఉండదు.. అంటూ వారేదో కల్లబొల్లి కబుర్లు చెబితే.. దేశంలో కెల్లా అత్యంత సీనియర్ రాజకీయ వేత్త వారి మాయలో ఎలా పడ్డారు?

చిన్న ఫోన్  కాల్ తో న్యాయనిపుణులను ఆర్థికవేత్తలను - రాజ్యాంగ నిపుణులను ఎవ్వరిని విచారించి ఉన్నా.. వాస్తవాలు ఆయనకు ఆరోజే తెలిసేవి. కేంద్రం అబద్ధాలు చెబుతున్నదే తప్ప.. హోదా ఉంటుంది అనే నిజం తెలిసేది. ఆ ప్రయత్నం చేయకపోవడం నేతగా ఆయన వైఫల్యం. ఆ వైఫల్యానికి ఆయన నిందలు భరించాలా వద్దా? ఎలాంటి క్రాస్ చెక్ చేసుకోకుండా.. కేంద్రం ఏం చెబితే అది నమ్మేసి ఆయన ప్యాకేజీకి ఒప్పుకున్నారట.

చిన్న రోగం వస్తేనే మనం డాక్టరు సలహా తర్వాత సెకండ్ ఒపీనియన్ కోసం మరో డాక్టరు వద్దకెళ్తాం. అలాంటిది అయిదుకోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు విషయంలో కేంద్రం అబద్ధం చెప్పిందని.. సెకండ్ ఒపినియన్ తెలుసుకోకుండా నిర్లక్ష్యం వహించిన  ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పడం అనేది బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట. అందుకు విమర్శించడం కూడా తప్పేనా? హొదాను మంటగలిపింది ఆయనే అయితే ప్రజలు ఆయన్ని అడగకుండా మరెవర్ని అడగాలి.?

పైపెచ్చు కేంద్రంతో కుమ్మక్కు అయి హోదాను మంటగలిపేసిన తర్వాత.. అది జిందాతిలిస్మాత్ కాదని - హోదాకోసం గళమెత్తుతున్న వైసీపీ వారిని చాలా నీచంగా చులకనగా మాట్లాడింది చంద్రబాబునాయుడు కాదా? అందుకే నన్ను తిడుతున్నారు.. అంటూ ప్రజల ఎదుట నిల్చుని విలపించడం మానేసి.. ఇప్పటికైనా ప్రత్యేకహోదా కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News