చంద్రబాబు వ్యూహం ఇలా ఉండి ఉంటే..?

Update: 2015-06-10 09:00 GMT
ఆపరేషన్‌ రేవంత్‌రెడ్డి పేరిట స్టింగ్‌ ఆపరేషన్‌ చేసి తెలుగుదేశం పార్టీని హోల్‌సేల్‌గా ఇబ్బందుల్లోకి నెట్టిన తీరు.. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వేసిన ఎత్తులు చాలామందిని ఆకర్షిస్తున్నాయి. కేసీఆర్‌ తెలివితేటల్ని మెచ్చుకోని వారు లేరు. తన రాజకీయ ప్రత్యర్థిని దెబ్బ తీసేందుకు ఆయన అనుసరించిన విధానం మంచిదా? కాదా? అన్న విషయంపై విభేదాలు ఉండొచ్చు కానీ.. బుక్‌ చేసిన తీరు మాత్రం ఔరా అనిపించక మానదు. రింగులో ఉన్న ప్రత్యర్థి పట్ల ఎలాంటి కనికరం లేకుండా.. అతను ఏమైపోతాడన్న ధ్యాస లేకుండా విజయమే లక్ష్యంగా.. ప్రత్యర్థి మీద పైచేయి సాధించటం ఒక్క అంశం మీద ఎలా అయితే దృష్టి సారిస్తారో సరిగ్గా అలా వ్యవహరించిన కేసీఆర్‌ను చాలామంది పొగిడేస్తున్నారు.

రాజకీయాల్లో ప్రత్యర్థుల పట్ల ప్రేమాభిమానాలు.. సెంటిమెంట్లు ఏమీ ఉండవన్న విషయం తెలిసిందే అయినప్పటికీ.. ఇంత నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించే ధోరణి తెలుగు రాజకీయాల్లో పెద్దగా కనిపించదని చెబుతారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో చాలావరకూ చంద్రబాబు మీదనే విమర్శలు వెల్లువెత్తటం గమనార్హం. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని ఒకరి తర్వాత ఒకరితో తీసుకెళ్లిపోవటం.. ఇంకా చెప్పాలంటే.. మహానాడులో హడావుడి చేసి పార్టీకి రూ.2లక్షల విరాళం ఇచ్చిన మాధవరం కృష్ణారావు మహానాడు ముగిసిన వెంటనే.. కేసీఆర్‌ చెంతకు చేరి గులాబీ కండువా కప్పించుకుంటే.. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఎంత కాలాలి?

సోమవారం నాటి బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. తన రాష్ట్రంలోకి వచ్చిన తన ఎమ్మెల్యేల్ని ప్రలోభ పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అని సూటిగా ప్రశ్నించారు. చాలామందికి ఆ మాటలు విపరీతంగా ఆకర్షించాయి. కేసీఆర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో బాబుకు తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానించే వారున్నారు. మరి.. ఇన్ని మాటలు చెప్పిన కేసీఆర్‌.. మరి ఎలాంటి ప్రలోభాలు పెట్టకుండానే తెలంగాణలోని విపక్షాలకు చెందిన అంతమంది ఎమ్మెల్యేల్ని ఎందుకు తన పార్టీలో చేర్చుకున్నట్లు?

కేసీఆర్‌ ఎలా అయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రో.. చంద్రబాబు కూడా అంతేకదా. ఆయనకు ఎంత కాలి ఉంటుందో.. బాబుకు కూడా అంతే కాలి ఉంటుంది కదా. కాకపోతే.. ఇక్కడ జరిగిన పొరపాటు ఏమిటంటే.. తనకు ఎక్కడో కాలి.. అందుకు తగిన బుద్ధి చెప్పాలనే తొందరపాటు బాబుకు ఇప్పుడిన్ని సమస్యలు తెచ్చి పెట్టాయని చెప్పక తప్పదు.

వాస్తవానికి తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రతీకార రాజకీయాల కంటే కూడా మరోలా బుద్ధి చెప్పాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనకు ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో.. బాబు దృష్టి మొత్తం ఏపీ మీదనే పెట్టి.. సందర్భం.. అవకాశం కుదిరిన సమయంలోనే తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే బాగుండేదన్న భావన వ్యక్తమవుతోంది.

ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు ఉన్న సమయంలో ఇప్పటికిప్పుడు ఏం చేసినా దాని వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. లేనిపోని గోల తప్పించి మరెలాంటి లాభం లేని నేపథ్యంలో తన శక్తియుక్తులన్నీ ఏపీ మీద పెట్టి.. అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేయటం.. ఏపీ రాజధాని నిర్మాణాంపై పూర్తిగా దృష్టి సారించి ఉంటే బాగుండేదన్న భావన వ్యక్తమవుతోంది.

కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బ తీయటానికి ఏపీలో అవకాశాలు చాలా ఉన్నాయన్న విషయాన్ని బాబు మర్చిపోవటం.. ఆయన వ్యూహకర్తలు గుర్తించకపోవటం ఒక పెద్ద తప్పిదంగా చెప్పొచ్చు.

విభజన నేపథ్యంలో ఏపీలోని దారుణ పరిస్థితి తెలంగాణలోనే కాదు.. దేశంలోని ప్రతిఒక్కరికి తెలుసు. ఇలాంటి సమయంలో తన అనుభవాన్ని.. తన ప్లానింగ్‌ను మాటల్లో కంటే చేతల్లో ఎక్కువగా చూపిస్తూ.. తన దృష్టి మొత్తం ఏపీ మీదనే పెట్టి.. తనకు అధికారాన్ని ఇచ్చిన సీమాంధ్రుల ఛాయిస్‌ ఎంత కరెక్ట్‌ అయినదో చెప్పేలా పాలన మీద.. అభవృద్ధి మీద దృష్టి సారించి ఉంటే బాగుండేది.

పక్కపక్కనే ఉండే రాష్ట్రాలు.. ప్రజలు నిత్యం తమను.. తమ పక్కనున్న వారిని పోల్చి చూసుకోవటం మామూలే. తనకొచ్చిన అధికారంతో ఏపీ అభివృద్ధిని వాయువేగంతో దూసుకెళ్లేలా చేస్తే.. తెలంగాణ ప్రజల్ని అది తప్పనిసరిగా ఆకర్షిస్తుంది. ఏపీలో చేయాల్సింది ఎంతోకొంత చేసిన తర్వాత.. దాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. తమ పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధి ఎలా చేసి చూపిస్తామన్నది ప్రాక్టికల్‌గా చూపించే అద్భుత అవకాశాన్ని చంద్రబాబు వదులుకొని.. దెబ్బ తీసే రాజకీయాల్ని ఎంచుకోవటం పెద్ద తప్పుగా విశ్లేషిస్తున్నారు.

ఏపీ ప్రజలతో పోలిస్తే.. తెలంగాణ ప్రజానీకం చైతన్యవంతమైనదని చెప్పటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తమను పట్టించుకోని సర్కారు పట్ల తమకున్న వ్యతిరేకతను ఎన్నికల సమయంలో గుట్టుగా ఓట్లు వేసి తాము చేయాల్సింది చేసే తత్వం ఏపీ ప్రజలది అయితే.. తమ ఆశల్ని పట్టించుకోని పాలకుల పట్ల నిలదీసే ధోరణితో పాటు.. తమ అసంతృప్తిని నిత్యం వ్యక్తం చేసే ధోరణి తెలంగాణ ప్రజానీకానిది. ఇలాంటి సందర్భంలో అభివృద్ధికి నమూనాగా బాబు నిలిచి ఉంటే.. మిగిలినవి మర్చిపోయి.. బాబుకు అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చేవారు. ఒకవేళ సెంటిమెంట్‌ సహకరించకపోయినా.. 2019 ఎన్నికల్లో బాబు తన సత్తా చాటేవారు.

కానీ.. అలాంటి ఆలోచనల కన్నా.. నిద్ర లేచిన ప్రతిరోజూ 2019లో తెలంగాణలో తమదే అధికారం అని చెప్పటం ద్వారా.. పవర్‌ మీద యావ తప్పించి.. ప్రజల సంక్షేమం మీద బాబు దృష్టి లేదా? అన్న విమర్శలు చేయించుకునే అవకాశాన్ని బాబు ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాజకీయ కక్ష సాధింపు కన్నా.. ప్రత్యర్థిని కోలుకోలేకుండా దెబ్బ తీసేందుకు అభివృద్ధిని మార్గంగా ఎందుకు ఎంచుకోకూడదు? ఇప్పటికైనా బాబు ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందేమో.

Tags:    

Similar News