సిగరెట్ వెలిగించకుండానే పొగ వచ్చే షాకింగ్ విషయం ఇది!
వాస్తవానికి సెంట్రల్ ఎక్సైజ్ చట్టం - 1947 ప్రకారం... సిగరెట్ల పొడవు, రకాన్ని బట్టి ప్రతీ 1,000 స్టిక్కులకు రూ.200 నుంచి రూ.735 వరకూ సుంకం ఉంటుంది.;
తాజాగా వైరల్ అవుతోన్న ఓ పోస్టు ప్రకారం.. ధూమపాన ప్రియులకు సిగరెట్ వెలిగించకుండానే ఈసారి చెవుల్లోంచి పొగ వచ్చే ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది! ఇందులో భాగంగా... ప్రస్తుతం రూ.18 గా ఉన్న సిగరెట్ ధర త్వరలో రూ.72 కానుంది. అందుకు కారణం తాజాగా పార్లమెంటు ఆమోదించిన సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు - 2025 అని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
అవును... త్వరలో సిగరెట్ అంటించకుండానే పొగ వచ్చే పరిస్థితులు రావొచ్చని అంటున్నారు. ధూమపానాన్ని అరికట్టడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచే ఉద్దేశ్యంలో భాగంగా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... రూ.18 గా ఉన్న ఒక సిగరెట్ ధర రూ.72 కు చేరుకోవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ విషయాన్ని నెట్టింట పలువురు స్వాగతిస్తుండగా.. మరికొంతమంది వ్యతిరేకిస్తూ కారణాలు చెబుతున్నారు!
ఇటీవల పార్లమెంట్ సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు - 2025ను ఆమోదించింది. రాజ్యసభ ఈ చట్టాన్ని ఆమోదించి లోక్ సభకు తిరిగి పంపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రవేశ పెట్టిన ఈ బిల్లు... సిగరెట్లు, హుక్కా పొగాకు, సిగార్లు, నమిలే పొగాకు, జర్దా మొదలైన పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు, సెస్ లను సవరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే సిగరెట్ ధరలు సుమారు 400% పెరగొచ్చని అంటున్నారు.
వాస్తవానికి సెంట్రల్ ఎక్సైజ్ చట్టం - 1947 ప్రకారం... సిగరెట్ల పొడవు, రకాన్ని బట్టి ప్రతీ 1,000 స్టిక్కులకు రూ.200 నుంచి రూ.735 వరకూ సుంకం ఉంటుంది. అయితే తాజా సవరణ ప్రకారం 1,000 సిగరెట్లకు సుంకాలు రూ.2,700 నుంచి రూ.11,000 వరకూ పెరుగుతాయి! ఇందులో.. నమిలే పొగాకుపై 25% నుంచి 100%.. హుక్కా పొగాకుపై 25% నుంచి 40%.. పైపుల కోసం స్మోకింగ్ మిశ్రమాలపై 60% నుంచి 325%కి గణనీయ పెరుగుదల ఉండనుందని అంటున్నారు!
ఈ ప్రచారంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఇదే నిజమైతే భారతదేశలో ధూమపానం చేసేవారి సంఖ్య.. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు సంఖ్యను తగ్గిస్తుందని పలువురు ఆశిస్తున్నారు. మరోవైపు ఈ అధిక ధరలు కొంతమంది ధూమపానం మానేయడానికి సహకరిస్తే.. ఇంకొంతమంది ఈ-సిగరెట్ లు వంటి ప్రత్యామ్నాయాలకు మారే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ సమయంలో మరికొంతమంది యూజర్లు ఈ ప్రచారంపై హాస్యం, వ్యంగం మిక్స్ చేసి స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... దేశ రాజధాని ఢిల్లీలో గాలి పీల్చేవారి పరిస్థితితో పోలిస్తే ధూమపానం చిన్న విషయమే అని అంటున్నారు. ఏది ఏమైనా తాజా ప్రచారం మాత్రం సంచలనంగా మారింది. ఇదే సమయంలో.. సిగరెట్ల ధర దాదాపు 400 శాతానికి పెరిగే అవకాశం ఉండదని.. కాకపోతే బ్రాండ్ ని బట్టి మాత్రం కచ్చితంగా భారీ పెరుగుదల ఉండొచ్చని చెబుతున్నారు.