ములాయం కుటుంబంలో బీజేపీ చిచ్చు

Update: 2022-01-20 05:47 GMT
మొత్తానికి కష్టపడి ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో బీజేపీ చిచ్చు పెట్టగలిగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఎంఎల్ఏలు పార్టీకి రాజీనామా చేసి ఎస్పీలో చేరటంతో బీజేపీ అగ్ర నేతలకు చాలా పెద్ద షాకే తగిలింది. ఊహించని రీతిలో తగిలిన షాకును కమలనాథులు తట్టుకోలేకపోయారు. అయితే తర్వాత తేరుకుని ములాయం కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు  ప్రయత్నించి కొంతమేర సక్సెస్ అయ్యారు.

ములాయం రెండో భార్య సాధనా గుప్తా కోడలు అపర్ణ యాదవ్ ను తమ పార్టీలో చేర్చుకున్నారు. అపర్ణ భర్త ప్రతీక్ యాదవ్, సాధన గుప్తా సోదరుడు ప్రమోద్ గుప్తా కూడా తొందరలోనే బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సవతి సోదరుడు ప్రతీక్ ఆయన భార్య అపర్ణ ఎస్పీని వదలి వెళ్ళటాన్ని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే వీళ్ళకు మొదటి నుండి ఏమాత్రం పడదు.

చాలా కాలంగా ప్రతీక్+అపర్ణకు రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని ఉన్నా అఖిలేష్ తొక్కి పెడుతున్నాడు. గతంలో కూడా వీళ్ళకు టికెట్లివ్వటాన్ని అఖిలేష్ ఒప్పుకోలేదు. కాకపోతే అప్పట్లో పార్టీ అంతా ములాయంసింగ్ యాదవ్ చేతుల్లో ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోయాడు. ఎప్పుడైతే పార్టీ మీద అఖిలేష్ పెత్తనం మొదలైందో అప్పటి నుండే సవతి సోదరుడు, ఆయన భార్యను తొక్కేయటం మొదలుపెట్టాడు. రాబోయే ఎన్నికల్లో వీళ్ళిద్దరికీ టికెట్లిచ్చేది కూడా అనుమానంగానే ఉంది.

పొత్తులు, టికెట్ల కేటాయింపు మొదలైన తర్వాత గతంలో వీళ్ళిద్దరు పోటీ చేసిన నియోజకవర్గాలను మిత్రపక్షాలకు, బీజేపీ నుండి వస్తున్న వాళ్ళకు అఖిలేష్ కేటాయించేశారు. దాంతో తమకు టికెట్లు దక్కవని వీళ్ళకు బాగా అర్ధమైపోయింది. అందుకనే ముందుగా అపర్ణ యాదవ్ ఎస్పీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. మరి ఈమెకు బీజేపీ ఎక్కడ టికెట్ ఇస్తుందో చూడాలి. అలాగే తొందరలోనే ప్రతీక్ యాదవ్, ప్రమోద్ గుప్తా కూడా బీజేపీలో చేరటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. చివరకు ఏమవుతుందో చూడాలి. 
Tags:    

Similar News