5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే ఎదురు డబ్బులిస్తారట

Update: 2019-11-08 09:17 GMT
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఫోన్ చేసి మాట్లాడితే.. మాట్లాడిన కాల్ కు డబ్బులు తీసుకోకపోగా.. ఎదురు డబ్బులిచ్చే చిత్రమైన ఆఫర్. ఇదేదో మాయ చేసేదనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఈ ఆఫర్ ప్రకటించింది వాళ్లు వీళ్లు కాదు.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్. అవును.. తాజాగా ప్రకటించిన పథకం వింటే అవాక్కు కావటమే కాదు.. ఇలాంటి నిర్ణయం కొన్నేళ్ల ముందే తీసుకెళితే.. ఈ రోజున సదరు సంస్థ పరిస్థితి మరెంత బాగుండేదన్న భావన కలగటం ఖాయం.

ఇంతకీ బీఎస్ఎన్ఎల్ తాజా ఆఫర్ చూస్తే.. ల్యాండ్ లైన్ ఫోన్ ఉన్న వారు ఎవరికి ఆవుట్ గోయింగ్ కాల్ చేసి.. ఐదు నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడితే.. సదరు కాల్ కు ఆరు పైసలు ఎదురు ఇస్తామని చెబుతున్నారు బీఎస్ఎన్ఎల్ ఎండీ (ఢిల్లీ) వివేక్ బాంజల్. అలా ఐదు నిమిషాల కాల్స్ ఏన్ని చేసినా.. తాము డబ్బులు చెల్లిస్తామని ఆయన చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. బీఎస్ఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ వినియోగదారులకు నెల రోజుల పాటు ఉచితంగా బ్రాడ్ బ్యాండ్.. వైఫై సేవల్ని అందిస్తామని చెబుతున్నారు. ఈ ప్లాన్ లో నెల రోజుల పాటు 10 ఎంబీపీఎస్ స్పీడ్ తో రోజుకు 5 జీబీ డేటా వరకూ ఉచితంగా ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చని ఆఫర్ ఇస్తున్నారు. అయితే.. ఇలాంటి ఆపర్లకు కాలం చెల్లి చాలా కాలమే అయ్యింది. ఎప్పుడైతే జియో రంగప్రవేశం చేసిందో అప్పడు టెలికం రంగంలో సంచలనంగా మారటమే కాదు.. తిరుగులేని ఆఫర్లను ఇస్తోంది.అంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా ఊరించే ఆపర్లతో ఉపయోగం ఏమైనా ఉందా? అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News