పిల్ మీద పిల్.. లాయర్ సచిన్ గుప్తా మీద సుప్రీం సీరియస్
ఒక న్యాయవాదిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనికి కారణం.. అదే పనిగా.. సరైన కారణాలు లేకుండానే పిల్ రూపంలో పిటిషన్లు దాఖలు చేయటం.;
ఒక న్యాయవాదిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనికి కారణం.. అదే పనిగా.. సరైన కారణాలు లేకుండానే పిల్ రూపంలో పిటిషన్లు దాఖలు చేయటం. వీటిల్లో అత్యధికం అర్థరహితంగా ఉండటమే కాదు.. పెద్ద ఎత్తున దాఖలు చేస్తూ.. సుప్రీంను ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. పాపులర్ అయ్యే క్రమంలో బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పొట్టిగా చెప్పాలంటే పిల్ పేరుతో అదే పనిగా ఆయన దాఖలు చేస్తున్న వైనాన్ని తాజాగా సుప్రీం సీరియస్ అయ్యింది. ఇంతకూ అతడెవరు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటాడు? తదితర వివరాల్లోకి వెళితే..
ఢిల్లీకి చెందిన సచిన్ గుప్తా న్యాయవాది. ఢిల్లీ హైకోర్టులోనూ.. సుప్రీంకోర్టును ప్రాక్టీస్ చేస్తుంటారు. 2004లో ఢిల్లీ వర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన.. పూర్వరంగంలో బీటెక్ పూర్తి చేశారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్.. కార్పొరేట్ లిటిగేషన్ లో ఆయనకు పదిహేనేళ్లకు పైనే అనుభవం ఉంది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తో పాటు ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడిగా చురుకైన పాత్రను పోషిస్తారన్న మాట న్యాయవాద వర్గాలు చెబుతుంటాయి.
ఇలాంటి ట్రాక్ ఉన్న సచిన్ గుప్తా.. ఇటీవల కాలంలో అర్థరహితమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పెద్ద ఎత్తున దాఖలు చేయటం.. అవన్నీ ఆయన సొంతం కావటంతో వార్తల్లోకి ఎక్కారు. భారీగా పిల్స్ దాఖలు చేయటమే కాదు.. ఆయన వేసే పిల్స్ పై సుప్రీంకోర్టు సైతం అసహనం వ్యక్తం చేయటం గమనార్హం. ఇటీవల కాలంలో ఆయన ఏకంగా పాతిక ప్రజాప్రయోజన వ్యాజ్యాల్ని దాఖలు చేశారు. అయితే.. అందులో ప్రజాప్రయోజనం అనే కన్నా.. ఇతర అంశాలే ఎక్కువగా ఉండటం సుప్రీం ఆగ్రహానికి కారణమైంది.
ఆయన దాఖలు చేసే ప్రజాప్రయోజన వ్యాజ్యాలు ఎలా ఉంటాయనటానికి నిదర్శనంగా కొన్ని ప్రస్తావిస్తే.. ఆయన తీరు ఇట్టే అర్థమైపోతుంది.
- ఉల్లి, వెల్లుల్లిలో ప్రతికూల శక్తి ఉంటుందా? అనే అంశంపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని ఆదేశించండి
- స్నానానికి వాడే సబ్బులో బ్యాక్టీరియాను మాత్రమే చంపే రసాయనాలు వాడాలి. శరీరానికి హాని కలిగించేవి వాడొద్దని ఆదేశాలు జారీ చేయాలి.
- మద్యం.. పొగాకు ఉత్పత్తుల్లోని హానికరమైన రసాయనాలను తొలగించడానికి సాంకేతికతను ఉపయోగించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి
- 'పాలి' భాషకు ఇచ్చిన శాస్త్రీయ భాషా హోదాకు సవాలు. శాస్త్రీయ మాండలికాలను ప్రకటించడానికి ప్రత్యేక మార్గదర్శకాలు ఉండాలి.
- పాలి భాషను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలి.
- నమోదు కాని ఆస్తులన్నింటినీ తప్పనిసరిగా రిజిస్టర్ చేసేలా విధానాలను రూపొందించాలి.
ఇలా ఆయన దాఖలు చేసే పిటిషన్లపై తాజాగా సుప్రీం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘పిటిషన్లు అన్నీ అస్పష్టంగా ఉన్నాయి. వీటిని తయారు చేయటంలో కనసీ ఆలోచన కూడా లేదు. ఒక న్యాయవాది కావటంతో ఫైన్ వేయకుండా వదిలేస్తున్నాం. లేదంటే భారీ ఫైన్ విధించేవాళ్లం. మీకు ఇలాంటి వింత ఆలోచనలు అర్థరాత్రి పూట వస్తాయా? వీటిని పిటిషన్లుగా మార్చి కోర్టు సమయాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు?’’ అంటూ మండిపడింది. ఇక.. సచిన్ దాఖలు చేసిన ఉల్లి.. వెల్లుల్లి పిటిషన్ పై స్పందిస్తూ.. పిటిషనర్ తన ఇష్టానికి తగ్గట్లు ఉల్లిపాయలు తినొచ్చు. లేదంటే మానేయొచ్చు. అంతేకానీ.. ఇలాంటి వాటిల్లోకి కోర్టును లాగొద్దంటూ పిటిషన్ కొట్టేసింది.
సచిన్ గుప్తా కారణంగా ప్రజా ప్రయోజన దుర్వినియోగానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏకంగా కొత్త మార్గదర్శకాల్ని జారీ చేయటం విశేషం. అందులో పేర్కొన్న కీలక అంశాల్ని చూస్తే..
- ఏదైనా ప్రజాసమస్యపై నేరుగా కోర్టుకు రావొద్దు. ముందుగా సంబంధిత ప్రభుత్వ అధికారులు లేదంటే ఆయా విభాగాలను సంప్రదించి.. వారికి ఆ విషయాల్ని వెల్లడించాలి.
- సంబంధిత అధికారులు స్పందించని పక్షంలోనే కోర్టును ఆశ్రయించాలి.
- పిటిషన్లు వేసే ముందు సమస్యపై లోతైన అధ్యయనం.. గణాంకాలు.. చట్టబద్దమైన ఆధారాల్ని కలిగి ఉండాలి.
- కేవలం వార్తల్లో నిలిచేలా పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేసన్స్ ను అనుమతించం.
- రాజ్యాంగబద్ధమైన కోర్టులను ‘పిఐఎల్’ షాపులుగా మార్చొద్దు. ఇష్టానుసారంగా పిటిషన్లు వేస్తూ కోర్టు సమయాన్ని వేస్ట్ చేయొద్దు.
- అర్థరహితమైన పిటిషన్లు జారీ చేసే వారికి భారీ జరిమానా విధిస్తాం.
- ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఉద్దేశించిన ఆర్టికల్ 32ను చిన్న చిన్న కారణాలకు.. అస్పష్టమైన వాదనలకు వాడొద్దు.