ప్యాసింజర్ పై పైలట్ దాడి.. ఢిల్లీలో ఏమి జరిగింది..!
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయ టెర్మినల్ 1 వద్ద జరిగిన వివాదంలో ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ పైలట్ తనపై శారీరకంగా దాడి చేశాడని స్పైస్ జెట్ విమాన ప్రయాణికుడు ఆరోపించారు;
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయ టెర్మినల్ 1 వద్ద జరిగిన వివాదంలో ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ పైలట్ తనపై శారీరకంగా దాడి చేశాడని స్పైస్ జెట్ విమాన ప్రయాణికుడు ఆరోపించారు. దీనిపై పోస్ట్ పెడుతూ, రక్తంతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఆరోపణలను ఎయిరిండియా అంగీకరించింది. ఈ సందర్భంగా ఆ పైలట్ ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొంది.
అవును... ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ కు చెందిన పైలట్ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని స్పైస్ జెట్ విమాన ప్రయాణికుడు అంకిత్ దివాన్ ఆరోపించారు. ఈ ఘటన ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ ఘటనలో అంకిత్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అతడి ముఖం నుంచి రక్తం కారుతుంది. అతనిపై దాడి చేసిన పైలట్ కు కూడా అంకిత్ రక్తపు మరకలు అంటుకున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
వివరాళ్లోకి వెళ్తే.. అంకిత్ దివాన్ అనే ప్రయాణికుడు నాలుగు నెలల తన కుమార్తెతో పాటు కుటుంబంతో కలిసి స్పైస్ జెట్ విమానంలో ప్రయాణించేందుకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో.. సిబ్బంది ఉపయోగించే సెక్యూరిటీ చెన్ ఇన్ లైన్ లో వెళ్లాలని అక్కడున్న సిబ్బంది సూచించడంతో.. అతను కుటుంబ సభ్యులతో కలిసి క్యూలో నిల్చున్నారు.
ఈ సమయంలో ఆ క్యూలో చాలా మంది మధ్యలో దూరిపోవడం మొదలుపెట్టారు. వారిని అంకిత్ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ పైలట్ వీరేందర్ కూడా ఇలాగే క్యూలైన్ మధ్యలోకి దూరాడు! దీంతో.. అంకిత్ అతడినీ ప్రశ్నించాడు. ఈ క్రమంలో అంకిత్ పై పైలెట్ దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది.
ఈ సమయంలో సంయమనం కోల్పోయిన పైలట్ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని అంకిత్ ఓ పోస్టులో తెలిపారు. ఆ పోస్టుకు తన ముఖంపై రక్తపు మరకలతో ఉన్న ఫోటోను జత చేశారు. ఈ సందర్భంగా పైలట్ షర్ట్ పై ఉన్న రక్తపు మరకలు కూడా తనవేనని వెల్లడించాడు. ఈ ఘటనతో తన ఏడేళ్ల కూతురు ఒక్కసారిగా భయపడిపోయిందని తెలిపారు. ఈ పోస్టుకు ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేశారు.
స్పందించిన ఎయిరిండియా!:
ఢిల్లీ విమానాశ్రయంలో తమ ఉద్యోగి ఒకరు పాల్గొన్న సంఘటనను ఎయిరిండియా తీవ్రంగా ఖండించింది. ఇదే సమయంలో అంకిత్ అనే ప్రయాణికుడు చేసిన ఆరోపణలను అంగీకరించింది. సదరు పైలట్ ను తక్షణమే విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు అనంతరం అతడిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. న్యాయమైన, సమగ్రమైన ప్రక్రియను నిర్ధారించడానికి.. చట్ట అమలు అధికారులకు తగిన సహకారాన్ని అందించడానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని పేర్కొంది.