ఆ కులం కోసం బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్‌..!

Update: 2019-07-06 08:41 GMT
ఏపీలో కుల రాజ‌కీయాలు బ‌లంగా ఉంటాయి. ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ కుల‌ స‌మీక‌ర‌ణాలే ప్ర‌భావితం చేస్తాయి. ఏపీలో ఎలాగైనా పాగా వేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న క‌మ‌ల‌ద‌ళం ఇప్పుడే కుల బ‌లం కోసమే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఆ దిశ‌గా వ్యూహాలు ర‌చిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ దారుణ ప‌రాజ‌యం పాలైంది. ఇదే స‌మ‌యంలో వైసీపీ మ‌రింత బ‌లంగా త‌యారైంది. ప్ర‌స్తుతం వైసీపీకి ప్ర‌త్యామ్నాయం ఏమీ లేదు. ఈ ప‌రిస్థితుల్లో ఆ స్థానాన్ని భ‌ర్తీ చేస్తూ.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి గెలుపు రుచి చూడాల‌న్న తాప‌త్ర‌యంతో క‌మ‌ల‌ద‌ళం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇందు కోసం కుల స‌మీక‌ర‌ణాల‌తో ప‌క్కా ప్లాన్ వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

టీడీపీ ఆవిర్భావం నుంచీ క‌మ్మ సామాజిక‌వ‌ర్గం మొత్తం కూడా ఎన్టీఆర్‌ కు అండ‌గా నిలిచింది. ఇదే స‌మ‌యంలో ఆ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వాళ్లు పారిశ్రామిక‌వేత్తలుగా, నేత‌లుగా.. ఇలా అన్నిరంగాల్లోనూ దూసుకుపోయారు. ఇక చంద్ర‌బాబు కూడా సొంత సామాజిక‌వ‌ర్గానికి పెద్ద‌పీట వేశారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీలో కూడా ప‌లువురు క‌మ్మ నేత‌లు బాగానే రాణించారు. ప‌ద‌వులు అనుభ‌వించారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో గెలిచిన త‌ర్వాత చంద్ర‌బాబు ఎక్కువ‌గా కాపు జ‌పం చేయ‌డం.. ఇదే స‌మ‌యంలో బాబుకు వ్య‌తిరేకంగా కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంట్రీ ఇవ్వ‌డం.. ప్ర‌జ‌ల్లోనూ బాబు పాల‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డం.. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయి కేవ‌లం 23 అసెంబ్లీ సీట్ల‌కే ప‌రిమితం కావ‌డం తెలిసిందే.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన పారిశ్రామికవేత్త‌లు, నేత‌లు టీడీపీలో కొన‌సాగే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. రాజ‌కీయంగా చంద్ర‌బాబు కూడా చాలా బ‌ల‌హీన‌ప‌డ్డారు. వార‌స‌త్వంగా ఎదుగుదామ‌న్నా లోకేశ్ నాయ‌క‌త్వ లోపంతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీంతో చంద్ర‌బాబు మ‌ళ్లీ కోలుకోక‌ముందే.. క‌మ్మ‌సామాజిక‌వ‌ర్గాన్ని త‌మ‌వైపు లాగేందుకు బీజేపీ పెద్ద‌లు ప్లాన్ వేస్తున్నారు. ఇప్ప‌టికే టీడీపీ నుంచి నాయ‌కులు క‌మ‌లం పార్టీలోకి క్యూక‌డుతున్నారు. ఏపీలో నిల‌దొక్కుకోవాలంటే.. కుల‌బ‌లం చాలా అవ‌స‌ర‌మ‌ని గ్ర‌హించిన క‌మ‌లం నేత‌లు ఆదిశ‌గా వేగంగా క‌దులుతున్నారు.

ప్ర‌స్తుతం కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. అయినా.. బీజేపీకి కాపుల నుంచి పెద్ద‌గా మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు. దీంతో క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు పార్టీలో పెద్ద పీఠ వేసి దూకుడు పెంచేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ఏపీ బీజేపీలో క‌మ్మలకు ప్రయార్టీ ఎక్కువే. పురందేశ్వ‌రి, సుజ‌నాచౌద‌రి, కంభంపాటి హ‌రిబాబు లాంటి వాళ్లు ఉన్నా వీళ్ల క‌న్నా ఇంకా గ‌ట్టి నేత‌ల కోసం బీజేపీ అన్వేష‌ణ  చేస్తోంది.

అందుకే .. మాజీ ముఖ్య‌మంత్రి నాదేండ్ల భాస్క‌ర్‌ రావు లాంటి నేత‌ల‌ను కూడా పార్టీలోకి తీసుకుంటున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితులు క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌లంద‌రూ చంద్ర‌బాబును పూర్తిగా న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఇప్పుడున్న సంక్లిష్ట రాజ‌కీయ ప‌రిస్థితుల్లో టీడీపీని న‌మ్మితే భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్న న‌మ్మ‌కం లేని క‌మ్మ నేత‌లంతా త‌మ‌కు క‌మ‌లం లాంటి పెద్ద‌పార్టీనే మేల‌ని భావిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకుని ఏపీలో పాగా వేయాల‌ని చూస్తున్న క‌మ‌ల‌ద‌ళం వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి మ‌రి.


    
    
    

Tags:    

Similar News