ట్రోలర్స్ కి ముడి సరుకుగా మారిన మహిళా ఏఎస్పీ... వీడియో వైరల్!

పాడ్ కాస్ట్ మధ్యలో... తనకు కాల్ వస్తోందని.. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్.హెచ్.ఓ) నుంచి ఆ కాల్ అని చెబుతూ... ఫోన్ రిసీవ్ చేసుకుంది.;

Update: 2025-12-28 23:30 GMT

ఓ పాడ్ కాస్ట్ కి హాజరైన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ).. మధ్యలో స్టేషన్ నుంచి ఫోన్ రావడం.. ఆ పాడ్ కాస్ట్ మధ్యలో ఆపి హుటాహుటున వెళ్లడం.. అనంతరం గంటలో తిరిగి వచ్చి, ఇప్పుడే మర్డర్ కేసు సాల్వ్ చేసి వచ్చానని చెప్పడం.. మొదలైన విషయాలతో ఆమె వ్యవహారం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ట్రోలర్స్ కు మీమర్స్ కు ఆమె ఇప్పుడు ముడి సరుకుగా మారిపోయారని అంటున్నారు.

అవును... ఒక హత్య కేసుపై స్పందించడానికి పాడ్‌ కాస్ట్ నుండి అకస్మాత్తుగా నిష్క్రమించినట్లు చూపించే వీడియో వైరల్ కావడంతో పాకిస్తానీ పోలీసు అధికారిణి ఆన్‌ లైన్‌ లో ట్రోల్ అవుతోంది. ఇందులో భాగంగా... లాహోర్‌ కు చెందిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షెహర్‌ బానో నఖ్వీ ఇంటర్వ్యూ మధ్యలో ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుని, ఒక గంట తర్వాత కేసును హ్యాండిల్ చేసి తిరిగి వస్తున్నట్లు కనిపించింది.

పాడ్ కాస్ట్ మధ్యలో... తనకు కాల్ వస్తోందని.. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్.హెచ్.ఓ) నుంచి ఆ కాల్ అని చెబుతూ... ఫోన్ రిసీవ్ చేసుకుంది. ఈ సమయంలో.. ఎస్ ఖుర్రాం.. అవునా.. ఎక్కడ.. వాడిని పట్టుకున్నారా.. వెరీ గుడ్.. ఆగు నేను వస్తున్నాను.. అంటూ కాల్ చేసిన వ్యక్తితో చెప్పిన ఏఎస్పీ.. ఒక హత్య జరిగింది, నేను ఆ కేసును త్వరగా ఫినిష్ చేసి మళ్లీ జాయి అవుతాన్నట్లుగా హుటాహుటున వెళ్లిపోయారు.

కట్ చేస్తే... సుమారు ఒక గంట తర్వాత సదరు మహిళా ఏఎస్పీ నఖ్వీ తిరిగి వచ్చారు. ఈ సమయంలో.. వెళ్లిన అత్యవసర పరిస్థితి గురించి ఆమెను పాడ్‌ కాస్టర్ అడిగాడు. దీంతో.. అది హత్య అని ధృవీకరించిన నఖ్వీ... ఇది డిఫెన్స్ ఫేజ్ ఏ, కే బ్లాక్‌ లో జరిగిందని.. నిందితుడు, బాధితుడు స్నేహితులు అని.. డబ్బు విషయంలో ఇద్దరి మధ్యా నెలకొన్న వివాదమే ఈ హత్యకు కారణమని చెప్పుకొచ్చారు!

ఈ సమయంలో బాధితుడి బంధువులు పోలీసులను ఆశ్రయించారని.. నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని.. ఈ సమయంలో ఇంటి లోపల బందీలుగా ఉన్నవారిని సురక్షితంగా రక్షించామని ఆమె వెల్లడించారు. పోలీసులు హంతకుడిని పట్టుకున్నారని.. పోలీసులు వచ్చేసరికే బాధితుడు మృతి చెందాడని.. ఆ ఇంటి డ్రాయింగ్ రూమ్ లో మృతదేహం దొరికిందని ఆమె అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

దీంతో నెటిజన్లు సదరు ఏఎస్పీపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. "ఈ స్క్రిప్ట్ ఎవరు రాశారు?" అని ఒకరంటే... "అంతా ఒక్క గంటలో జరిగిపోవడం నిజంగా అద్భుతం" అని మరొకరు వెటకారమాడారు! ఇదే సమయంలో... "ఇది మామూలు యాక్టింగ్ కాదని.. ఇది కిడ్నీ-టచింగ్ యాక్టింగ్" అంటూ మరొకరు స్పందించారు. ఇంకొంతమంది మాత్రం పాడ్ కాస్ట్, పబ్లిసిటీ కంటే పని ముఖ్యమని ఈమె నిరూపించారని ప్రశంసిస్తున్నారు.



Tags:    

Similar News