‘ఆళ్లు రెండూ కానోళ్లా?’.. కేటీఆర్ సవాల్..కాంగ్రెస్ పార్టీలో కల్లోలం..
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ మార్పులు కొత్తవి కావు. కానీ ఇటీవలి పంచాయతీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం ఈ అంశాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చాయి.;
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ మార్పులు కొత్తవి కావు. కానీ ఇటీవలి పంచాయతీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం ఈ అంశాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. అధికార పార్టీ కాంగ్రెస్ విజయాన్ని తన భవిష్యత్తు రాజకీయ ఆధిపత్యానికి సంకేతంగా చిత్రీకరిస్తుంటే.., ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఆ విజయంలోని వాస్తవాలపై ప్రశ్నలు సంధిస్తోంది. ఈ నేపథ్యమే తాజాగా తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
చర్చకు దారి తీసిన సీఎం వ్యాఖ్యలు..
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని, ప్రజలు తమ వెంటే ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ విజయం 2029 వరకూ కొనసాగుతుందని ఆయన ధీమాగా చెప్పడం.., అధికార పక్షంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించినా.. అదే సమయంలో ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టింది. ఈ వ్యాఖ్యలను కోట్ చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. ‘దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించండి. ఉప ఎన్నికలకు వెళ్దాం’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నించారు.
ప్రతి సవాల్ విసిరిన కేటీఆర్
ఈ సవాల్‌లోని రాజకీయ పదునే ఇప్పుడు అసలు చర్చకు కేంద్రబిందువుగా మారింది. ఎందుకంటే, పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలపై ఎప్పటి నుంచో ఉన్న సందేహాలను మళ్లీ బయటకు తీసుకొచ్చింది. ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రతినిధులు, మధ్యలో పార్టీ మారితే.. వారి అసలు ప్రతినిధిత్వం ఎవరిది? ఓటర్లదా? లేక అధికార, పదవుల లెక్కలదా? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి.
సిరిసిల్ల పర్యటనలో మాట్లాడిన కేటీఆర్, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రపంచం మొత్తం కోడై కూస్తుంటే, స్పీకర్‌కు తెలియదా?’ అంటూ శాసనసభ స్పీకర్ వైఖరిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ పరిణామాలను గమనించకపోవడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. కొందరు ఎమ్మెల్యేలు స్వయంగా ‘పార్టీ మారాం’ అని చెబుతున్నా.. వాటిపై చర్యలు ఎందుకు లేవన్నది బీఆర్‌ఎస్ ప్రధాన ఆరోపణ.
రాజకీయ నైతికతపై చర్చ..
ఇక్కడే రాజకీయ నైతికతపై అసలు చర్చ మొదలవుతుంది. ప్రజలు ఇచ్చిన ఓటు ఒక పార్టీకి, ఒక సిద్ధాంతానికి. కానీ ఆ ఓటుతో గెలిచిన వ్యక్తి మరో పార్టీకి మారితే, ఆ ఓటు విలువ ఏమవుతుంది? ఇదే అంశాన్ని కేటీఆర్ తన పదునైన వ్యాఖ్యలతో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ‘ఆళ్లు రెండూ కానోళ్లా?’ అన్న వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదమైనా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఉన్న ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.
కాంగ్రెస్‌కు ఇది ఆందోళనకర పరిస్థితి. ఒకవైపు అధికారంలో ఉన్న పార్టీగా ప్రజల మద్దతు ఉందని చెప్పుకుంటూనే, మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాజీనామాలు కోరే సవాల్‌ను ఎదుర్కోవాల్సి వస్తోంది. నిజంగా ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారనుకుంటే, ఉప ఎన్నికలకు వెళ్లడంలో ఇబ్బంది ఏమిటన్న ప్రశ్న ప్రతిపక్షం లేవనెత్తుతోంది. అదే సమయంలో, అధికార పార్టీ మాత్రం పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రజాభిప్రాయానికి తుది ముద్రగా చూపించే ప్రయత్నం చేస్తోంది.
సీఎం సవాల్ స్వీకరిస్తారా?
ఈ రాజకీయ యుద్ధం చివరికి తీసుకెళ్లేది ఎక్కడికి..? ఉప ఎన్నికల సవాల్‌ను కాంగ్రెస్ స్వీకరిస్తుందా..? లేక సంఖ్యాబలమే రాజకీయ న్యాయమని నిరూపించుకునే దిశగా సాగుతుందా..? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఒక విషయం మాత్రం స్పష్టం.. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం తెలంగాణ రాజకీయాల్లో దీర్ఘకాల ప్రభావం చూపనుంది.
ప్రజాస్వామ్యంలో సంఖ్యలు ముఖ్యం. కానీ నైతికత మరింత ముఖ్యం. ఓటు విలువను కాపాడే రాజకీయ సంస్కృతి లేకపోతే, ప్రజల విశ్వాసమే నశిస్తుంది. “పార్టీ మారినోళ్లు రెండూ కానోళ్లా?” అన్న ప్రశ్న వెనుక ఉన్న ఆవేదన, అసలు రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిబింబం. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక రాజకీయ పార్టీలదే.