ట్రంప్ తో డిబేట్ కి నో చెప్పిన బిడెన్.. కారణం ఇదే!

Update: 2020-10-07 11:30 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న సమయంలో లో అధ్యక్షుడు , రిపబ్లికన్‌ అభ్యర్ధి ట్రంప్‌ కరోనా బారిన పడటం, ఇప్పటికీ ఆయనకు కరోనా తగ్గలేదన్న ప్రచారం సాగుతుండటంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ట్రంప్‌ తో ఇప్పటికే ఓ సారి అధ్యక్ష ఎన్నికల డిబేట్‌ లో పాల్గొన్న డెమోక్రాట్‌ అభ్యర్ధి బిడెన్‌ మరోసారి మాత్రం డిబేట్‌ పాల్గొనడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాడు. ట్రంప్‌కు కరోనా సోకడం, ఆయన నుంచి వైట్‌హౌస్‌లో మరికొందరికి సోకిందన్న వార్తలు రావడంతో అధ్యక్ష ఎన్నికల్లో ఆయనతో పోటీపడుతున్న డెమోక్రాట్‌ అభ్యర్ధి జో బిడెన్‌ అప్రమత్తమయ్యారు.

ఈ నెల 15న అధ్యక్ష ఎన్నికల రెండో డిబేట్ జరగాల్సి ఉండగా.. ట్రంప్‌ కు కరోనా తగ్గకపోతే ఈ డిబేట్‌ నిర్వహించకపోవడమే మంచిదని బిడెన్ అన్నారు. మియామీలో జరగాల్సిన ఈ డిబేట్ ‌కు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బిడెన్‌ అభిప్రాయపడ్డారు. పెన్సిల్వేనియాలో తాజాగా మీడియాతో మాట్లాడిన బిడెన్‌ ట్రంప్‌ కు కరోనా తగ్గకపోతే ఈ డిబేట్‌ నిర్వహించడం మంచిది కాదు అని చెప్పారు. ట్రంప్‌ తాజా పరిస్ధితి ఏంటో తనకూ తెలియదని, అయితే ఆయన ఫిట్‌గా ఉంటే మాత్రం డిబేట్‌కు తాను సిద్ధమని, అన్ని జాగ్రత్తలు తీసుకుని డిబేట్‌ నిర్వహించాల్సిన అవసరం ఉందని బిడెన్‌ తెలిపారు.

ఈ వ్యాఖ్యలపై బిడెన్‌ ప్రచార ప్రతినిధి టిమ్‌ స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్‌ రెండో డిబేట్‌ కల్లా కచ్చితంగా కోలుకుని పాల్గొంటారన్నారు. ఈ విషయంలో బిడెన్‌ అంచనాలేవీ నిజం కాబోవన్నారు. మరోవైపు ట్రంప్‌కు కరోనా కచ్చితంగా తగ్గిందా లేదా అన్న దానిపై నిర్ధిష్ట సమాచారం లేకపోవడంతో రిపబ్లికన్‌ పార్టీ వర్గాలతో పాటు డెమోక్రాట్లలోనూ ఉత్కంఠ నెలకొంది.
Tags:    

Similar News