పాకిస్తాన్‌ తో యుద్ధం వస్తే ఎన్నికలు వాయిదా పడతాయా?

Update: 2019-02-19 04:15 GMT
కశ్మీర్‌ లోని పుల్వామాలో పెద్దసంఖ్యలో సైనికుల ప్రాణాలను టెర్రరిస్టులు పాశవికంగా కారుబాంబుతో తీసిన తరువాత దేశ ప్రజలు సీమాంతర ఉగ్రవాదం పైనా - వారికి సాయం చేస్తున్న పాకిస్తాన్‌ పైనా రగిలిపోతున్నారు. యుద్ధం చేసి పాకిస్తాన్‌ పీచమణచాల్సిందేనంటూ డిమాండ్లు అంతటా వినిపిస్తున్నాయి. దేశ రక్షణకే సవాల్ విసిరిన ఉగ్రవాదుల దాడి అనంతరం మోదీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించగా ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వానికి మద్దతిచ్చాయి. దేశ ప్రయోజనాల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా తాము సహకరిస్తామని చెప్పారు. అయితే.. ఎన్నికల వేళ యుద్ధ సన్నాహాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయన్న ఊహాగానాలు మొదలవుతున్నాయి.
   
ఇప్పటికిప్పుడు మోదీ యుద్ధానికి వెళ్తే పాక్‌ పై విజయం సాధించడంతో పాటు ఆ విజయం ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని విజయం సాధించడం ఖాయమన్న వాదన వినిపిస్తుంది. అయితే.. దేశం ఆర్థికంగా ముందడుగు వేస్తున్న సమయంలో యుద్ధానికి వెళ్తే దేశం వెనక్కు వెళ్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
   
మరోవైపు యుద్ధం వల్ల ఎన్నికలు వాయిదా పడతాయా అన్న చర్చా సాగుతోంది. నిజానికి యుద్ధం వస్తే ఎన్నికలు వాయిదాలు వేయాల్సిన అవసరం లేకపోవచ్చు. యుద్ధం తీవ్రత బట్టి కూడా అది ఆధారపడుతుంది. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగుతుందని అనుకున్నప్పుడు దేశంలో రాజకీయ శూన్యత - అస్థిరత - అధికార మార్పిడి వల్ల నిర్ణయాల్లో ఆలస్యం కానీ - గందరగోళం లేకుండా ఉండడానికి ప్రత్యేక అధికారాలతో ప్రస్తుత ప్రభుత్వాన్నే మరికొంత కాలం కొనసాగించే అవకాశం ఉంటుంది. కానీ... ఒకవేళ పరిస్థితులు యుద్ధం వరకు వెళ్లినా కూడా ఒకట్రెండు వారాల్లోనే ముగిస్తే ఎన్నికలు వాయిదా పడవని నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News