మూడు రాజధానులపై బుగ్గన పిల్లి మొగ్గలు.. ఆయన ఏం చెప్పారంటే?

Update: 2023-02-15 09:27 GMT
ఒకటేంది.. ఏకంగా మూడు. ఏపీలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయటం ద్వారా.. ప్రాంతాల మధ్య సమన్యాయం.. అందరికి మేలు కలిగించటంతోపాటు.. అందరికి ఒకటి.. రెండు రాష్ట్రాలు ఉంటే.. ఏపీ ప్రజలకు మూడు రాజధానులు ఉంటాయంటూ నిన్నటి వరకు గొప్పగా చెప్పుకున్న వైసీపీ నేతల తీరుకు భిన్నంగా.. ఆ మాటకు వస్తే నాలుక మడతేసినట్లుగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

"అసలు మూడు రాజధానులు" అనేదే తప్పుగా వెళ్లిన సందేశం.. సమాచార లోపం.. అంటూ కొత్త పల్లవిని ఎత్తుకున్నారు బుగ్గన. గార్డెన్ సిటీ బెంగళూరులో జరిగిన బెంగళూరు ఇండస్ట్రీమీట్ లో పాల్గొన్న బుగ్గన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్.. పలువురు అధికారులు హాజరయ్యారు. పారిశ్రామికవేత్తలతోప్రత్యేకంగా సమావేశమైన సందర్బంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి వివరించటమే కాదు.. అక్కడి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచచారు.

ఈ సమావేశానికి హాజరైన ఒక ప్రతినిధి మాట్లాడుతూ.. మూడు రాజధానులపై ఒక ప్రశ్నను సంధించారు.  "మీరు మూడు రాజధానులు అంటున్నారు. మాకు తిరుపతి చాలా దగ్గర. విశాఖపట్నం చాలా దూరం. తిరుపతిని గ్రోత్ ఏరియాగా ఎందుకు డెవలప్ చేయకూడదు. అలానే.. విజయవాడ ఉంది కదా?" అన్న ప్రశ్నకు బుగ్గన రియాక్టు అయ్యారు. అందరి అంచనాలకు భిన్నంగా ఆయన నోటి నుంచి మాటలు హాట్ టాపిక్ గా మారాయి.

మూడు రాజధానులనేది ఒక మిస్ కమ్యూనికేషన్ అని.. పరిపాలన విశాఖపట్నం నుంచే జరుగుతుందని.. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను చూస్తే.. రాజధానిగా అదే ఉత్తమంగా అభివర్ణించారు. అందరికి డెవలప్ మెంట్ కు అవకాశం ఉంటుందని.. ఓడరేవు ఉంటుందని.. కాస్మోపాలిటన్కల్చర్.. వాతావరణం అన్ని అనుకూలంగా ఉంటాయన్నారు. కర్నూలు రెండో రాజధాని కాదని.. అక్కడ హైకోర్టు ఉంటుందన్న ఆయన.. కర్ణాటకలో మాదిరి ధార్వాడ.. గుల్బర్గాలో హైకోర్టు ధర్మాసనాలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

అదే రీతిలో కర్నూలులో హైకోర్టు పిన్సిపల్ బెంచ్ ఉండాలని తమ ప్రభుత్వం భావించిందని.. హైకోర్టు ఒకచోట.. రాజధాని మరో చోట ఉండాలని 1937 నాటి శ్రీభాగ్ ఒప్పందం చెబుతుందన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ సెషన్ ను ఒకసారి  బెళగాంలో నిర్వహిస్తారని.. అదే రీతిలో ఒక సెషన్ ను గుంటూరులో నిర్వహించాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. ఇక..తిరుపతి ప్రపంచానికే అథ్యాత్మిక రాజధానిగా అభివర్ణించారు. ఇంతకాలం ముచ్చటగా మూడు రాజధానులు అన్న వైసీపీ సర్కారు ప్రచారానికి భిన్నంగా బుగ్గన వారి నాలుక మడత పడటమే కాదు.. విశాఖే రాజధానిగా పేర్కొన్న వైనం షాకింగ్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News