బీజేపీ వ్యూహాత్మ‌క అడుగులు... టీడీపీ పునాదుల‌పై దెబ్బ‌..!

Update: 2019-07-11 10:08 GMT
అతి.. స‌ర్వ‌త్ర గొడ‌వ‌ల‌కు దారితీస్తుంద‌ని పెద్ద‌లు ఎప్పుడో చెప్పారు. ఇక‌, ఈ గొడ‌వ‌లు కామ‌న్‌ గా అయితే, ఎవ‌రూ పెద్ద‌గా న‌ష్ట‌పోయేది ఉండ‌దు. అయితే, రాజ‌కీయంగా గొడ‌వ‌లు పెట్టుకుంటే మాత్రం చాలా అప్ర‌మ‌త్తంగా మాత్రం ఉండి తీరాలి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. కేంద్రంలోని బీజేపీతో 2014-2017 వ‌ర‌కు చంద్ర‌బాబు, ఆయ‌న టీడీపీ నేత‌లు ఎంత ప్రేమ‌గా ఉన్నారో.. 2017 త‌ర్వాత నుంచి మాత్రం అంతే క‌సి పెంచుకున్నారు. ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు.. ఎన్నిక‌లు, అధికారం వంటివాటిని దృష్టిలో పెట్టుకున్న చంద్ర‌బాబు.. బీజేపీతో క‌ర‌చాల‌నం మానుకుని ఖ‌డ్గ చాల‌నానికి నాంది ప‌లికారు. ఈ క్ర‌మంలోనే బీజేపీపై యుద్ధం ప్ర‌క‌టించారు. ఏకంగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీతోనే పెట్టుకున్నారు.

మోడీ ప్ర‌భుత్వం ఢిల్లీ గ‌ద్దె దిగేవ‌ర‌కు కూడా తాను పోరు కొన‌సాగిస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే అనేక ధ‌ర్మ పోరాటాలకు నాంది ప‌లికారు. ఎన్నిక‌ల్లో మోడీని గ‌ద్దె దింపాల‌ని దేశం మొత్తం తిరిగారు. క‌ట్ చేస్తే.. ఎన్నిక‌ల్లో మోడీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చారు. కానీ, చంద్ర‌బాబు చ‌తికిల ప‌డ్డారు. పార్టీ చ‌రిత్ర‌లోనే లేనంత ఘోర‌ప‌రాభ‌వాన్ని మూట‌క‌ట్టుకున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీపై క‌సి తీర్చుకునే వంతు బీజేపీ కోర్టులోకి వెళ్లింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి, కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ముప్పై రోజుల్లోనే న‌లుగురు కీల‌క టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను బీజేపీత‌న  పార్టీలోకి విలీనం చేసుకుంది.

స‌రే.. పోతే పోనీలే.. వారంతా ప్ర‌జాక్షేత్రంలో బ‌లం లేనివారు అని స‌రిపుచ్చుకున్నా.. ఇప్పుడు రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు మాత్రం టీడీపీని తీవ్రంగా ఇబ్బంది పెట్టేవే అంటున్నారు ప‌రిశీల‌కులు. బీజేపీలోకి చేరిన కీల‌క నేత‌ల‌ను అడ్డుపెట్టుకుని ఆ పార్టీ క్షేత్ర‌స్థాయిలో టీడీపీకి దెబ్బ‌కొట్టే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టిం ది. ఈ క్ర‌మంలోనే గుంటూరులో కీల‌క‌మైన నాయ‌కుడు, అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్ నేడో రేపో బీజేపీ ద‌ళంలో చేరేందుకు ప‌క్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఇక పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే ఉండ‌డంతో పాటు 2004లో దుగ్గిరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన చందు సాంబ‌శివ‌రావు లాంటి క‌మిట్‌మెంట్ ఉన్న నేత కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు.

ఇక‌, టీడీపీ సీనియర్‌ నేత, ప్రకాశం జడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబు బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా హరిబాబుకు, ఆయన కుమారుడు భరత్‌ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు జిల్లాకే చెందిన టీడీపీ సీనియర్‌ నేత, ఓ మాజీ మంత్రి కూడా  కమలం గూటికి చేరనున్నారని చర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే ఆయ‌న‌ టీడీపీకి రాజీనామా చేసే యోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఇక తాజాగా జేసీ లాంటి వాళ్లు అయితే త్వ‌ర‌లోనే టీడీపీ బీజేపీలో విలీనం అవుతుంద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దీనిని బ‌ట్టి అనంత టీడీపీలో ప‌లువురు కీల‌క నేత‌లు క‌మ‌లం వైపు చూస్తున్న‌ట్టు సందేహాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి కూడా పార్టీ మారిన సంగ‌తి తెలిసిందే. ఇలా మొత్తంగా టీడీపీ కూసాలు క‌దిలించేందుకు బీజేపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి బాబు వీటిని ఎలా అడ్డుకుంటాడో చూడాలి.



   
   
   

Tags:    

Similar News